ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చలు
Sakshi Education
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యూఢిల్లీలో అక్టోబర్ 5న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గోదావరి-కృష్ణా అనుసంధానం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీతోపాటు పలు అంశాలపై ప్రధానితో సీఎం చర్చించారు.
వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అదనంగా మరో రూ.40 వేల కోట్లు ఇవ్వాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు.
ప్రధానితో సీఎం జగన్ చర్చించిన ముఖ్యాంశాలు
ప్రధానితో సీఎం జగన్ చర్చించిన ముఖ్యాంశాలు
- రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేలిమలుపు తిప్పే కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాలి.
- పోలవరం పనుల్లో 2014-19 మధ్య అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు పాత కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించాం. పోలవరంలో రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పటికే రూ.838 కోట్లు ఆదా అయ్యాయి.
- రూ.55,548 కోట్లతో ప్రతిపాదించిన పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదల చేయాలి.
- విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్‌లకు తగిన రీతిలో నిధులు విడుదల చేయాలి.
- ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి తరహాలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. బుందేల్‌ఖండ్, కలహండిలో తలసరి రూ.4 వేలు కేటాయించారు. కానీ, ఏపీలో మాత్రం ఆ మొత్తం కేవలం రూ.400 మాత్రమే. అందువల్ల ఈ ప్యాకేజీ మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడ్డ జిల్లాలకు సంబంధించి మిగతా నిధులు విడుదల చేయాలి.
- ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలి.
- నిధులు విడుదల చేసి రాజధాని నిర్మాణానికి తోడ్పాటు అందించాలి.
- రెవెన్యూ లోటు కింద ఇంకా రూ.18,969.26 కోట్లను విడుదల చేయాలి. సవరించిన లెక్కల మేరకు రెవెన్యూ లోటును భర్తీ చేయాలి.
- వ్యవసాయ పెట్టుబడి కింద రైతులకు ఆర్థిక సాయం అందించే రైతు భరోసా పథకాన్ని నెల్లూరు జిల్లాలో ప్రారంభించేందుకు అక్టోబర్ 15న రాష్ట్రానికి రావాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు.
Published date : 07 Oct 2019 07:00PM