Skip to main content

నూర్ సుల్తాన్‌లో భారత్, పాక్ డేవిస్ కప్ పోరు

భారత్, పాకిస్తాన్ డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్-1 మ్యాచ్‌ను కజకిస్తాన్ రాజధాని నూర్ సుల్తాన్(ఆస్థానా)లో నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నవంబర్ 19న ప్రకటించింది.
ప్రస్తుతం కజకిస్తాన్‌లో అతి శీతల వాతావరణం ఉండటంతో మ్యాచ్‌ను బయట కాకుండా ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. 2019, నవంబర్ 29, 30వ తేదీల్లో ఈ మ్యాచ్ జరుగనుందని పేర్కొంది.

వాస్తవానికి ఈ మ్యాచ్ 2019, సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరగాల్సింది. అయితే భద్రతా కారణాలరీత్యా మ్యాచ్‌ను ఇస్లామాబాద్‌లో కాకుండా తటస్థ వేదికపైనే నిర్వహించాలని ఐటీఎఫ్ నిర్ణయించింది. తటస్థ వేదికను సూచించాలని 2019, నవంబర్ 4న పాకిస్తాన్ టెన్నిస్ సమాఖ్య (పీటీఎఫ్)ను ఐటీఎఫ్ కోరింది. అయితే ఐటీఎఫ్ తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలని, ఇస్లామాబాద్‌లోనే మ్యాచ్‌ను నిర్వహించాలని కోరుతూ పీటీఎఫ్ అప్పీల్ చేసింది. కానీ పీటీఎఫ్ అప్పీల్‌ను ఐటీఎఫ్ కొట్టివేసింది. పీటీఎఫ్ వేదికను సూచించకపోవడంతో ఐటీఎఫ్ సొంత నిర్ణయం తీసుకుంది.

రెండోసారి...
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య డేవిస్ కప్ మ్యాచ్ తటస్థ వేదికపై జరగనుండటం ఇది రెండోసారి. 1973లోనూ భారత్, పాక్ డేవిస్ కప్ మ్యాచ్‌ను తటస్థ వేదిక మలేసియాలో నిర్వహించారు. ఓవరాల్‌గా ఈ రెండు జట్లు డేవిస్ కప్‌లో ఆరుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఆరుసార్లూ భారతే గెలిచి అజేయంగా ఉంది.

(చదవండి : కజకిస్తాన్ రాజధాని ఆస్థానా పేరు మార్పు)

(చదవండి : తటస్థ వేదికపై భారత్, పాక్ డేవిస్ కప్ మ్యాచ్)

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2019, నవంబర్ 29, 30వ తేదీల్లో భారత్, పాకిస్తాన్ డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్-1 మ్యాచ్
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)
ఎక్కడ : నూర్ సుల్తాన్, కజకిస్తాన్
Published date : 20 Nov 2019 04:47PM

Photo Stories