Skip to main content

నిర్మాణంలోని ఇంటిపై జీఎస్టీ తగ్గింపు

నిర్మాణంలో ఉన్న ఇళ్లు, నిర్మాణం పూర్తయినప్పటికీ అందుకు సంబంధించిన (నిర్మాణం పూర్తయినట్లుగా) ధ్రువపత్రం ఇంకా రాని ఇళ్లు, అందుబాటు ధరల్లో వచ్చే ఇళ్ల (అఫోర్డబుల్ హౌసెస్) కొనుగోలుపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటును జీఎస్టీ మండలి తగ్గించింది.
ఢిల్లీలో ఫిబ్రవరి 24న జరిగిన 33వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణంలో ఉన్న లేదా నిర్మాణం పూర్తయినా ఆ మేరకు ధ్రువపత్రం ఇంకా రాని ఇళ్ల కొనుగోలుపై 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. వ్యాపారులకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కూడా ఇస్తున్నారు. తాజాగా ఈ కేటగిరీ ఇళ్లపై పన్నును జీఎస్టీ మండలి 5 శాతానికి తగ్గించింది. ఐటీసీని ఎత్తివేసింది. అలాగే అందుబాటు ధరల్లో లభించే ఇళ్ల కొనుగోలుపై ప్రస్తుతం 8 శాతంగా ఉన్న జీఎస్టీని 1 శాతానికి జీఎస్టీ మండలి తగ్గించింది. అందుబాటు ధరల ఇల్లు అంటే ఏంటనే నిర్వచనాన్ని కూడా సవరించింది. కొత్త పన్ను రేట్లు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి (2019, ఏప్రిల్ 1 నుంచి) అమలు కానున్నాయి.

అందుబాటు ధరలో ఇల్లు అంటే...
‘అందుబాటు ధర ఇల్లు’కి నిర్వచనాన్ని కూడా జీఎస్టీ మండలి ఫిబ్రవరి 24న సవరించింది. ఇకపై రూ. 45 లక్షల విలువ కలిగి ఉండి, దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో (హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై-ఎంఎంఆర్, కోల్‌కతా) అయితే 60 చదరపు మీటర్ల కార్పెట్ వైశాల్యం, మిగతా ఏ ప్రాంతంలోనైనా అయితే 90 చదరపు మీటర్ల కార్పెట్ వైశాల్యం ఉన్న ఇళ్లను ఇకపై అందుబాటు ధరల్లోని ఇళ్లుగా పరిగణించనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నిర్మాణంలోని ఇంటిపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : జీఎస్టీ మండలి
Published date : 25 Feb 2019 05:35PM

Photo Stories