మోదీపై ప్రశంసలు కురిపించిన ప్రముఖ సంస్థ చీఫ్?
Sakshi Education
కోవిడ్-19 టీకా ఉత్పత్తిలో భారత్ తన శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాల కోసం కూడా వినియోగిస్తుందంటూ హామీ ఇచ్చినందుకు భారత ప్రధాని మోదీపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసలు కురిపించింది.
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 75వ సమావేశాన్ని ఉద్దేశించి సెప్టెంబర్ 26న ప్రధాని మోదీ ప్రసంగిస్తూ..‘ఈ సంక్షోభ సమయంలో భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా తనకున్న ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాలను కోవిడ్‌పై పోరులో అంతర్జాతీయ సమాజానికి సాయపడుతుంది. టీకా నిల్వ, పంపిణీకి అవసరమైన మౌలిక వనరుల కల్పనలో కూడా తోడుగా నిలుస్తుంది’ అని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సెప్టెంబర్ 27న డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసియస్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. అన్ని దేశాలు కలిసికట్టుగా తమ వనరులను సమీకరించి పోరాడినప్పుడే కరోనాపై విజయం సాధ్యమని పేర్కొన్నారు. ఐరాస చీఫ్ ఆంటోనియో గుటై కూడా ప్రధాని మోదీ ప్రకటనను ‘వెల్‌కమ్ న్యూస్’గా అభివర్ణించారని ఆయన ప్రతినిధి వెల్లడించారు.
Published date : 29 Sep 2020 01:15PM