Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 24th కరెంట్ అఫైర్స్
Supreme Court: సుప్రీంకోర్టులో మరో 4 ప్రత్యేక ధర్మాసనాలు
సుప్రీంకోర్టులో మరో నాలుగు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 23న తెలిపారు. క్రిమినల్ కేసులు, ప్రత్యక్ష–పరోక్ష పన్నులు, భూసేకరణ, వాహన ప్రమాదాల క్లెయిమ్‌లకు సంబంధించిన కేసులను విడివిడిగా విచారించేందుకు ఈ నాలుగు సుప్రీం బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ కొత్త బెంచ్‌లు వచ్చే వారం నుంచి తమ పనులు మొదలుపెట్టనున్నాయి. సుప్రీంకోర్టులో ఓ కేసుకు సంబంధించి న్యాయవాది అత్యవసర విచారణ కోరిన సమయంలో సీజేఐ పై విధంగా స్పందించారు. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ భూసేకరణకు సంబంధించిన కేసులను విచారించనుందని సీజేఐ సూత్రప్రాయంగా తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల అంశాలు పరిష్కరించే బెంచ్ బుధ, గురువారాల్లో ఉంటుందని వెల్లడించారు.
Inspiration Story: ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి..వేల కోట్లు సంపాదించాడిలా..
AP Congress Chief: ఏపీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, పద్మశ్రీ సుంకర, పి.రాకేశ్‌రెడ్డి నియామకాల ప్రతిపాదనను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నవంబర్ 23న ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు, ప్రచార కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్, మీడియా–సోషల్ మీడి యా కమిటీ చైర్మన్‌గా ఎన్.తులసిరెడ్డిలకు అవకాశం కల్పించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఊమెన్ చాందీతో పాటు 18 మంది, కోఆర్డినేషన్ కమిటీలో 33 మంది నేతలతో పాటు పీసీసీ విభాగాల అధ్యక్షులు ఉంటారని ఏఐసీసీ వెల్లడించింది. పీసీసీ తాజా మాజీ అధ్యక్షుడు శైలజానాథ్‌కు రాజకీయ వ్యవహారాలు, కో–ఆర్డినేషన్ కమిటీల్లో చోటు కల్పించారు.
Mass Shooting: అమెరికాలో కాల్పులు.. ఆరుగురి దుర్మరణం
అమెరికా మరోసారి తుపాకీ మోతతో దద్దరిల్లింది. నవంబర్ 22న వర్జీనియా రాష్ట్రంలోని చెసాపీక్ నగరంలోని వాల్‌మార్ట్ షాపింగ్‌మాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. థ్యాంక్స్‌గివింగ్ డేను పురస్కరించుకుని స్థానికుల షాపింగ్‌తో వాల్‌మార్ట్ స్టోర్ రద్దీగా ఉంది. అదే స్టోర్‌కు మేనేజర్‌గా భావిస్తున్న ఒక ఆగంతకుడు స్టోర్‌లోని విరామ గదిలో ఉన్న సహోద్యోగులపైకి పిస్టల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత తనను తానే కాల్చుకుని చనిపోయాడు.
IPS Success Story : ఈ అసంతృప్తితోనే.. ఐపీఎస్ సాధించా.. కానీ..
Suryakumar Yadav: నంబర్‌వన్ బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్
భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నంబర్‌వన్ ర్యాంక్ మరింత పటిష్టమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా టి20 ర్యాంకింగ్స్‌లో సూర్య తన టాప్ ర్యాంక్‌ను పదిలపర్చుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్ రెండో మ్యాచ్‌లో సూర్య వీరోచిత మెరుపు సెంచరీతో అదరగొట్టాడు. దీంతో 31 రేటింగ్ పాయింట్లు పెరగడంతో 890 పాయింట్లతో నంబర్‌వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో పాక్ ఓపెనర్ రిజ్వాన్ (836) ఉన్నాడు.
US Visa: అమెరికా వీసా కావాలంటే 1000 రోజులు
రోజురోజుకీ అమెరికా వీసాల కోసం నిరీక్షణ సమయం పెరిగిపోతోంది. అమెరికా బిజినెస్ (బీ–1), టూరిస్ట్ (బీ–2) వీసాల కోసం ఎదురుచూడాల్సిన సమయంతొలిసారిగా వేయి రోజులకు చేరింది. ఇప్పటికిప్పుడు అమెరికన్ వీసా కోసం భారతీయులు దరఖాస్తు చేసుకుంటే 2025 నాటికి ఇంటర్వ్యూకి పిలుపు వస్తుందని అమెరికా విదేశాంగ శాఖ నివేదించింది. ముంబై వాసులు 999 రోజులు, హైదరాబాద్‌వాసులు 994 రోజులు, ఢిల్లీ 961 రోజులు, చెన్నై 948 రోజులు, కోల్‌కతా వాసులు 904 రోజులు ఇంటర్వ్యూ కోసం నిరీక్షించాల్సి ఉందని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారి చెప్పారు. అత్యవసరంగా ఎవరైనా అమెరికా వెళ్లాలనుకుంటే కారణాలు చూపిస్తే అపాయింట్‌మెంట్ వెంటనే ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అమెరికా కళాశాలల్లో అడ్మిషన్లు ఉండటంతో విద్యార్థి వీసాలు మంజూరుకు ప్రాధాన్యతనివ్వడంతో ఇతర వీసాల వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోయింది.
70 ఏళ్లలో పది పాస్.. ఈ పెద్దాయన ఆశయం ఏమిటంటే..
Babu Mani: భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ మ`తి
భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ బాబు మణి(59) నవంబర్ 20వ తేదీ మరణించారు. ఆయన కాలేయ సంబంధిత సమస్యలతో చాలా కాలంగా భాదపడుతున్నాడు. 1984 నెహ్రూ కప్ సందర్భంగా కోల్‌కతాలో అర్జెంటీనాపై అరంగేట్రం చేశాడు. 55 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 1984లో ఏఎఫ్సీ ఆసియా కప్‌కు అర్హత సాధించిన మొదటి భారత జట్టులో సభ్యుడు. రెండుసార్లు(1985 మరియు 1987) ఎస్ఏఎఫ్ ఆటలో బంగారు పతకాలు సాధించారు.
Bruce Lee Death: బ్రూస్ లీ మరణం.. నమ్మలేని నిజం.. అసలు కారణం ఏంటి..?
తరాలు మారుతున్న మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తికనబరిచే యువతకు ఆదర్శం బ్రూస్ లీనే. ఈయన మార్షల్ ఆర్ట్స్‌కు ఐకాన్. ముఖ్యంగా చైనీస్ మార్షల్ ఆర్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ఆదరణ సాధించి పెట్టిన కుంగ్‌ఫూ వీరుడు. మార్షల్ ఆర్ట్స్ ప్రియులౖకైతే అక్షరాలా ఆరాధ్య దైవమే. బతికింది కొన్నేళ్లే అయినా మార్షల్ ఆర్ట్స్‌కు మారుపేరుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మరణించి తరాలు గడుస్తున్నా ఆయనకు ఆదరణ నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఎంటర్ ద డ్రాగన్‌తో సహా బ్రూస్ లీ తీసిన హాలీవుడ్ సినిమాలన్నీ మాస్టర్‌పీస్‌లుగా నిలిచి ఇప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి.
బ్రూస్ లీ మరణానికి కారణం ఇదే..
ఈ యాక్షన్ వీరుడు కేవలం 32 ఏళ్ల వయసులో హఠాత్తుగా మరణించి అభిమానులను శోకసంద్రంలో ముంచాడు. అందుకు కారణమేమిటన్నది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రత్యర్థులు హతమార్చారని, ఎండ దెబ్బ కొట్టిందని, కొకైన్ మితిమీరి వాడాడని.. ఇలా రకరకాల పుకార్లే తప్ప నిజమేమిటో ఎవరికీ తెలియదు. అయితే మంచినీళ్లు మితిమీరి తాగడమే బ్రూస్ లీ మరణానికి దారి తీసిందని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది...!
బ్రూస్ లీ 1973 జూలై 20న హాంకాంగ్‌లో మరణించాడు. హైపోనాట్రేమియానే అందుకు దారి తీసిందని మాడ్రిడ్‌లోని ఐఐఎస్–ఫౌండేషన్ జిమెనెజ్ డియాజ్ యూఏఎస్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ పరిశోధకులు అంటున్నారు. నీళ్లు అతిగా తాగడం వల్ల ఒంట్లో సోడియం గాఢత తగ్గడాన్ని హైపోనాట్రేమియా అంటారు. గుండె, మూత్రపిండాల వంటివి సజావుగా పనిచేయడంలో సోడియం పాత్ర అతి కీలకం.
నీళ్లు మితిమీరి తాగితే సోడియం నీళ్లలో కలిసిపోయి మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతూ ఉంటుంది. చాలాకాలం ఇలా జరిగితే ఒంట్లో సోడియం లోపం తలెత్తి కణాలు క్రియారహితంగా మారతాయి. కిడ్నీలు ఫెయిలవుతాయి. అదనపు నీరు ఒంట్లోంచి బయటికి వెళ్లదు. బ్రూస్ లీ విషయంలో సరిగ్గా ఇదే జరిగిందని అధ్యయనం చెబుతోంది. ఫలితంగా మెదడు వాచి మరణానికి దారి తీసిందంటోంది. ‘‘బ్రూస్ లీ పోస్ట్‌మార్టం రిపోర్టులోని వివరాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చాం. ఆయన మెదడు 1,575 గ్రాములకు పెరిగిందని పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. ఇది సాధారణం కంటే 175 గ్రాములు ఎక్కువ’’ అని పేర్కొంది. ధారాళంగా నీళ్లు తాగడమే గాక క్యారెట్, ఆపిల్ జ్యూస్‌లనే ప్రధాన ఆహారంగా తీసుకోవడం బ్రూస్ లీకి ఏళ్ల తరబడి అలవాటని గుర్తు చేసింది. ముఖ్యంగా చనిపోయిన రోజంతా బ్రూస్ లీ పదేపదే నీళ్లు తాగుతూ గడిపాడని సన్నిహితులు చెప్పడాన్ని ఉటంకించింది. ఈ అధ్యయన పత్రం క్లినికల్ కిడ్నీ జర్నల్లో పబ్లిషైంది.
చదవండి: మహిళా, శిశు సంక్షేమ చట్టాలు... సమగ్ర అవగాహన
అసలు ఆ రోజు ఏం జరిగింది..?
బ్రూస్ లీ 1940 నవంబర్ 27న జన్మించాడు. 13 ఏళ్ల కల్లా హాంకాంగ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సాధించాడు. 16 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లాడు. 26వ ఏట అమెరికా టీవీలో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపించి అలరించాడు. ముఖ్యంగా జిత్ కునెడో పేరిట ఆయన ప్రవేశపెట్టిన సొంత ఫైటింగ్ టెక్నిక్ జనానికి పిచ్చిగా నచ్చింది. 29వ ఏట బ్రూస్ లీ హాంకాంగ్ తిరిగి వెళ్లాడు. సినీ రచయితగా, డైరెక్టర్‌గా, నటునిగా, ఫైట్‌మాస్టర్‌గా పని చేశాడు. ఎంటర్ ద డ్రాగన్ తదితర చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్యుడయ్యాడు. 1973 జూలై 20న ఒక సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్లలో నటించిన అనంతరం బ్రూస్ లీ ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 7.30 ప్రాంతంలో నొప్పితో తల తిరుగుతోందని చెప్పాడు. ఏక్వజెసిక్ ట్యాబ్లెట్ వేసుకుని బెడ్రూంలోకి వెళ్లాడు. 9.30 కల్లా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అప్పటికే హృదయస్పందన ఆగిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు. అంతకు రెండు నెలల క్రితమే బ్రూస్‌లీకి మెదడు వాపు సంబంధిత సమస్య తలెత్తింది. కాసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లి కోలుకున్నాడు.
మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత నీరు తీసుకోవాలి?
కొందరు రెండు, కొందరు మూడు, కొందరు ఐదు లీటర్లు అంటూ చెప్తుంటారు. కానీ శాస్త్రీయంగా దీనికంటూ ఓ పరిమితి లేదు. వైద్య నిపుణులు గంటలో లీటర్ లోపు నీటిని మాత్రమే తీసుకోవాలని తద్వారా కిడ్నీలపై ఒత్తిడి ఉండదని చెప్తున్నారు. అంతేకాదు అతిగా నీటిని తీసుకోవడం మూలంగా మానసిక అనారోగ్యం కూడా సంభవించవచ్చని అంటున్నారు.