కరోనా నమూనాల సేకరణకు ‘కోవ్‌సాక్’
Sakshi Education
కరోనా వైరస్ కట్టడికి ఉపయోగపడే అనేక టెక్నాలజీలను అభివృద్ధి చేసిన భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) తాజాగా నమూనాల సేకరణకు ఉపయోగించే ప్రత్యేకమైన గదిని అభివృద్ధి చేసింది.
కరోనా శాంపిల్ కలెక్షన్ కియాస్క్ (కోవ్‌సాక్) అని పిలుస్తున్న ఈ గదిని హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ డాక్టర్లతో సంప్రదింపులు జరిపిన తరువాత రూపొందించామని డీఆర్‌డీవో ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా సోకిందన్న అనుమానం ఉన్న వ్యక్తి నుంచి నమూనాలు సురక్షితంగా సేకరించేందుకు ఈ కోవ్‌సాక్ ఉపయోగపడుతుందని పేర్కొంది. బాధితుడు కూర్చునే ప్రాంతాన్ని మానవ ప్రమేయం లేకుండా డిస్‌ఇన్ఫెక్ట్ చేయడం దీని ప్రత్యేకత. ఫలితంగా వైద్య సిబ్బంది నమూనాలు సేకరించిన ప్రతిసారీ ప్రత్యేకంగా వ్యక్తిగత రక్షణ పరికరాలను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. నమూనాల సేకరణ తర్వాత రోగి గది నుంచి బయటకు వచ్చిన వెంటనే నాలుగు నాజిళ్ల ద్వారా డిస్‌ఇన్ఫెక్టెంట్‌ను 70 సెకన్ల పాటు స్ప్రే చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయని డీఆర్‌డీవో వెల్లడించింది. అవసరాన్ని బట్టి కోవ్‌సాక్‌ను బహిరంగ ప్రదేశాల్లోనూ ఉపయోగించవచ్చని పేర్కొంది.
Published date : 15 Apr 2020 06:54PM