Skip to main content

జర్నలిస్ట్ రవీశ్‌కు మెగసెసె అవార్డు

ప్రముఖ పాత్రికేయుడు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీశ్ కుమార్‌ను ఆసియా నోబెల్‌గా అభివర్ణించే ప్రఖ్యాత రామన్ మెగసెసె పురస్కారం-2019 వరించింది.
ఈ మేరకు రామన్ మెగసెసె ఫౌండేషన్ ఆగస్టు 2న ప్రకటించింది. నిస్సహాయుల గొంతుకగా నిలిచినందుకుగాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ పేర్కొంది. ఎన్డీటీవీ హిందీ భాష ఛానల్‌లో ప్రసారమయ్యే ప్రైమ్ టైమ్ కార్యక్రమం ద్వారా అంతగా వెలుగులోకి రాని సామాన్యుల సమస్యలను దేశానికి చూపించే ప్రయత్నం చేశారంది.

రవీష్‌తోపాటు మరో నలుగురు ఆసియా నుంచి మెగసెసె-2019 పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో కో స్వీ విన్(మయన్మార్), అంగ్‌ఖానా నిలపైజిత్(థాయిలాండ్), రేముండో పుజాంతే కాయాబ్యాబ్(ఫిలిప్పీన్స్), కిమ్ జాంగ్ కి(దక్షిణ కొరియా) ఉన్నారు. వీరందరికీ ఆగస్టు 31వ తేదీన ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

రవీష్ ప్రస్థానం..
బిహార్‌లోని జిత్వార్‌పూర్ గ్రామంలో జన్మించిన రవీశ్ 1996లో ఎన్డీటీవీలో రిపోర్టర్‌గా పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఎన్డీటీవీ హిందీ భాషలో తొలిసారి 24 గంటల చానల్‌ను ప్రారంభించడంతో అందులో ఆయన ప్రైమ్ టైమ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

అవార్డు గురించి..
ఆసియా నోబెల్‌గా పరిగణించే రామన్ మెగసెసె అవార్డును 1957లో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. ఆసియా అత్యున్నత పురస్కారంగా పిలిచే ఈ అవార్డును వ్యక్తులు లేదా సంస్థలకు రామన్ మెగసెసే ఫౌండేషన్ ఏటా అందిస్తోంది. గతంలో భారత్ నుంచి ఆర్‌కే లక్ష్మణ్, పి.సాయినాథ్, అరుణ్ శౌరి, కిరణ్ బేడీ, అర్వింద్ కేజ్రీవాల్ ఈ అవార్డును అందుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రామన్ మెగసెసె పురస్కారం-2019కు ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : రవీశ్ కుమార్
ఎందుకు : జర్నలిజం ద్వారా వెలుగులోకి రాని సామాన్యుల సమస్యలను దేశానికి చూపించే ప్రయత్నం చేసినందుకు
Published date : 03 Aug 2019 05:41PM

Photo Stories