Skip to main content

జైశంకర్‌తో సమావేశమైన అమెరికా విదేశాంగ మంత్రి?

భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ సమావేశమయ్యారు.
భారత రాజధాని న్యూఢిల్లీలో జూలై 28న జరిగిన ఈ భేటీలో... అఫ్గానిస్తాన్‌లో తాజా పరిస్థితి, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో పరిణామాలు, కోవిడ్‌పై పోరాటం తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. భారత్, అమెరికా దేశాల చర్యలే 21వ శతాబ్దాన్ని నిర్దేశించబోతున్నాయని బ్లింకెన్‌ అన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తోనూ బ్లింకెన్‌ సంప్రదింపులు జరిపారు.

దలైలామా ప్రతినిధి డాంగ్‌చుంగ్‌తో భేటీ...
టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా తరఫు సీనియర్‌ ప్రతినిధి గాడప్‌ డాంగ్‌చుంగ్‌తో బ్లింకెన్‌ సమావేశమయ్యారు. తద్వారా టిబెట్‌కు అమెరికా మద్దతు కొనసాగిస్తోందనే సందేశాన్నిచ్చారు.

మరో 25 మిలియన్‌ డాలర్లు...
భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి అమెరికా ప్రభుత్వం నుంచి యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూఎస్‌ఎయిడ్‌) ద్వారా మరో 25 మిలియన్‌ డాలర్ల సాయం అందించనున్నట్లు బ్లింకెన్‌ తెలిపారు. కరోనా ప్రారంభ దశలో భారత్‌ సహకారం మర్చిపోలేనిదని వ్యాఖ్యానించారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశం
ఎప్పుడు : జూలై 28
ఎవరు : అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : అఫ్గానిస్తాన్‌లో తాజా పరిస్థితి, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో పరిణామాలు, కోవిడ్‌పై పోరాటం తదితర కీలక అంశాలపై చర్చలు జరిపేందుకు...
Published date : 29 Jul 2021 05:41PM

Photo Stories