Skip to main content

ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి పురస్కారం

ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం 2019 సంవత్సరానికి గాను ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీని వరించింది.
ఆఫ్రికా దేశంలో శాంతి స్థాపన, అంతర్జాతీయ సహకారంలో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డు దక్కింది. ప్రధానంగా ఇథియోపియాకు సరిహద్దుల్లో ఉన్న ఎరిట్రియా దేశంతో దశాబ్దాల తరబడి నెలకొని ఉన్న సరిహద్దు ఉద్రిక్తతల్ని నివారించడానికి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో అబీ అహ్మద్ చూపించిన చొరవకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటిస్తున్నట్టుగా ఓస్లోలో నార్వే నోబెల్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తికి అత్యున్నత పురస్కారం రావడం ఇదే మొదటిసారి. 43 ఏళ్ల అబీ నోబెల్ పురస్కారం పొందిన 100వ విజేత. ఈ పురస్కారం కింద 90 లక్షల స్వీడిష్ క్రౌన్స్ (దాదాపు రూ.9.40 కోట్లు) అబీ అహ్మద్‌కు అందజేస్తారు. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతిని పురస్కరించుకొని డిసెంబర్ 10న నార్వేలోని ఓస్లోలో శాంతి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

అతడే ఒక సైన్యం :
ఒక సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి సైబర్ ఇంటెలిజెన్స్ విభాగంలో సాహసోపేతంగా వ్యవహరించి, ప్రధానిగా శాంతి స్థాపనకు పలు సంస్కరణలు తీసుకువచ్చిన అబీ అహ్మద్ ప్రస్థానం ఎంతో ఆసక్తికరం. దక్షిణ ఇథియోపియాలో జిమా జోన్‌లో 1976లో అబీ జన్మించారు. ఆయన తండ్రి ముస్లిం. తల్లి క్రిస్టియన్. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు. చదువుపై ఆసక్తితో ఎన్నో డిగ్రీలు సొంతం చేసుకున్నారు. శాంతిభద్రతల అంశంలో అడ్డీస్ అబాబా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. లండన్‌లో గ్రీన్ విచ్ యూనివర్సిటీ నుంచి నాయకత్వ మార్పిడి అనే అంశంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. టీనేజ్‌లో ఉండగానే సైన్యంలో చేరారు. లెఫ్ట్‌నెంట్ కల్నల్ పదవి వరకు ఎదిగారు ప్రమాదాలు ఎదుర్కొని వాటిని పరిష్కరించడం అయనకు ఎంతో ఇష్టమైన విషయం. 1998-2000 మధ్య ఎరిట్రియాతో యుద్ధ సమయంలో నిఘా విభాగంలో పనిచేశారు. గూఢచారిగా మారి ఎరిట్రియా నుంచి రక్షణకు సంబంధించి పలు రహస్యాలను రాబట్టారు. 1995లో ర్వాండాలో ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకర్తగా సేవలు అందించారు. 2010లో రాజకీయాల్లో చేరారు. ఒరోమో పీపుల్స్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ సభ్యుడిగా చేరి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. 2018 ఏప్రిల్‌లో ప్రధాని పగ్గాలు చేపట్టి దేశం దశ దిశ మార్చడానికి కృషి చేస్తున్నారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి పురస్కారం
ఎవరు: అబీ అహ్మద్ అలీ
ఎందుకు: ఆఫ్రికా దేశంలో శాంతి స్థాపన, అంతర్జాతీయ సహకారంలో ఆయన చేసిన కృషికిగాను..
ఎక్కడ: ఇథియోపియా
Published date : 12 Oct 2019 04:20PM

Photo Stories