Skip to main content

మహిళల 200 మీటర్ల స్ప్రింట్‌లో స్వర్ణం గెలిచిన అథ్లెట్‌?

ఒలింపిక్స్‌ మహిళల అథ్లెటిక్స్‌లో జమైకా అథ్లెట్‌ ఎలైన్‌ థాంప్సన్‌ హెరా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.
టోక్యో ఒలింపిక్స్‌–2020లో భాగంగా ఆగస్టు 3న జరిగిన మహిళల 200 మీటర్ల ఫైనల్‌ రేసులో ఆమె విజేతగా నిలిచింది. 21.53 సెకన్లలో అందరికంటే ముందుగా రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. క్రిస్టినే ఎమ్‌బోమా (నమీబియా; 21.81 సెకన్లు) రజతం... గాబ్రియేలా థామస్‌ (అమెరికా; 21.87 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు.

తాజా విజయంతో స్ప్రింట్‌ (100, 200 మీటర్లు) ఈవెంట్లను ఎలైన్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌–2020 మహిళల 100 మీటర్ల పరుగులోనూ ఎలైన్‌ విజేతగా నిలిచిన విషయం విదితమే. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ ఎలైన్‌ 100, 200 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు గెల్చుకుంది. ఫలితంగా వరుసగా రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణాలు నెగ్గిన ఏకైక మహిళా అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. పురుషుల విభాగంలో మాత్రం ఉసేన్‌ బోల్ట్‌ (జమైకా) వరుసగా మూడు ఒలింపిక్స్‌ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచాడు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : వరుసగా రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణాలు నెగ్గిన ఏకైక మహిళా అథ్లెట్‌గా గుర్తింపు
ఎప్పుడు : ఆగస్టు 3, 2021
ఎవరు : జమైకా అథ్లెట్‌ ఎలైన్‌ థాంప్సన్‌ హెరా
ఎక్కడ : టోక్యో, జపాన్‌
ఎందుకు : టోక్యో ఒలింపిక్స్‌–2020 మహిళల 200 మీటర్ల స్ప్రింట్‌లో స్వర్ణం గెలిచినందున...
Published date : 04 Aug 2021 05:44PM

Photo Stories