Skip to main content

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ఏ జిల్లాలో ప్రారంభమైంది?

30.75 లక్షల మందికి నివాస స్థల పట్టాలు అందజేయడంతోపాటు వచ్చే మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ఉద్దేశించిన ‘‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.
Current Affairs

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్‌లో డిసెంబర్ 25న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పైలాన్ ఆవిష్కరించి, పేదలకు నిర్మించి ఇచ్చే ఇంటి మోడల్‌ను సందర్శించారు. అనంతరం పథకం లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు.

పథకం-ముఖ్యాంశాలు

  • 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కోటి 24 లక్షల మందికి మేలు చేకూరుతుంది.
  • పథకం కింద రూ.50,940 కోట్లతో రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్లు నిర్మిస్తారు.
  • పథకం తొలి దశ కింద 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి డిసెంబర్ 25నే శ్రీకారం చుట్టారు. వీటి విలువ రూ.28 వేల కోట్లు.
  • రెండో విడతలో మిగిలిన 12.70 లక్షల ఇళ్ల నిర్మాణం 2021 ఏడాది మొదలవుతుంది.
  • దారిద్య్రరేఖకు దిగువనున్న ఇల్లులేని పేద కుటుంబాలన్నింటికీ నివాస స్థల పట్టాలు పంపిణీ చేస్తారు.


ముఖ్యమంత్రి ప్రసంగం-ముఖ్యాంశాలు

  • వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్‌లోని ఒక్కో ప్లాటు మార్కెట్ విలువ ఇప్పుడు రూ.4 లక్షలు.
  • రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయతీలు ఉంటే, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలు వస్తున్నాయి.
  • జగనన్న కాలనీల్లో లేఅవుట్లు వేసి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, తాగు నీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి అన్ని సదుపాయాలు కల్పించబోతున్నాం. వాటికి మరో రూ.7 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా.
  • మొత్తం 68,361 ఎకరాల్లో లేఅవుట్లు వేసి, ప్లాట్లు చేసి అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం. వాటి మార్కెట్ విలువ అక్షరాలా రూ.25,530 కోట్లు.
  • పట్టణ ప్రాంతాల్లో సెంటు నుంచి సెంటున్నర వరకు, గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితంగా 1.5 సెంట్ల భూమి ఇస్తున్నాం.
  • కాలనీల్లో 13 లక్షల మొక్కలు నాటిస్తాం.
  • 2.62 లక్షల టిడ్కో ఇళ్లకు (ఫ్లాట్లు) కూడా సేల్ అగ్రిమెంట్ ఇవ్వబోతున్నాం. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి మరో రూ.9,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం.

క్విక్ రివ్యూ :

ఏమిటి : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కొమరగిరి, యు.కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా
ఎందుకు : 30.75 లక్షల మందికి నివాస స్థల పట్టాలు అందజేయడంతోపాటు వచ్చే మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు
Published date : 26 Dec 2020 05:53PM

Photo Stories