Skip to main content

ప్రముఖ సాహితీవేత్త ఛాయాదేవి కన్నుమూత

ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి (85) ఇకలేరు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె జూన్ 28న హైదరాబాద్‌లోని చండ్ర రాజేశ్వర్‌రావు వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. తన కోరిక మేరకు ఆమె భౌతిక కాయాన్ని ఈఎస్‌ఐ వైద్య కళాశాలకు అప్పగించారు. అలాగే కళ్లను ఎల్వీ ప్రసాద్ వైద్యులు సేకరించారు. 1933, అక్టోబర్ 13న రాజమండ్రిలో మద్దాల వెంకటాచలం, రమణమ్మ దంపతులకు ఛాయదేవి జన్మించారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు ఆమె భర్త. ఆయన చాలాకాలం క్రితమే చనిపోయారు.

తన సోదరుడు మద్దాల గోపాలకృష్ణ భార్య, ప్రముఖ రచయిత్రి రుక్మిణి స్ఫూర్తిగా ఛాయాదేవి ఎన్నో కథలు రాశారు. బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. బోన్‌సాయ్ బ్రతుకు కథని 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో పెట్టింది. ఆమె రాసిన ’తన మార్గం’ కథా సంపుటికి 2005లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1996లో తెలుగు విశ్వవిద్యాలయం అవార్డును, 2003లో వాసిరెడ్డి రంగనాయకమ్మ ప్రతిభా పురస్కారాన్ని ఆమె అందుకున్నారు. ఛాయాచిత్ర కథనం పేరిట బాల్యం నుంచి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో తన జీవిత చరిత్రను వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. స్త్రీల జీవితాల్లోని దృక్కోణాలను కథల్లో ఛాయాదేవి ఆవిష్కరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత్రి కన్నుమూత
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : అబ్బూరి ఛాయాదేవి (85)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 29 Jun 2019 06:16PM

Photo Stories