Skip to main content

ఏపీలో సీపెట్-సీఎస్‌టీఎస్ భవనం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన సీపెట్-సీఎస్‌టీఎస్ నూతన భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ అక్టోబర్ 24న ప్రారంభించారు.
అనంతరం సీపెట్ పారిశ్రామిక ఆవిష్కరణల ప్రదర్శనను తిలకించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సురంపల్లిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సీపెట్-సీఎస్‌టీఎస్(సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సెంటర్ స్కిల్లింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్) నూతన భవనాన్ని నిర్మించాయి.

సీపెట్ భవనం ప్రారంభం సందర్భంగా మంత్రి డీవీ మాట్లాడుతూ... ప్లాస్టిక్ రంగంలో పరిశోధనలు, ఉపాధి అవకాశాలను మరింతగా పెంపొందించేందుకు దేశంలో త్వరలో కొత్తగా మరో అయిదు సీపెట్ కేంద్రాలను ప్రారంభించనున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మరో సీపెట్‌ను నెలకొల్పుతామని ప్రకటించారు. 9.30 శాతం వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతున్న దేశ ప్లాస్టిక్ పరిశ్రమ విలువ 2025 నాటికి 340 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణ దిశగా పరిశోధనలను విస్తృతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 25 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను నెలకొల్పుతామని చెప్పారు. దేశంలో మన రాష్ట్రం మాత్రమే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిందన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సీపెట్-సీఎస్‌టీఎస్(సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సెంటర్ స్కిల్లింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్) నూతన భవనం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ
ఎక్కడ : సురంపల్లి, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా
Published date : 25 Oct 2019 05:41PM

Photo Stories