Skip to main content

Daily Current Affairs in Telugu: ఫిబ్ర‌వ‌రి 3, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu February 3rd 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Director K.Viswanath: ఐదు జాతీయ అవార్డులు అందుకున్న ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ ఇకలేరు..  
ఓ శంకరాభరణం, ఓ సిరిసిరి మువ్వ, ఓ సిరివెన్నెల, ఓ స్వాతి ముత్యం, ఓ శుభసంకల్పం.. తెలుగు సినీరంగానికి ఇలాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలనిచ్చిన దర్శక దిగ్గజం, రచయిత, నటుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, కళా తపస్వి కె.విశ్వనాథ్‌గా ప్రఖ్యాతిగాంచిన కాశీనాథుని విశ్వనాథ్‌ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్‌ భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి ఫిలింనగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. 
విశ్వ విఖ్యాతి తెచ్చిన ‘శంకరాభరణం’ విడుదల రోజే.. 
గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెదపులిపర్రు గ్రామంలో జన్మించిన విశ్వనాథ్‌ ఫిలింనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయనకు విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన శంకరాభరణం సినిమా విడుదల రోజైన ఫిబ్రవరి 2వ తేదీనే కె.విశ్వనాథ్‌ కన్ను మూయడం విశేషం. 1930 ఫిబ్రవరి 19న జన్మించిన విశ్వనాథ్‌.. 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా 1965లో ఆత్మ గౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.  

Senior actress Jamuna : ప్రముఖ తెలుగు సీనియర్‌ నటి జమున కన్నుమూత.. 

వాహినీ పిక్చర్స్‌ జీఎంగా మొదలుపెట్టి.. 
కాశీనాథుని సుబ్రమణ్యం, సరస్వతమ్మ దంపతులకు కె.విశ్వనాథ్‌ జన్మించారు. ప్రాథమిక విద్య గుంటూరు జిల్లాలోనే సాగినా ఆ తర్వాత ఆయన కుటుంబం విజయవాడకు మకాం మార్చింది. అయితే కాలేజీ చదువు మాత్రం గుంటూరులో సాగింది. బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి ఆరంభించిన వాహినీ పిక్చర్స్‌లో విజయవాడ బ్రాంచ్‌కి జనరల్‌ మేనేజర్‌గా పనిచేశారు. బీఎస్సీ పూర్తి చేశాక చెన్నై వాహినీ స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్ట్‌గా కెరీర్‌ ఆరంభించారు. అన్నపూర్ణ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ‘తోడికోడళ్ళు’ సినిమాకు పనిచేస్తున్నపుడు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. ఆదుర్తి దర్శకత్వంలో ‘ఇద్దరు మిత్రులు’, ‘డాక్టర్‌ చక్రవర్తి’ వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేశారు. కె. విశ్వనాథ్‌ ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తన సంస్థ నిర్మించిన ‘ఆత్మ గౌరవం’ (1965) సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశారు. ‘సిరిసిరిమువ్వ’ సినిమాతో కె. విశ్వనాథ్‌ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 
51 చిత్రాలకు దర్శకత్వం..
అప్పటినుంచి చివరి సినిమా ‘శుభప్రదం’ (2016) వరకూ విశ్వనాథ్ 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో 41 తెలుగు కాగా 10 హిందీ. సాగరసంగమం, శ్రుతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వయంకృషి తదితర అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. విశ్వనాథ్‌ చిత్రాలన్నీ సంగీత ప్రాధాన్యంగా సాగడం ఓ విశేషం. నటుడిగానూ వెండితెరపై తనదైన ముద్రవేశారు. శుభసంకల్పం, నరసింహనాయుడు, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, సీతారామయ్యగారి మనవరాలు, ఠాగూర్, అతడు, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ తదితర చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా ఏ సినిమా తీసినా అది ఆరంభించి, ముగించేవరకూ షూటింగ్‌కి ఖాకీ బట్టలు ధరించడం విశ్వనాథ్‌ అలవాటు. తనను తాను కార్మికుడిలా భావిస్తానని, అందుకే ఖాకీ తొడుక్కుంటానని పలు సందర్భాల్లో విశ్వనాథ్‌ పేర్కొన్నారు. తాను దర్శకత్వం వహించిన కొన్ని తెలుగు చిత్రాలను హిందీలో రీమేక్‌ చేశారు. వాటిలో సరగమ్‌ (సిరిసిరిమువ్వ), సుర్‌సంగమ్‌ (శంకరాభరణం), కామ్‌చోర్‌ (శుభోదయం), శుభ్‌కామ్నా (శుభలేఖ), సమ్‌జోగ్‌ (జీవనజ్యోతి) ఉన్నాయి.  

Lucile Randon: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి కన్నుమూత

ఐదు జాతీయ అవార్డులు 
విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ సినిమాకు జాతీయ పురస్కారంతో పాటు ‘సప్తపది’కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. ‘స్వాతిముత్యం’ సినిమా 1986లో ఆస్కార్‌ అవార్డుల నామినేషన్లకు అధికారిక ప్రవేశం పొందింది. మొత్తం ఐదు జాతీయ అవార్డులు లభించాయి. భారతీయ సినిమాకు చేసిన సేవకు గాను విశ్వనాథ్‌కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. దాదాసాహెబ్‌ ఫాల్కేతో పాటు ఐదు నంది అవార్డులు, 10 ఫిలింఫేర్‌ అవార్డులు, ‘సాక్షి’ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కూడా అందుకున్నారు.  

Investments Conferences: దేశవ్యాప్తంగా ఏపీ ‘పెట్టుబడుల’ సదస్సులు
పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా విశాఖలో మార్చి నెలలో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సును విజయవంతం చేయడమే లక్ష్యంగా.. దేశవ్యాప్తంగా పెట్టుబడుల సన్నాహక సదస్సులను ఏపీ ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఫిబ్రవరి 10 నుంచి 24 వరకు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించేందుకు ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ప్రణాళికలు రూపొందించింది. సీఎం జగన్‌ ఇటీవల ఢిల్లీలో ప్రారంభించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సన్నాహక సదస్సు విజయవంతమవ్వడంతో.. అదే స్ఫూర్తితో ఈ రోడ్‌షోలను కూడా నిర్వహించబోతోంది. 
ఫిబ్రవరి 10న త్రివేండ్రం, కోల్‌కతా, 14న బెంగళూరులో, 17న చెన్నై, అహ్మదాబాద్, 21న ముంబై, 24వ తేదీన హైదరాబాద్‌లో ఈ రోడ్‌షోలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశమున్న వనరులు, ప్రయోజనాలను వివరించడంతో పాటు ప్రధానంగా 13 రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ రోడ్‌ షోలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఇప్పటికే ఆసక్తిని వ్యక్తం చేశాయి. మార్చి 3–4 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో ఆ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడు లు పెడుతూ.. వాస్తవ ఒప్పందాలు చేసుకుంటా యని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. 

Jagananna Thodu scheme : ఆ కష్టం రావొద్దనే ఈ పథకం తెచ్చాం.. సీఎం జగన్‌

Supreme Court: వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఉద్యోగుల‌కు నో పే స్కేల్‌ రివిజన్ 
స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌) తీసుకున్న ఉద్యోగులకు ఆ తర్వాతి కాలంలో వచ్చిన పే స్కేల్‌ రివిజన్‌లను వర్తింపజేయడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మహారాష్ట్ర స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌లో వీఆర్‌ఎస్‌ తీసుకున్న కొందరు మాజీ ఉద్యోగులు వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు పై విధంగా స్పందించింది. ‘జీతభత్యాల పెంపు, పే స్కేల్‌ రివిజన్‌ అనేది పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయం. ఉద్యోగుల జీవితాలతో ముడిపడిన అంశమైనందున ఈ విషయం పరిశీలించే బాధ్యత ప్రభుత్వాలదే. ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలకనుగుణంగా జీతాలు ఉండాలి’ అని తెలిపింది.  

Supreme Court: సుప్రీం జడ్జీలుగా అలహాబాద్, గుజరాత్‌ హైకోర్టు సీజేలు

Indian American: అమెరికా హౌస్‌ కమిటీల్లో నలుగురు ఇండియన్‌ అమెరికన్‌ల‌కు చోటు  
అమెరికా రాజకీయాల్లో ఇండియన్‌ అమెరికన్లకి ప్రాధాన్యత పెరుగుతోంది. కాంగ్రెస్‌ సభ్యులైన నలుగురు ఇండియన్‌ అమెరికన్లను అత్యంత ముఖ్యమైన హౌస్‌ పానెల్స్‌ సభ్యులుగా నియమించారు. ఇమిగ్రేషన్‌ శాఖలో అత్యంత శక్తిమంతమైన హౌస్‌ జుడీషియరీ కమిటీ ప్యానెల్‌ సభ్యురాలిగా కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రమీల జయపాల్‌ నియమితులయ్యారు. అమెరికాలో ఛిన్నాభిన్నంగా మారిన ఇమిగ్రేషన్‌ వ్యవస్థని గాడిలో పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు జయపాల్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇంటెలిజెన్స్‌కు సంబంధించి వ్యవహారాలను నడిపే కమిటీ సభ్యుడిగా అమిబేరాని నియమించారు. అమెరికా జాతీయ భద్రత అంశంలో ఇంటెలిజెన్స్‌ కమిటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలిఫోర్నియా నుంచి ఆరు సార్లు కాంగ్రెస్‌కు ఎన్నికైన బేరా జాతి భద్రతకు సంబంధించిన కమిటీలో సభ్యుడు కావడం ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. అమెరికా సహా ప్రపంచదేశాలకు ముప్పుగా మారిన చైనా వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా రాజా కృష్ణమూర్తిని నియమించారు. మరొక ఇండియన్‌ అమెరికన్‌ ప్రజా ప్రతినిధి రో ఖన్నాకి అమెరికా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీకి సంబంధించిన కమిటీలో సభ్యుడిగా చోటు కల్పించారు. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా ఆర్థికంగా, భద్రతా పరంగా అమెరికా సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేయాల్సిన అవసరం ఉందని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.   

Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయ‌నున్న ఇండో-అమెరికన్

High Court Judges: 554 మంది జడ్జీల్లో 430 మంది జనరల్‌ కేటగిరీకి చేందిన‌వారే..
2018 నుంచి హైకోర్టు జడ్జీలుగా నియమితులైన 554 మందిలో 430 మంది జనరల్‌ కేటగిరీకి చెందిన వారేనని న్యాయ శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు రాజ్యసభలో తెలిపారు. మిగిలిన వారిలో 58 మంది ఇతర వెనుకబడిన కులాలకు, 19 మంది షెడ్యూల్‌ కులాలకు చెందిన వారు కాగా, కేవలం ఆరుగురు షెడ్యూల్‌ తెగలకు, 27 మంది మైనారిటీలని వివరించారు. మొత్తమ్మీద 84 మంది మహిళా జడ్జీలున్నారని చెప్పారు. మొత్తం జడ్జీల్లో జనరల్‌ కేటగిరీకి చెందిన వారే 77% పైగా ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలకు రిజర్వేషన్లు లేవని మంత్రి పేర్కొన్నారు. అత్యున్నత న్యాయ వ్యవస్థలోనూ సామాజిక వైవిధ్యం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జడ్జీల నియామకాలకు ప్రతిపాదనలు పంపే సమయంలో అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ, మహిళా జడ్జీల పేర్లను కూడా పరిశీలించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరుతోందని వెల్లడించారు. 2018 నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో 30 మంది జడ్జీలు నియమితులయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా జడ్జీల్లో 612 మంది ఎస్సీలు, 204 మంది ఎస్‌టీలు, 1,329 మంది ఓబీసీలు, 1,406 మంది మహిళలు ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (8-14 జనవరి 2023)

Queen Elizabeth: కరెన్సీ నోటుపై ఎలిజబెత్ రాణి ఫోటో తొలగింపు..
ఆస్ట్రేలియా మరో బ్రిటిష్‌ వలసపాలన తాలూకు గుర్తును చెరిపేసుకుంటోంది. అక్కడి 5 ఆస్ట్రేలియా డాలర్ల కరెన్సీ నోటుపై ఇన్నాళ్లూ బ్రిటిష్‌ రాణి ఎలిజబెత్‌ ముఖచిత్రాన్ని ముద్రించారు. రాణి ఎలిజబెత్‌ అస్తమయం తర్వాత రాజుగా పగ్గాలు చేపట్టిన కింగ్‌ ఛార్లెస్‌ ముఖచిత్రాన్ని 5 డాలర్ల కరెన్సీ నోటుపై ముద్రించాలని భావించట్లేదని ఆస్ట్రేలియా కేంద్ర బ్యాంక్ ఫిబ్రవ‌రి 2వ తేదీ ప్రకటించింది. అయితే, ఛార్లెస్‌ ఫొటో ఉండే కొత్త నాణేలను మాత్రం ఈ ఏడాది చివరిలోపు చలామణిలోకి తీసుకురానున్నారు. ఇన్నాళ్లూ ఒక్క 5 డాలర్ల నోటుపైనే బ్రిటిష్‌ రాజరిక ఆనవాళ్లు ఉండేవి. రాణి ఫొటో తొలగింపుతో నోట్లపై నామరూపాలు పోయినట్లే. ఈ మార్పుపై ప్రభుత్వంతో చర్చించాకే ఈ తుది నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బ్యాంక్‌ వెల్లడించింది. 

Air Force: 2025లో అమెరికా, చైనా యుద్ధం!

కొత్త నోటుకు ఒకవైపు పార్లమెంట్, మరో వైపు..
ప్రస్తుత 5 డాలర్ల నోటుకు ఒకవైపు క్వీన్ ఎలిజబెత్ 2 ఫోటో, మరోవైపు ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనం ఉంటుంది. ‘కొత్త నోటుకు ఒకవైపు ఆస్ట్రేలియా పార్లమెంట్, మరో వైపు ఆస్ట్రేలియా తొలితరం స్థానికుల లేదా దేశ అద్భుత ప్రకృతి అందాల ఫొటోను పొందుపరుస్తాం’ అని ఆర్థిక మంత్రి జిమ్‌ చామర్స్‌ అన్నారు. కరెన్సీపై రాజరికాన్ని వదలుకోవడంపై అక్కడి రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గణతంత్రదేశంగా ఆవిర్భవించే ప్రయత్నం చేస్తోందని కొందరు ఎంపీలు వ్యాఖ్యానించారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (01-07 జనవరి 2023)

Published date : 03 Feb 2023 06:14PM

Photo Stories