Skip to main content

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ కన్నుమూత

దేశరాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావి, బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్(63) కన్నుమూశారు.
గతకొంతకాలంగా ప్యాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన మార్చి 17న గోవా రాజధాని పణజిలోని డౌనాపౌలాలో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, భారత రక్షణశాఖ మంత్రిగా పరీకర్ పనిచేశారు.

పోర్చుగీసు గోవాలోని మపుసా పట్టణంలో 1955, డిసెంబర్ 13న ఓ మధ్యతరగతి కుటుంబంలో పరీకర్ జన్మించారు. పాఠశాల స్థాయిలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) సిద్ధాంతాల పట్ట ఆకర్షితులై సంఘ్‌లో చేరారు. బాంబే ఐఐటీ నుంచి 1978లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. గోవా ముఖ్యమంత్రిగా 2000లో బాధ్యతలు చేపట్టిన పరీకర్ ఐఐటీలో చదువుకున్న తొలిసీఎంగా ఖ్యాతి గడించారు. అధికార ఆర్భాటం లేకుండా విమానాశ్రయానికి ఆటోలో రావడం, తన లగేజ్ తానే తీసుకురావడం వంటి నిరాడంబర జీవనశైలితో పరీకర్ ఆదర్శంగా నిలిచారు.

ఆరెస్సెస్ వ్యక్తిగా ముద్రపడ్డ పరీకర్ ఓవైపు సొంతవ్యాపారం చేసుకుంటూనే ఉత్తరగోవాలో ఆరెస్సెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1990ల్లో రామజన్మభూమి ఉద్యమంపై గోవాలో విసృ్తతంగా ప్రచారం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో 1991లో తొలిసారి పోటీచేసి ఓటమి చవిచూశారు. అనంతరం 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పణజి నుంచి విజయం సాధించారు. 2000లో గోవా పీపుల్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతును ఉపసంహరించుకోవడంతో పరీకర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
గోవా ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : మనోహర్ పరీకర్(63)
ఎక్కడ : డౌనాపౌలా, పణ జి, గోవా
ఎందుకు : ప్యాంక్రియాటిక్ కేన్సర్ కారణంగా
Published date : 18 Mar 2019 06:01PM

Photo Stories