Skip to main content

ఏపీ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు

Edu newsఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య నియమితులయ్యారు. వీరి నియామకానికి జనవరి 10న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ నలుగురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరుకోనుంది. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి జనవరి 13న ప్రమాణం చేయించనున్నారు.

రావు రఘునందన్‌రావు
1964 జూన్ 30న జన్మించిన రావు రఘునందన్‌రావు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1988లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1993 నుంచి 94 వరకు ఏజీపీగా పనిచేశారు. 1995లో అడ్వొకేట్ జనరల్‌కు సహకరించేందుకు స్పెషల్ ఏజీపీగా నియమితులయ్యారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లకు న్యాయవాదిగా ఉన్నారు. ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ సీనియర్ న్యాయవాదుల ప్యానెల్‌లో చోటు దక్కించుకున్నారు. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

బట్టు దేవానంద్
కృష్ణా జిల్లాకి చెందిన దేవానంద్ 1966 ఏప్రిల్ 14న జన్మించారు. గుడివాడ ఏజీకే పాఠశాలలో ఎస్‌ఎస్‌సీ, ఏఎన్‌ఆర్ కాలేజీలో ఇంటర్, బీఏ, ఆంధ్రా యూనివర్సిటీలో బీఎల్ చదివారు. 1989లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1996 నుంచి 2000 వరకు హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. 2004 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు.

నైనాల జయసూర్య
నైనాల జయసూర్య పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 1968లో జన్మించారు. విజయవాడలోని వెలగపూడి దుర్గాబాయి సిద్ధార్థ కాలేజీ ఆఫ్ లాలో ఎల్‌ఎల్‌బీ చదివారు. 1992లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2003-04లో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించారు. 2009-14 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీఎస్‌టీసీ, ఎస్‌టీసీ, హుడా తదితర ప్రభుత్వ రంగ సంస్థల తరఫున కేసులు వాదించారు. బీహెచ్‌ఈఎల్, ఆప్కో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్యానల్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.

దొనడి రమేశ్
1965 జూన్ 27న చిత్తూరు జిల్లా సోమల మండలం కామనపల్లిలో రమేశ్ జన్మించారు. తిరుపతి ఎస్వీ ఆర్‌‌ట్స కాలేజీలో ఇంటర్, బీకాం, నెల్లూరు వీఆర్ లా కాలేజీలో బీఎల్ చదివారు. 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2000-2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2006-13 మధ్య కాలంలో హైకోర్టులో రాజీవ్ విద్యా మిషన్, సర్వ శిక్షాఅభియాన్‌కు న్యాయవాదిగా వ్యవహరించారు. 2014 నుంచి 2019 వరకు హైకోర్టులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య
మాదిరి ప్రశ్నలు

1. జగనన్న అమ్మఒడి పథకం ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది.
 1. కర్నూలు 2020, జనవరి 8 
 2. చిత్తూరు 2020, జనవరి 9
 3. ఏలూరు 2020, జనవరి 10 
 4. మచిలీపట్నం 2019, డిసెంబర్ 9

Published date : 11 Jan 2020 06:23PM

Photo Stories