మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు
అనారోగ్యంతో గత 21 రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుతో ఆగస్టు 31న తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అదే హాస్పిటల్‌లో ఆగస్టు 10న ప్రణబ్‌కు వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. అదే సమయంలో, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో పాటు కరోనా కూడా సోకడంతో అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పైనే కోమాలో ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలను సెప్టెంబర్ 1న ఢిల్లీలో లోధిరోడ్‌లోని శ్మశాన వాటికలో నిర్వహించారు.
వారం పాటు సంతాపం..
ప్రణబ్‌కు గౌరవ సూచకంగా దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ప్రణబ్ మృతికి సంతాపసూచకంగా ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో జాతీయ పతాకం సగం వరకు అవనతం చేస్తారని తెలిపింది.
మిరాటి గ్రామంలో జననం...
1935 డిసెంబర్ 11న అప్పటి బ్రిటిష్ ఇండియాలో భాగమైన బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న మిరాటి గ్రామంలో(ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లోని బీర్బుమ్ జిల్లాలో ఉంది) ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి ముఖర్జీ, కమద కింకర్ ముఖర్జీ. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. ప్రణబ్ కలకత్తా యూనివర్సిటీలో ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతి శాస్త్రం), ఎల్‌ఎల్‌బీ చదివారు. మొదట డిప్యూటీ అకౌంటెంట్ జనరల్(పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్) కార్యాలయంలో యూడీసీగా ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత కలకత్తాలోని విద్యాసాగర్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు జర్నలిస్ట్‌గా కొంతకాలం పనిచేశారు.
రాజకీయ ప్రస్థానం...
- 1969లో క్రియాశీల రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ప్రణబ్ 1969 జూలైలోనే కాగ్రెస్ తరపున రాజ్యసభకు వెళ్లారు. ఆ తరువాత 1975, 1981, 1993, 1999ల్లోనూ ఎగువ సభకు ఎన్నికై , పలుమార్లు సభా నాయకుడిగా సేవలందించారు.
- 1973లో తొలిసారి కేంద్రంలో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత వివిధ శాఖలు నిర్వహించి, 1982లో కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు.
- 1978లోనే సీడబ్ల్యూసీ సభ్యుడైన ప్రణబ్... ఇందిరాగాంధీ కేబినెట్లో నంబర్ 2గా ప్రఖ్యాతి గాంచారు.
- 1986లో సొంతంగా రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ అనే ఒక రాజకీయ పార్టీని ప్రణబ్ స్థాపించారు. 1989లో ఆ పార్టీని ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
- 1982లో ఆయన 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అయ్యారు. దేశ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, వాణిజ్య శాఖలను చూశారు. ఇన్ని కీలకశాఖలను చూసిన తొలి రాష్ట్రపతి ప్రణబే. ముగ్గురు ప్రధానమంత్రులు... ఇంధిరాగాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌ల వద్ద పనిచేసిన అరుదైన గుర్తింపు పొందారు.
- ప్రధానమంత్రిగా పనిచేయకుండా... లోక్‌సభ నాయకుడిగా 8 ఏళ్లు పనిచేసిన ఏకైక నేత.
- ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగానూ పనిచేసిన ప్రణబ్ 1980-85 ఏళ్లలో రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్నారు.
- 2004-2012 మధ్యకాలంలో మొత్తం 39 మంత్రివర్గ ఉపసంఘాలు (గ్రూప్స్ ఆఫ్ మినిస్టర్స్) ఉండగా... వీటిలో ఏకంగా ఇరవై నాలుగింటికి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వం వహించారు.
- ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ప్రణబ్ దేశ అభివృద్ధిపథంలో కీలకపాత్ర పోషించారు.
- 2005లో ప్రణబ్ రక్షణమంత్రిగా ఉన్నపుడే భారత్- అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది.
- 1977లో మాల్దా నుంచి, 1980లో బోల్‌పూర్ నుంచి లోక్‌సభకు పోటీచేసిన ప్రణబ్ దా ఓటమిపాలయ్యారు. తర్వాత 2004లో జంగిపూర్ (ముర్షిదాబాద్) నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు.
- 2012, జూలై 25 నుంచి 2017, జూలై 25 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ దా బాధ్యతలు నిర్వర్తించారు.
భారతరత్న గ్రహీత...
- ప్రణబ్ దా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులుగా ఉన్నారు.
- దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్నతో పాటు, పద్మ విభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇండియా అవార్డులు ఆయన్ను వరించాయి.
- ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలు ఆయనకు ఐదు గౌరవ డాక్టరేట్స్‌ను ప్రదానం చేశాయి.
- 2020, డిసెంబరు 11వ తేదీన ప్రణబ్ జయంతిని పురస్కరించుకొని ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ పుస్తకాన్ని విడుదల చేస్తామని ప్రచురణ సంస్థ రూపా పబ్లికేషన్స్ వెల్లడించింది. ఇది ప్రణబ్ రాసిన నాలుగో పుస్తకం. ఇంతకుముందు ఆయన... ‘ది డ్రమటిక్ డికేడ్ (2014), ది టర్బులెంట్ ఇయర్స్ (2016), ది కొయలిషన్ ఇయర్స్ (2017)లను రాశారు.
- రాష్ట్రపతిగా తన పదవీకాలంలో ఆఖరి రెండేళ్లు రాష్ట్రపతి భవన్‌ను ఒక పాఠశాలగా మార్చి తాను స్వయంగా టీచర్ అవతారం ఎత్తారు. రాష్ట్రపతి ఎస్టేట్‌లోని రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయాలో 11, 12 తరగతి విద్యార్థులకు ప్రణబ్ దా పాఠాలు చెప్పారు.
- క్షమాభిక్ష పిటిషన్ల విషయంలో రాష్ట్రపతిగా ప్రణబ్ చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నారు. అయిదేళ్ల పదవీ కాలంలో నలుగురికి క్షమాభిక్ష ప్రసాదిస్తే, 30 పిటిషన్లను తిరస్కరించారు.
- రాజకీయ దురంధరుడిగా, అపర చాణక్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా, నడిచే విజ్ఞాన సర్వస్వంగా దేశ ప్రజలు, సహచరుల మన్ననలు ప్రణబ్ దా పొందారు.
- సొంతూరి(మిరాటి గ్రామం)తో ఉన్న అనుబంధాన్ని మాత్రం ప్రణబ్ ఎన్నడూ మరువలేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఏటా దుర్గాపూజ సమయంలో మాత్రం సొంతూళ్లోనే ఉండేవారు.