ఘనంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Sakshi Education
దేశ వ్యాప్తంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని రాజ్‌పథ్ మార్గంలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో విదేశీ అతిథులుసహా రాజకీయ, ఆర్మీ అధికార గణం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత పరాక్రమ పురస్కారం అశోకచక్రను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..అమర జవాను లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ కుటుంబ సభ్యులకు ప్రదానం చేశారు.
ఈ ఏడాది జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, ఆదర్శాలు ఉట్టిపడేలా శకటాల ప్రదర్శన నిర్వహించారు. మొత్తం 22 శకటాలు పరేడ్‌లో పాల్గొనగా, అందులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవి 16 కాగా, మిగిలిన ఆరు కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందినవి ఉన్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
రాజ్‌పథ్ విశేషాలు..
రాజ్‌పథ్ విశేషాలు..
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తరువాత 21 తుపాకుల సెల్యూట్‌తో జాతీయ గీతాలాపాన జరిగింది. ఆ తరువాత కవాతు బృందాల నుంచి కోవింద్ గౌరవ వందనం స్వీకరించారు.
- పూర్తిగా మహిళలతో కూడిన అస్సాం రైఫిల్స్ బృందం తొలిసారి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన, 183 ఏళ్ల చరిత్ర గల అస్సాం రైఫిల్స్‌కు మేజర్ కుష్బూ కన్వర్(30) నేతృత్వం వహించారు.
- సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్‌ఏ)లో సభ్యులైన నలుగురు ఈసారి పరేడ్‌లో పాల్గొనడం విశేషం. వారందరి వయసు 90 ఏళ్లకు పైనే.
- నేవీ, ఆర్మీ సర్వీస్ కోర్, సిగ్నల్స్ యూనిట్ కోర్ బృందాలకు మహిళా అధికారులే నేతృత్వం వహించారు.
- గణతంత్ర వేడుకల్లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇది రెండోసారి. 1995లో మొదటిసారి నల్ల సూరీడు నెల్సన్ మండేలా హాజరయ్యారు.
- భారత వైమానిక దళ విమానాలు మొట్టమొదటిసారిగా సంప్రదాయ, జీవ ఇంధనాలతో కూడిన మిశ్రమాన్ని ఉపయోగించి కవాతులో పాల్గొన్నాయి.
Published date : 28 Jan 2019 06:34PM