Skip to main content

గ్రామాల్లో ఇంటర్నెట్ పరిజ్ఞానం తక్కువ: ఎన్‌ఎస్‌వో

పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది.
Current Affairsకంప్యూటర్, ఇంటర్నెట్ వినియోగంలో గ్రామీణ, పట్టణ భారతాల మధ్య పెద్ద ఎత్తున అంతరం ఉందని పేర్కొంది. ఈ మేరకు ‘హౌస్‌హోల్డ్ సోషల్ కన్జంప్షన్: ఎడ్యుకేషన్’పేరుతో 75వ రౌండ్ సర్వేను ఎన్‌ఎస్‌వో విడుదల చేసింది. 2017 జూలై నుంచి 2018 జూన్ వరకు 4 దశల్లో నిర్వహించిన ఈ సర్వేలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో ఎన్‌ఎస్‌వో అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా 1,13,757 కుటుంబాలను పలకరించి సమాచారం సేకరించింది.

ఎన్‌ఎస్‌వో సర్వేలోని అంశాలు
  • దేశంలో ఉన్న ప్రతి 100 గ్రామీణ కుటుంబాల్లో కేవలం నాలుగు కుటుంబాలు మాత్రమే ఇంట్లో కంప్యూటర్‌ను కలిగి ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో అయితే అది 23.4 శాతమని తేలింది.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను వినియోగించే వారి శాతం 14.9గా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 42 శాతంగా ఉంది.
  • ఐదేళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న వారిలో కేవలం 9.9 శాతం మంది మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నారు. అదే సమయంలో 13 శాతం ఇంటర్నెట్ సౌకర్యం వినియోగించే వెసులుబాటును కలిగి ఉన్నారు. గత 30 రోజుల్లో ఇంటర్నెట్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించిన వారి శాతం 10.8గా నమోదైంది.
  • పట్టణ ప్రాంతాల్లో 32.4 శాతం మందికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది. 37.1 శాతం మంది ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉండగా, అందులో 33.8 శాతం మంది గత 30 రోజుల్లో క్రమం తప్పకుండా ఇంటర్నెట్‌ను వినియోగించారు.
  • అక్షరాస్యతా శాతం: గ్రామీణ ప్రాంతాల్లో 73.5, పట్టణ ప్రాంతాల్లో 87.7
Published date : 26 Nov 2019 06:05PM

Photo Stories