Skip to main content

పెట్టుబడులకు..ప్రపంచంలోనే అత్యంత అనువైన దేశం బారత్

పెట్టుబడులు పెట్టేందుకు భారత్.. ప్రపంచంలోనే అత్యంత అనువైన దేశమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
రాజకీయ స్థిరత్వం, వ్యాపారాలకు అనువైన సంస్కరణలు ఇందుకు తోడ్పడుతున్నాయని చెప్పారు. ‘2024 నాటికి భారత్ అయిదు లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని లక్ష్యించుకుంది. ఇందులో భాగంగా ఇన్‌ఫ్రా రంగానికే 1.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కావాలి. అందుకని భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి. అపరిమిత అవకాశాలు అందిపుచ్చుకోండి’ అని కార్పొరేట్లను ఆయన ఆహ్వానించారు. బ్రిక్స్ కూటమి బిజినెస్ ఫోరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. అయిదు సభ్య దేశాల బ్రిక్స్ కూటమి మాత్రం ఆర్థిక వృద్ధికి సారథ్యం వహిస్తోందని ఆయన చెప్పారు. ‘ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 50% బ్రిక్స్ దేశాలదే. అంత ర్జాతీయంగా మందగమనం ఉన్నా బ్రిక్స్ దేశాలు వృద్ధి నమోదు చేయడంతో పాటు కోట్ల మందిని పేదరికం నుంచి బైటికి తెచ్చాయి. కొంగొత్త సాంకేతిక ఆవిష్కరణలు చేశాయి’ అని మోదీ చెప్పారు. బ్రెజిల్, భారత్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా కలిసి బ్రిక్స్ కూటమిని ఏర్పాటు చేశాయి.

భవిష్యత్ ప్రణాళిక అవసరం...
బ్రిక్స్ కూటమి ఏర్పాటై పదేళ్లయిన నేపథ్యంలో భవిష్యత్తు కోసం సరికొత్త ప్రణాళికలను రూపొందించుకోవాలని మోదీ సూచించారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరిగేలా వ్యాపార నిబంధనలు సరళతరం కావాలన్నారు. సభ్య దేశాలు కలిసి పనిచేసేందుకు వీలున్న రంగాలు గుర్తించాలని, పరస్పరం సహకరించుకుని ఎదగాలని ప్రధాని సూచించారు. ‘ఒక దేశానికి టెక్నాలజీ ఉండొచ్చు. మరో దేశం ముడివనరులు సరఫరా చేస్తుండవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ టెక్నాలజీ, ఎరువులు, వ్యవసాయోత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్.. పరస్పరం సహకరించుకునేందుకు ఇలాంటి అనువైన రంగాలెన్నో ఉన్నాయి. వచ్చే బ్రిక్స్ సదస్సు నాటికి ఇలాంటివి కనీసం 5 రంగాలైనా గుర్తించి, జాయింట్ వెంచర్స్‌కి అవకాశాలను అధ్యయనం చేయాలి’ అని చెప్పారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
పెట్టుబడులు పెట్టేందుకు భారత్.. ప్రపంచంలోనే అత్యంత అనువైన దేశమని
ఎప్పుడు: నవంబర్ 14, 2019
ఎవరు: ప్రధాని నరేంద్ర మోదీ
Published date : 15 Nov 2019 05:16PM

Photo Stories