Skip to main content

జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఏ జిల్లా నుంచి సీఎం ప్రారంభించారు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమం ప్రారంభమైంది.
Current Affairs

అక్టోబర్ 8న కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని పునాదిపాడు జడ్పీ హైస్కూలులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యా కానుక కిట్‌లను విద్యార్థులకు సీఎం అందజేశారు. తరగతి గదిలో కాసేపు విద్యార్థులతో గడిపారు. విద్యా కానుక ద్వారా ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ బడుల్లో ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్‌లు అందజేయనున్నారు.

విద్యా కానుక-ప్రధానాంశాలు

  • పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
  • విద్యా కానుక ద్వారా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 42,34,322 మంది విద్యార్థిని, విద్యార్థులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్కూల్ కిట్లు పంపిణీ చేస్తారు.
  • విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను ఈ కిట్ల రూపంలో అందించనున్నారు.
  • 3 జతల యూనిఫారం వస్త్రం, కుట్టు కూలి సొమ్ము, బ్యాగు, టెక్ట్స్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్కుబుక్‌లు, బెల్టు, సాక్సులు, బూట్లు కిట్‌గా అందిస్తారు.
  • స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలు యూనిఫామ్‌లు కుట్టించుకునే విధంగా వారికి ముందుగానే ఈ కిట్లు అందజేస్తున్నారు.
  • యూనిఫామ్ కుట్టు కూలీ మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా జమ చేస్తారు.
  • ప్రతి బడిలో ఈ కార్యక్రమం అక్టోబర్ 8వ తేదీ నుంచి 3 రోజుల పాటు కొనసాగుతుంది.


ముఖ్యమంత్రి ప్రసంగం...
విద్యా కానుక ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఆ వివరాలు..

  • రాష్ట్రంలోని పేద పిల్లల చదువుల బాధ్యతంతా మేనమామగా తనదే, తల్లిదండ్రులపై నయా పైసా భారం పడకుండా వారికి మంచి చదువులు అందించేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.
  • ప్రతి పిల్లాడు గొప్పగా చదివితేనే వారి తలరాతలు మారి పేదరికం నుంచి బయట పడతారు. ఇందుకోసం అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, సంపూర్ణ పోషణ, మనబడి నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుక, కంటి వెలుగు తదితర పథకాలు, కార్యక్రమాలతో చదువుల చరిత్రను పూర్తిగా మారుస్తున్నాం.
  • అంగన్‌వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం.
  • పేద పిల్లలు పెద్దవారి పిల్లలతో పోటీపడేలా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెడుతున్నాం.
  • మార్కెట్లో ఇంగ్లిష్ చదువులు కాస్ట్‌లీ సరుకుగా మారిన పరిస్థితుల్లో తల్లిదండ్రుల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులు పిల్లల చదువులను నిర్ణయిస్తున్నాయి. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని అంగన్‌వాడీ నుంచి ప్రారంభించి ఉన్నత విద్య వరకు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం.
  • ‘నోబెల్ బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్.. వన్ చైల్డ్, వన్ టీచర్, వన్ పెన్, వన్ బుక్ కెన్ ఛేంజ్ ద వరల్డ్’ అని అన్నారు.
  • ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టూ ఛేంజ్ ద వరల్డ్’ అని నెల్సన్ మండేలా చెప్పారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జగనన్న విద్యా కానుక కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : పునాదిపాడు జడ్పీ హైస్కూలు, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా
ఎందుకు : ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా
Published date : 10 Oct 2020 12:13PM

Photo Stories