జస్టిస్ నారిమన్ పదవీ విరమణ
Sakshi Education
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకొని ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించిన జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్ ఆగస్టు 12వ తేదీన పదవీ విరమణ చేశారు.
ఏడేళ్ల పాటు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న ఆయన 13,500 పైగా కేసుల్ని విచారించి తీర్పులు ఇచ్చారు. జస్టిస్ నారిమన్ న్యాయమూర్తుల్లో సింహంలాంటి వారని ఆయనకు జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రశంసించారు. వ్యక్తిగత గోప్యతని ప్రాథమిక హక్కుగా గుర్తించడం, శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కలిపంచడం, పరస్పర అంగీకారంతో జరిగే గే సెక్స్ చట్ట విరుద్ధం కాదని చెప్పడం, ట్రిపుల్ తలాక్‌కి ముగింపు పలకడం, కస్టడీ మరణాలను ఆపడానికి పోలీసుస్టేషన్లు, జాతీయ దర్యాప్తు సంస్థల్లో సీసీ టీవీ కెమెరాలను పెట్టించడం వంటి పలు కీలక తీర్పులు ఇచ్చారు. సొలిసిటర్ జనరల్‌గా ఉన్న నారిమన్ 2014లో నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అలా బార్ నుంచి బెంచ్ మీదకి వచిచన అతికొద్ది మంది న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు. నారిమన్ పదవీ విరమణతో న్యాయ వ్యవస్థకి రక్షణగా ఉన్న సింహాల్లో ఒక దానిని కోల్పోతున్నట్టుగా అనిపిస్తోందని సీజేఐ వ్యాఖ్యానించారు. జస్టిస్ నారిమన్ ఇచ్చిన తీర్పుల్లో ఆయన ఆలోచనల్లో ఉన్న స్పష్టత, మేధోసంపత్తి, పాండిత్యం గోచరిస్తాయని, మన న్యాయవ్యవస్థ ఒక మేధోమూర్తిని మిస్ అవుతోందని భావోద్వేగంతో జస్టిస్ రమణ చెప్పారు.
Published date : 14 Aug 2021 11:50AM