Skip to main content

హాంకాంగ్‌లో నేరస్తుల అప్పగింత బిల్లు వెనక్కి

నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని చైనా సహా ఇతర దేశాలకు అప్పగించేందుకు ఉద్దేశించిన ‘నేరస్తుల అప్పగింత’ బిల్లును హాంకాంగ్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
ఈ మేరకు హాంకాంగ్ సిటీ సెక్రటరీ ఫర్ సెక్యూరిటీ జాన్ లీ హాంకాంగ్ చట్ట సభలో అక్టోబర్ 23న ప్రకటించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్ ప్రజలు కొన్ని నెలలుగా ఆందోళన చేపట్టారు. ఈ బిల్లుపై వ్యతిరేకతే తరువాత కాలంలో మరిన్ని ప్రజాస్వామ్య మార్పులను కోరుతూ తీవ్రమైన నిరసనలకు కారణమైంది.

బిల్లులో ఏముంది?
నేరస్తుల అప్పగింత బిల్లు ఆమోదం పొందితే చైనాతో పాటు ప్రపంచంలోని ఏ దేశానికై నా నేరానికి పాల్పడినట్లుగా భావిస్తున్న తమ పౌరులను హాంకాంగ్ అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హాంకాంగ్‌కు అమెరికా, యూకే సహా 20 దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. చైనాతో మాత్రం లేదు. 1997లో హాంకాంగ్ చైనా చేతికి వచ్చాక ఒక దేశం రెండు వ్యవస్థల విధానం కింద హాంకాంగ్‌కు 50 ఏళ్ల పాటు అత్యున్నత స్వయంప్రతిపత్తి, న్యాయ స్వతంత్రత లభించాయి. చాన్ అనే హాంకాంగ్ పౌరుడు తైవాన్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసి తిరిగి హాంకాంగ్‌కు వచ్చిన నేపథ్యంలో ఈ బిల్లును ప్రభుత్వం తెచ్చింది. చాన్ హాంకాంగ్ జైళ్లో ఉన్నాడు. నేరస్తుల అప్పగింతకు ముందు ఆ అభ్యర్థనను కోర్టులో సవాలు చేసే అవకాశం బిల్లులో ప్రతిపాదించారు. ఏడేళ్లు, లేదా ఆపై శిక్ష పడే నేరాలకే అప్పగింత వర్తించేలా ప్రతిపాదనను బిల్లులో చేర్చారు.
Published date : 24 Oct 2019 05:43PM

Photo Stories