Skip to main content

Daily Current Affairs in Telugu: జ‌న‌వ‌రి 30th, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu January 30th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

U-19 Women’s T20 World Cup: తొలి అండర్‌–19 మహిళల టి20 వరల్డ్‌కప్‌ విజేత భారత్
తొలిసారి నిర్వహించిన అండర్‌–19 ప్రపంచకప్‌లో కొత్త చరిత్రను సృష్టిస్తూ టీమిండియా మహిళలు విశ్వవిజేతగా నిలిచారు. మహిళల తొలి అండర్‌–19 ప్రపంచకప్‌ విజేతగా భారత్‌ తమ పేరును ఘనంగా లిఖించుకుంది. 16 జట్లు పాల్గొన్న ఈ టి20 టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో టైటిల్‌ను సొంతం చేసుకుంది. జ‌న‌వ‌రి 29వ తేదీ ద‌క్షిణాఫ్రికాలోని పోష్‌స్ట్రూమ్‌లో జరిగిన ఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ అండర్‌ –19పై నెగ్గింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్‌ 14 ఓవర్లలో 3 వికెట్లకు 69 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ప్రస్తుతం పురుషుల అండర్‌–19 వరల్డ్‌కప్‌ విజేత భారత్‌ కాగా.. ఇప్పుడు మహిళల జట్టు కూడా జత చేరడం విశేషం.  ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టులో తెలంగాణ నుంచి గొంగడి త్రిష, యశశ్రీ, ఆంధ్ర ప్రదేశ్‌ అమ్మాయి షబ్నమ్‌ సభ్యులుగా ఉన్నారు. 

ICC T20 Team Of The Year 2022 : ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టు ఇదే..
ఆ్రస్టేలియాతో సెమీఫైనల్లో కూడా 99 పరుగులకే కుప్పకూలి అదృష్టవశాత్తూ విజయంతో బయటపడ్డ ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ బలహీనత ఫైనల్లోనూ కనిపించింది. ఒకరితో మరొకరు పోటీ పడి విఫలం కావడంతో జట్టు సాధారణ స్కోరు కూడా చేయలేకపోయింది. టిటాస్‌ సాధు, అర్చన, పార్శవి ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ర్యానా మెక్‌డొనాల్డ్‌ (24 బంతుల్లో 19; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు కాగా.. ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లే నమోదయ్యాయి. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌ దూసుకుపోయింది. షఫాలీ వర్మ (15), శ్వేత సెహ్రావత్‌ (5) విఫలమైనా.. గొంగడి త్రిష (29 బంతుల్లో 24; 3 ఫోర్లు), సౌమ్య (37 బంతు ల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. 6 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన టిటాస్‌ సాధు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’గా నిలిచింది. 
బీసీసీఐ కానుక రూ.5 కోట్లు 
అండర్‌–19 టి20 ప్రపంచకప్‌ గెలిచిన భారత మహిళల జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభినందించింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి కలిపి రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది.  
ఎవరెవరిపై గెలిచామంటే.. 
లీగ్‌ దశలో: దక్షిణాఫ్రికాపై 7 వికెట్లతో గెలుపు 
యూఏఈపై 122 పరుగులతో విజయం 
స్కాట్లాండ్‌పై 83 పరుగులతో గెలుపు 
సూపర్‌ సిక్స్‌ దశలో: ఆ్రస్టేలియా చేతిలో 
7 వికెట్లతో ఓటమి. 
శ్రీలంకపై 7 వికెట్లతో విజయం 
సెమీస్‌లో: న్యూజిలాండ్‌పై 8 వికెట్లతో విజయం 

Jyothi Surekha: జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు 

U-19 Women’s T20 World Cup: టి20 వరల్డ్‌కప్‌ సాధించిన మ‌హిళ‌లు.. ఒక్కొక్కరి కథ ఒక్కోలా..

under 19 womens t20 world cup


దాదాపు 18 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చేరింది. అయితే ఆ్రస్టేలియా చేతిలో చిత్తుగా ఓడి రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ స్థాయిలో, ఏ ఫార్మాట్‌లో కూడా మన టీమ్‌ వరల్డ్‌కప్‌ గెలవలేకపోయింది. నాటి జట్టులో సభ్యురాలిగా ఉన్న ఆఫ్‌ స్పిన్నర్‌ నూషీన్‌ అల్‌ ఖదీర్‌ ఇప్పుడు యువ మహిళల టీమ్‌కు కోచ్‌. ఇప్పుడు అదే దక్షిణాఫ్రికా గడ్డపై మరో ఫైనల్‌ ఆడిన భారత బృందం ఈసారి విజేతగా నిలిచింది. దాదాపు 2005 వరల్డ్‌కప్‌ జరిగిన సమయంలోనే పుట్టిన అమ్మాయిలంతా ఇప్పుడు విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. సీనియర్‌ టీమ్‌ మంచి ఫలితాలు సాధిస్తున్న సమయంలో అండర్‌–19 జట్టు కూడా తమ స్థాయిని ప్రదర్శించడం శుభపరిణామం.
దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న వర్ధమాన ప్లేయర్లలో బీసీసీఐ తొలి వరల్డ్‌కప్‌ కోసం టీమ్‌ను ఎంపిక చేసింది. అయితే ఎలాగైనా వరల్డ్‌కప్‌ గెలవాలనే ఉద్దేశంతో ఇప్పటికే సీనియర్‌ టీమ్‌లో ఆడిన షఫాలీ వర్మ, రిచా ఘోష్‌లను జట్టులోకి తీసుకుంది. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అమ్మాయిలందరూ తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా రాణించారు. శ్వేత సెహ్రావత్‌ 139.43 స్ట్రయిక్‌రేట్‌తో 297 పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలవగా, షఫాలీ (172 పరుగులు), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (116 పరుగులు) అండగా నిలిచారు. బౌలింగ్‌లో పార్శవి చోప్రా (11 వికెట్లు), మన్నత్‌ కశ్యప్‌ (9 వికెట్లు) కీలకపాత్ర పోషించారు. సీనియర్‌ టీమ్‌లో జూనియర్‌గా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టిన షఫాలీ ఈ టోర్నీ ద్వారా తన నాయకత్వ ప్రతిభను ప్రదర్శించారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (24-31 డిసెంబర్ 2022)

వరల్డ్‌కప్‌ సాధించిన బృందం గురించి సంక్షిప్తంగా.. 
షఫాలీ వర్మ (కెప్టెన్‌): హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన షఫాలీ భారత్‌ సీనియర్‌ జట్టు సభ్యురాలిగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భారత్‌ తరఫున 74 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది.  
రిచా ఘోష్‌: బెంగాల్‌కు చెందిన కీపర్‌ రిచా కూడా సీనియర్‌ టీమ్‌ సభ్యురాలిగా 47 మ్యాచ్‌లు ఆడింది.  పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం
ఫ్రెంచ్‌ ఓపెన్‌ అంటే రాఫెల్‌ నాదల్‌.. వింబుల్డన్‌ అంటే రోజర్‌ ఫెడరర్‌ గుర్తుకొస్తారు. మరి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ అంటే ఎవరు గుర్తుకు రావాలి అన్న ప్రశ్నకు సమాధానం తానేనని సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ నిరూపించాడు. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో తనకు తిరుగులేదని ఈ సెర్బియా యోధుడు మరోసారి చాటుకున్నాడు. జ‌న‌వ‌రి 29వ తేదీ జరిగిన ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ జొకోవిచ్‌ 6–3, 7–6 (7/4), 7–6 (7/4)తో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 29,75,000 ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 17 కోట్ల 22 లక్షలు).. రన్నరప్‌ సిట్సిపాస్‌కు 16,25,000 ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 9 కోట్ల 40 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.  తాజా విజయంతో 35 ఏళ్ల జొకోవిచ్ జ‌న‌వ‌రి 30న‌ విడుదల చేసే అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. కెరీర్‌లో 22వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా రాఫెల్‌ నాదల్‌ (22; స్పెయిన్‌) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ సమం చేశాడు.  సిట్సిపాస్‌తో 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌కు ఏదశలోనూ ఆందోళన చెందేరీతిలో ప్రతిఘటన ఎదురుకాలేదు. కీలకదశలో ఈ సెర్బియా స్టార్‌ పైచేయి సాధించి సిట్సిపాస్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్‌లోని నాలుగో గేమ్‌లో సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 4–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో తొలి సెట్‌ను 36 నిమిషాల్లో దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Novak Djokovic: 16 ఏళ్ల తర్వాత.. అడిలైడ్‌ ఓపెన్ విజేత జొకోవిచ్

Hockey World Cup: హాకీ ప్రపంచ విజేత జర్మనీ.. ఫైనల్లో బెల్జియంపై గెలుపు
13 ఏళ్ల విరామం తర్వాత జర్మనీ జట్టు పురుషుల హాకీలో జగజ్జేతగా నిలిచింది. జ‌న‌వ‌రి 29వ తేదీ ఒడిసాలోని భువ‌నేశ్వ‌ర్‌లో జరిగిన  ప్రపంచకప్‌ హాకీ టోర్నీ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్‌’లో 5–4తో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెల్జియం జట్టును ఓడించింది. నిర్ణీత సమయం ముగిసే సరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్‌’ నిర్వహించారు. ‘షూటౌట్‌’లో నిర్ణీత ఐదు షాట్‌ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ‘సడెన్‌ డెత్‌’లో తొలి షాట్‌లో రెండు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యాయి. రెండో షాట్‌లో జర్మనీ సఫలంకాగా..  బెల్జియం ఆటగాడు విఫలంకావడంతో జర్మనీ విజయం ఖరారైంది. ఈ గెలుపుతో ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్‌ జట్ల తర్వాత మూడుసార్లు ప్రపంచకప్‌ నెగ్గిన మూడో జట్టుగా జర్మనీ గుర్తింపు పొందింది. జర్మనీ 2002, 2006లో టైటిల్‌ నెగ్గింది. కాంస్య పతకం మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 3–1తో ఆ్రస్టేలియాను ఓడించింది. 

ICC Mens T20 Cricketer of the Year 2022 : ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా.. 

James Webb Telescope: జేమ్స్‌ వెబ్‌కు సాంకేతిక సమస్య 
ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన అబ్జర్వేటరీ అయిన జేమ్స్‌ వెబ్‌లో మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో అంతరిక్ష రహస్యాలను ఒక్కొక్కటిగా ఛేదిస్తున్న జేమ్స్‌ వెబ్‌లో ఇలాంటి సమస్య రావడం ఇది రెండోసారి. అందులోని అత్యంత కీలకమైన నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజర్, స్లిట్‌లెస్‌ స్పెక్ట్రోగ్రాఫ్‌ పరికరాల్లో సమాచార అంతరాయం నెలకొంది. దాంతో సంబంధిత సాఫ్ట్‌వేర్‌ మొరాయించింది. అయితే హార్డ్‌వేర్‌లో ఎలాంటి సమస్యలూ తెలెత్తిన సూచనలు లేకపోవడం ఊరటనిచ్చే విషయమని నాసా పేర్కొంది. ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజర్‌ మాత్రం ప్రస్తుతానికి పని చేయడం లేదని ధ్రువీకరించింది. సమస్యను కనిపెట్టి సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. ఏకంగా వెయ్యి కోట్ల డాలర్ల ఖర్చుతో తయారు చేసిన జేమ్స్‌ వెబ్‌ గత ఆగస్టులో కూడా ఇలాగే మొరాయించింది. దాని మిడ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లోనూ సాంకేతిక సమస్య తలెత్తింది. బహుశా ఊహించిన దానికంటే పరిమాణంలో పెద్దవైన అంతరిక్ష పదార్థాలు కెమెరా లెన్స్‌ను గుద్దుకోవడమే రెండోసార్లూ సమస్యకు కారణమైందని నాసా భావిస్తోంది.  

Peking University: భూ భ్రమణ సమయం పెరుగుతోంది.. రోజుకు 19 గంటలే!
 
Higher Education: దేశంలో పెరిగిన‌ ఉన్నత విద్యావంతులు.. ఎక్కువ కాలేజీలున్న 8 రాష్ట్రాల్లో ఏపీ 
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యావంతులు నాలుగు కోట్లకు పైనే ఉన్నట్టు కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. ఉన్నత విద్యపై ఆలిండియా సర్వేను కేంద్ర విద్యా శాఖ జ‌న‌వ‌రి 29వ తేదీ విడుదల చేసింది. ఎక్కువ కాలేజీలున్న ఎనిమిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు స్థానం దక్కింది. అలాగే ఎక్కువ కాలేజీలున్న జిల్లాల జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి స్థానం దక్కించుకున్నాయి.   

Solar Energy: సౌరశక్తితో యవ్వనం.. శాస్త్రవేత్తల ప్రయోగం
 
Naba Kisore Das: ఏఎస్సై కాల్పుల్లో మంత్రి కన్నుమూత
ఒడిశాలో పోలీసు అధికారి ఒకరు జరిపిన కాల్పుల్లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రి నవ కిశోర్‌ దాస్‌ (60) చనిపోయారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు విశ్వాసపాత్రుడిగా పేరున్న దాస్ జ‌న‌వ‌రి 29వ తేదీ ఝార్సుగూడ జిల్లా బజరంగ్‌నగర్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గాందీచౌక్‌ వద్ద కారు దిగుతుండగా అసిస్టెంబ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్సై) గోపాల్‌ దాస్‌ తన తుపాకీతో మంత్రిపై రెండు రౌండ్ల కాల్పులకు తెగబడ్డాడు. తూటాలు ఛాతీలోకి దూసుకెళ్లాయి. తీవ్ర రక్తస్రావంతో స్పృహతప్పిన దాస్‌ను వెంటనే జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి హుటాహుటిన ఎయిర్‌ అంబులెన్స్‌లో భువనేశ్వర్‌ అపొలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆయన తదిశ్వాస విడిచారు. గుండె, ఊపిరితిత్తులు దెబ్బ తిని తీవ్ర అంతర్గత రక్తస్రావం జరిగిందని ఆస్పత్రి తెలిపింది.
ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం పట్నాయక్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తునకు సీఎం ఆదేశించారు. ఏఎస్సైని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతన్ని ప్రశ్నిస్తున్నామని, కారణాలు త్వరలోనే తెలుస్తాయని ఉన్నతాధికారులు చెప్పారు. కిశోర్‌దాస్‌కు ఝార్సుగూడ మైనింగ్‌ ప్రాంతంలో మంచి పట్టుంది. మైనింగ్, రవాణా, హాస్పిటాలిటీ రంగాల్లో వ్యాపారాలున్నాయి. సీఎం తర్వాత అత్యంత ధనికుడు ఆయనేనని చెబుతుంటారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్‌ నుంచి బీజేడీలోకి మారారు. ఏఎస్సై గోపాల్‌ దాస్‌ 8 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నట్టు భార్య జయంతి మీడియాకు చెప్పారు. 

Senior actress Jamuna : ప్రముఖ తెలుగు సీనియర్‌ నటి జమున కన్నుమూత.. ఈమె ప్ర‌స్థానం ఇలా..

లోయలో పడిన బస్సు.. పాక్‌లో 42 మంది సజీవ దహనం 
పాకిస్తాన్‌లో బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో జ‌న‌వ‌రి 29న‌ జరిగిన రోడ్డు ప్రమాదంలో 42 మంది సజీవదహనమయ్యారు. బలూచిస్తాన్‌ రాజధాని క్వెట్టా నుంచి సింధు ప్రావిన్స్‌ రాజధాని కరాచీకి 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లాస్‌బెలా వద్ద ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న ఈ బస్సు మలుపులో పిల్లర్‌ను ఢీకొట్టి, లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. అనంతరం బస్సులో మంటలు చెలరేగి 42 మంది ప్రయాణికులు గుర్తు పట్టడానికి వీలు లేనంతగా మసయ్యారు. ఈ ఘటనలో ఒక చిన్నారి, మహిళ సహా ముగ్గురు మాత్రమే క్షేమంగా బయటపడ్డారు. మిగతా ముగ్గురు క్షతగాత్రుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.  

Age Reversal: 45 ఏళ్ల వయసులో 18 ఏళ్ల కుర్రాడిగా కనిపించేందుకు.. ఏటా రూ.16 కోట్ల ఖర్చు!
 
Air Force: 2025లో అమెరికా, చైనా యుద్ధం! 
2025లో చైనాతో యుద్ధం తప్పకపోవచ్చని అమెరికా ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌ చీఫ్‌ జనరల్‌ మైక్‌ మినహాన్‌ అంచనా వేశారు. 2024లో అమెరికాతోపాటు తైవాన్‌లో ఎన్నికలు జరగాల్సి ఉన్నందున, ఆ అవకాశంగా తీసుకుని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తైవాన్‌పై దాడికి పాల్పడవచ్చన్నారు. అందుకే, ఏఎంసీ సిబ్బంది గురి తప్పకుండా కాల్పులు జరిపేలా కఠోర శిక్షణకు సిద్ధం కావాలని, రికార్డులను అప్‌డేట్‌ చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన జ‌న‌వ‌రి 27వ తేదీ తన కమాండర్లకు పంపిన మెమో మీడియాకు అందింది. చైనాపై పోరాడి గెలిచేందుకు సమీకృత, పటిష్ట బృందాలను సిద్ధం చేయాలని నిర్దేశించారు. ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌(ఏఎంసీ) కింద 50 వేల మంది ఆర్మీ సిబ్బంది, 500 విమానాలు ఉన్నాయి. రవాణా, ఇంధన అవసరాలు తీర్చడం ఈ విభాగం ప్రధాన బాధ్యతలు. తైవాన్‌ చైనాలో అంతర్భాగం, ఎప్పటికైనా కలిపేసుకుంటామంటూ డ్రాగన్‌ దేశం చెబుతోంది. ఈ అంశంపై చైనా, అమెరికాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 

India China: భారత్, చైనా మధ్య ఘర్షణలు!

Petrol Price: లీట‌ర్ పెట్రోల్ రూ.250
పాకిస్తాన్‌లో మరోసారి పెట్రో ధరల మోత మోగింది. లీటర్‌ పెట్రోల్, డీజిల్‌ ధరలపై రూ.35 రూపాయలు పెంచుతున్నట్టుగా పాకిస్తాన్‌ ఆర్థిక శాఖ మంత్రి ఇషక్‌ దార్‌ ప్రకటించారు. పెట్రో ధరలు పెంచుతున్నట్టుగా ఉదయం 10:50 గంటలకు ప్రకటించిన మంత్రి మరో పది నిముషాల్లో అంటే 11 గంటల నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారు. ఇక కిరోసిన్, లైట్‌ డీజిల్‌ ధరల్ని లీటర్‌కి రూ.18 పెంచారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు 11శాతం పెరగడం, పాకిస్తాన్‌ రూపాయి మారకం విలువ పడిపోవడంతో వీటి ధరలు పెంచకతప్పడం లేదని ఇషక్‌ చెప్పారు. గత నాలుగు నెలలుగా పెట్రోల్, డీజిల్‌ పెంచని విషయాన్ని గుర్తు చేశారు.
పెట్రో ధరలు ఇలా (లీటర్‌కి) 
పెట్రోల్‌     రూ.249.80 
హై స్పీడ్‌ డీజిల్‌     రూ.262.80 
కిరోసిన్‌     రూ.189.83 
లైట్‌ డీజిల్‌ ఆయిల్‌     రూ.187  

Pakistan Rupee: పాక్‌ రూపాయి మరింత పతనం

Published date : 30 Jan 2023 06:31PM

Photo Stories