Skip to main content

జాతీయ నియామక సంస్థ ఏర్పాటుకు ఆమోదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో సంస్కరణలకు మార్గం సుగమం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆగస్టు 19న సమావేశమైన కేంద్ర కేబినెట్‌ జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్‌ఏ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
Current Affairs
నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్ఆర్‌ఏ) గ్రూప్‌ బి, గ్రూప్‌ సి (నాన్–టెక్నికల్‌) పోస్టులకు అభ్యర్థులను పరీక్షించడానికి, షార్ట్‌లిస్ట్‌ చేయడానికి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీఈటీ) నిర్వహిస్తుంది. ఎన్ఆర్‌ఏలో రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌కు చెందిన ప్రతినిధులు ఉంటారు.

రూ.1,517 కోట్ల వ్యయం...
ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌ సంస్థలు ఇక వేర్వేరుగా నియామక పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేకుండా.. ఎన్ఆర్‌ఏ ప్రిలిమినరీ స్థాయి పరీక్షగా సీఈటీ నిర్వహించి స్కోరు కేటాయిస్తుంది. కేంద్రం ఎన్ఆర్‌ఏ కోసం రూ.1,517.57 కోట్లు ఖర్చు చేయనుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షాకేంద్రాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులను వెచ్చిస్తారు.

ఇవీ ప్రయోజనాలు
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు వివిధ పోస్టుల కోసం బహుళ నియామక సంస్థలు నిర్వహించే విభిన్న పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది. బహుళ నియామక సంస్థలకు ఫీజులు చెల్లించాల్సి రావడం, వివిధ పరీక్షల్లో హాజరు కావడానికి చాలా దూరం ప్రయాణించాల్సి రావడం, ఆయా పరీక్షలు అభ్యర్థులపై, అలాగే సంబంధిత నియామక ఏజెన్సీలపై ఆర్థిక భారం మోపుతుండడం, సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, వేదిక లభ్యత వంటి అనేక సమస్యలు ప్రస్తుత విధానంలో ఉత్పన్నమవుతున్నాయి. సగటున 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. వీటన్నింటికీ పరిష్కారంగా ప్రిలిమినరీ పరీక్షగా ఒక సాధారణ అర్హత పరీక్ష నిర్వహించడం ద్వారా అభ్యర్థులు ఒకే సారి హాజరు కావడానికి, అలాగే తదుపరి దశలో ఉన్నత స్థాయి పరీక్ష కోసం ఈ నియామక ఏజెన్సీలలో ఏదైనా లేదా అన్నింటికీ దరఖాస్తు చేసుకోవడానికి ఎన్ఆర్ఏ వీలు కల్పిస్తుంది. దేశంలోని ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను చేరువ చేస్తుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షా మౌలిక సదుపాయాలను సృష్టించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం సాధ్యం అవుతుంది. దూర ప్రాంతాలలో నివసించే గ్రామీణ అభ్యర్థులను పరీక్ష రాయడానికి ప్రేరేపిస్తుంది.సీఈటీని ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్‌ఏ) ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు :ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థుల సమస్యల పరిష్కారం కోసం
Published date : 21 Aug 2020 12:32PM

Photo Stories