Skip to main content

ఎయిరిండియా విక్రయానికి కేంద్రం సిద్ధం

తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాను పూర్తిగా విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
Current Affairsసంస్థలోని మొత్తం 100 శాతం వాటాను వ్యూహాత్మక విక్రయం ద్వారా అమ్మేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక విధివిధానాలను జనవరి 27న విడుదల చేసింది. బిడ్డింగ్ పత్రంలోని వివరాల ప్రకారం... ఎయిరిండియాతో పాటు, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, సింగపూర్ ఎయిర్‌లైన్స్ తో కలిసి నిర్వహిస్తున్న గ్రౌండ్‌హ్యాండ్లింగ్ సేవల సంయుక్త సంస్థ ఏఐఎస్‌ఏటీఎస్‌లో ఉన్న 50 శాతం వాటాలను విక్రయిస్తారు. అలాగే యాజమాన్య హక్కులను బదలాయిస్తారు.

వాటికి మాత్రం మినహాయింపు...
ఎయిరిండియాకు ఇతర అనుబంధ సంస్థల్లో కూడా వాటాలు ఉన్నాయి. ప్రధానంగా ఎయిరిండియా ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్, ఎయిర్‌లైన్ అలైడ్ సర్వీసెస్, హాటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల్లో కీలక వాటాలున్నాయి. ఈ వాటాలను మాత్రం తాజాగా ప్రతిపాదించిన వాటా అమ్మకం నుంచి మినహాయించారు. వీటిని ప్రత్యేక సంస్థ ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్(ఏఐఏహెచ్‌ఎల్)కు బదలాయిస్తారు.

రూ.60,074 కోట్లు : ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లకు 2019 మార్చి 31 నాటికి ఉన్న మొత్తం రుణ భారం

రూ.4,800 కోట్లు : 2018-19లో ఎయిరిండియా నిర్వహణ నష్టాలు

17,984 : 2019 నవంబర్ 1 నాటికి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లలో మొత్తం ఉద్యోగులు

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా విక్రయం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయినందున
Published date : 28 Jan 2020 05:49PM

Photo Stories