Skip to main content

మళ్లీ నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్‌సన్

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ను, నామినేటెడ్ ఎమ్మెల్యే (ఆంగ్లో ఇండియన్)గా ఎల్విస్ స్టీఫెన్‌సన్‌ను నియమించాలని రాష్ట్ర మంత్రి వర్గ తొలి సమావేశం నిర్ణయించింది.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశం జరిగింది. సాధారణంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేసిన తర్వాత నామినేటెడ్ ఎమ్మెల్యే నియామకం జరిగేది. అయితే.. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఎన్నికై న ఎమ్మెల్యేలతోపాటే నామినేటెడ్ సభ్యుడు సైతం ప్రమాణం చేసేలా మంత్రివర్గం నిర్ణయించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే తన విలువైన పదవీకాలం కోల్పోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్‌గా ముస్లిం వర్గానికి చెందిన ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ను, నామినేటెడ్ సభ్యుడిగా క్రిస్టియన్ మతానికి చెందిన ఎల్విస్ స్టీఫెన్‌సన్‌ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ప్రతిపాదనలు పంపగా.. వీటికి గవర్నర్ ఆమోదం తెలిపారు. అనంతరం ఈ ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్ కూడా దీనికి ఆమోదిస్తూ.. స్టీఫెన్‌సన్ నియామకాన్ని ధ్రువీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టీఫెన్‌సన్ తెలంగాణ శాసనసభకు నామినేటెడ్ ఎమ్మెల్యేగా నియమితులవడం ఇది రెండోసారి. తెలంగాణ తొలిశాసనసభలోనూ ఈయన నామినేటెడ్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి:
తెలంగాణ అసెంబ్లీ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎంపిక
ఎప్పుడు: జనవరి 7
ఎవరు: ఎల్విస్ స్టీఫెన్‌సన్
ఎక్కడ: తెలంగాణ
Published date : 08 Jan 2019 05:11PM

Photo Stories