Skip to main content

ఏ నగరంలో నిర్వహించిన పరాక్రమ్ దివస్ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు?

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ‘పరాక్రమ్ దివస్’ వేడుకలను కేంద్ర ప్రభుత్వం జనవరి 23న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో నిర్వహించింది.
Edu news

ఈ కార్యక్రమంలో ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోదీ, బెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా.. నేతాజీ లేఖలతో కూడిన పుస్తకాన్ని, ఆయన స్మారకంగా స్టాంపు, నాణెంను ప్రధాని విడుదల చేశారు.

కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ... 2018లో అండమాన్‌లోని ఓ దీవికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా నామకరణం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్‌ఏ) సభ్యులు సైతం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటారని తెలిపారు. కోల్‌కతాలో సుభాష్ చంద్రబోస్ నివాసం నేతాజీ భవన్ను ప్రధాని సందర్శించారు. అనంతరం నేషనల్ లైబ్రరీలో నేతాజీపై నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌లో పాల్గొన్నారు.

మూడు దీవుల పేర్లు మార్పు
ప్ర‌ధాని నరేంద్ర మోదీ అండమాన్ నికోబార్ దీవులను 2018, డిసెంబర్ 30న సందర్శించారు. ఆ సందర్భంగా ఇక్కడి మూడు దీవుల పేర్లను మార్చారు. రాస్ ఐలాండ్ పేరును నేతాజీ సుభాస్ చంద్రబోస్ ద్వీప్గా, నీల్ ఐలాండ్‌ను షహీద్ ద్వీప్‌గా, హావెలాక్ ఐలాండ్‌ను స్వరాజ్ ద్వీప్‌గా మారుస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ మూడు దీవులు ప్రముఖ పర్యాటక ప్రదేశాలు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : పరాక్రమ్ దివస్ వేడుకలు
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
ఎక్కడ : విక్టోరియా మెమోరియల్ హాల్, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
ఎందుకు : నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా..

Published date : 25 Jan 2021 06:31PM

Photo Stories