Skip to main content

ఏపీలో జగనన్న విద్యాదీవెన పథకం ప్రారంభం

పేదరికం వల్ల ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదని, పిల్లల చదువుల కోసం కుటుంబం అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
Current Affairs
పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువు ఒక్కటే అని పునరుద్ఘాటించారు. అందుకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం జగనన్న విద్యా దీవెన అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఏప్రిల్ 28న ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లాల కలెక్టర్లు, విద్యార్థులు, వారి తల్లులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘రాబోయే విద్యా సంవత్సరం (2020-21) నుంచి ప్రతి త్రైమాసికానికి సంబంధించిన పూర్తి బోధనా రుసుముల్ని విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమచేస్తాం. 2020 ఏడాది మార్చి 31 వరకూ బకాయి ఉన్న బోధనారుసుములన్నీ చెల్లించాం. 2018–19 సంవత్సరానికి అంటే గత ప్రభుత్వం ఫీజుల రీయింబర్స్‌మెంట్‌లో పెట్టిన బకాయిలు.. దాదాపు రూ.1,880 కోట్లు కట్టాము. 2018-19, 2019-20ల బోధనారుసుములు రూ.4,200 కోట్లు విడుద‌ల చేశాం. 2019-20కి సంబంధించి ఒకవేళ తల్లిదండ్రులు ఇప్పటికే ఫీజులు చెల్లించే ఉంటే కళాశాలలు వాటిని తిరిగివ్వాలి’ అని సీఎం పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు : విద్యార్థుల పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం
Published date : 29 Apr 2020 08:49PM

Photo Stories