Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్ 23 కరెంట్ అఫైర్స్
Zee-Sony Merger: దేశంలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ ఏది?
దేశీ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నయా డీల్‌కు తెరలేచింది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా(ఎస్‌పీఎన్‌ఐ)తో లిస్టెడ్ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్(జీల్) విలీనం కానుంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ సెప్టెంబర్ 22న తెలిపిన వివరాల ప్రకారం.. ఒప్పందంలో భాగంగా విలీన సంస్థలో సోనీ 1.575 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,600 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. అంతేకాకుండా 52.93 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. మిగిలిన 47.07 శాతం వాటాను జీ పొందనుంది. విలీన సంస్థ నిర్వహణ పగ్గాలను జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా చేపట్టనున్నారు. విలీన సంస్థలో మెజారిటీ బోర్డు సభ్యులను సోనీ నియమించనుంది.
అతిపెద్ద నెట్‌వర్క్...
ఎస్‌పీఎన్‌ఐతో జీల్ విలీనం తర్వాత... సంయుక్త సంస్థ 70 టీవీ చానళ్లు, 2 వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు(జీ5, సోనీ లివ్), రెండు స్టూడియోల (జీ, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా)ను కలిగి ఉంటుంది. వెరసి దేశంలో అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్‌గా ఆవిర్భవించనుంది. దీంతో దేశీ మార్కెట్లో సమీప ప్రత్యర్థి సంస్థగా స్టార్ డిస్నీ నిలవనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా(ఎస్‌పీఎన్‌ఐ)తో విలీనం కానున్న సంస్థ?
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్(జీల్)
ఎందుకు : ఎస్‌పీఎన్‌ఐ, జీల్ మధ్య తాజాగా కుదిరిన ఒప్పందం మేరకు...
Union Minister Piyush Goyal: కేంద్ర ఆవిష్కరించిన సింగిల్ విండో పోర్టల్ ఉద్దేశం?
వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్లు, వ్యాపారాలకు అనుమతుల కోసం ‘‘నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS)’’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సెప్టెంబర్ 22న న్యూఢిల్లీలో దీన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ పోర్టల్ వల్ల వ్యాపారాలను నమోదు చేసుకునేందుకు, ఇన్వెస్ట్ చేసేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరగాల్సిన సమస్య తప్పుతుందని మంత్రి గోయల్ పేర్కొన్నారు.
ప్రస్తుతం సింగిల్ విండో పోర్టల్ ద్వారా 18 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, 9 రాష్ట్రాలకు సంబంధించిన అనుమతులు పొందవచ్చు. 2021, డిసెంబర్ ఆఖరు నాటికి మరో 14 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ఇంకో 5 రాష్ట్రాలను చేర్చనున్నారు. యూజర్లు, పరిశ్రమ ఫీడ్‌బ్యాక్ బట్టి ఇందులో మరిన్ని అనుమతులు, లైసెన్సుల జారీ ప్రక్రియకు సంబంధించిన అంశాలను జోడించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘‘నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS)’’ పోర్టల్ ఆవిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు...
Asian Development Bank: ఏడీబీ అంచనాల ప్రకారం... 2021–22లో భారత్ వృద్ధి రేటు ఎంత?
2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధి రేటు 10 శాతంగా నమోదవుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అంచనా వేసింది. ఈ మేరకు గత ఏప్రిల్‌నాటి అంచనా 11 శాతాన్ని... 10 శాతానికి కుదిస్తూ సెప్టెంబర్ 22న ఒక నివేదిక(ఆసియా డెవలప్‌మెంట్ అవుట్‌లుక్–ఏడీఓ)ను విడుదల చేసింది. కోవిడ్–19 మహమ్మారి ప్రేరిత సవాళ్లు ఆర్థిక క్రియాశీలతకు విఘాతం కలిగిస్తుండడమే తాజా అంచనాలకు కారణమని తన నివేదికలో పేర్కొంది.
ఏడీబీ అవుట్‌లుక్‌లోని ముఖ్యాంశాలు...
- 2022–23లో భారత్ వృద్ధి 7.5 శాతానికి పరిమితం అవుతుంది.
- కరోనా సెకండ్‌వేవ్ భారత్ సేవలు, దేశీయ వినియోగం, పట్టణ అసంఘటిత రంగం ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపింది.
- 2021లో ఆసియా ప్రాంత వృద్ధి రేటు 7.3 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గుతుంది.
- 2021లో చైనా వృద్ధి రేటు అంచనా 8.1 శాతంగా ఉంటుంది. గృహ డిమాండ్ పటిష్టత దీనికి కారణం.అయితే 2022లో 5.5 శాతానికి తగ్గుతుంది. హైబేస్ దీనికి కారణం.
- దక్షిణాసియాలోని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో ఎకానమీల వృద్ధి తీరు వివిధ తీరులుగా ఉంటుంది. ఇంతకుముందు అంచనాలకన్నా వృద్ధి వేగం ఆయా దేశాల్లో మందగిస్తుంది. అయితే 2022లో వృద్ధి వేగం పెరిగే వీలుంది.
- అమెరికా, యూరో ప్రాంతం, జపాన్‌లలో 2022 వృద్ధి సగటును 3.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది.
- వేగవంతమైన వ్యాక్సినేషన్ వల్ల ఎకానమీల్లో కేసులు, మరణాల తీవ్రత తగ్గుతోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలు 11 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)
ఎందుకు : కోవిడ్–19 మహమ్మారి ప్రేరిత సవాళ్లు ఆర్థిక క్రియాశీలతకు విఘాతం కలిగిస్తున్నందున...
MCC: క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ను ఇకపై ఏ పేరుతో వ్యవహరించనున్నారు?
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నిబంధనలను రూపొందించే మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఒక కీలక మార్పు చేసింది. కేవలం పురుష ఆటగాడినే గుర్తు చేసే ‘బ్యాట్స్‌మన్’కు బదులుగా ఇకపై మహిళలకు కూడా ఉపయోగించే విధంగా ‘బ్యాటర్’ పదాన్ని చేర్చాలని నిర్ణయించింది. క్రీడల్లో లింగ వివక్ష ఉండరాదని, సాంకేతిక పదాల్లో కూడా అది కనిపించరాదనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేసినట్లు సెప్టెంబర్ 22న ఎంసీసీ ప్రకటించింది. ఇదే తరహాలో ‘బ్యాట్స్‌మెన్’ స్థానంలో ‘బ్యాటర్స్’ అని వ్యవహరిస్తారు.
సాఫ్ట్‌బాల్ విజేత తెలంగాణ
ఒడిశాలోని కటక్‌లో జరిగిన జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు విజేతగా నిలిచింది. సెప్టెంబర్ 22న జరిగిన ఫైనల్లో తెలంగాణ జట్టు 2–0తో మధ్యప్రదేశ్ జట్టును ఓడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేవలం పురుష ఆటగాడినే గుర్తు చేసే ‘బ్యాట్స్‌మన్’కు బదులుగా ఇకపై మహిళలకు కూడా ఉపయోగించే విధంగా ‘బ్యాటర్’ పదాన్ని చేర్చాలని నిర్ణయం
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)
ఎందుకు : క్రీడల్లో లింగ వివక్ష ఉండరాదని, సాంకేతిక పదాల్లో కూడా అది కనిపించకూడదని..
Kurasala Kannababu: ఏ దేశ సహకారంతో రాష్ట్రంలో ఆగ్రో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కానుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఆగ్రో ఎకలాజికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కానుంది. జర్మనీ సహకారంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని సెప్టెంబర్ 22న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం... వ్యవసాయ రంగంలో మరింత నాణ్యమైన పరిశోధనలు, సిబ్బందికి పూర్తి స్థాయిలో సాంకేతిక అవగాహన కోసం ఏర్పాటు చేస్తున్న ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు... రూ.170 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు జర్మనీ అంగీకరించింది. 2022, ఏప్రిల్ నుంచి తరగతులు నిర్వహించనున్నారు. ప్రకృతి సేద్యంపై పరిశోధనలతో పాటు వ్యవసాయ సిబ్బందికి సాంకేతిక శిక్షణ అందించడమే ఈ సెంటర్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జర్మనీ సహకారంతో ఆగ్రో ఎకలాజికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : పులివెందుల, వైఎస్సార్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఎందుకు : వ్యవసాయ రంగంలో మరింత నాణ్యమైన పరిశోధనలు, సిబ్బందికి పూర్తి స్థాయిలో సాంకేతిక అవగాహన కోసం...
Quad summit 2021: క్వాడ్ దేశాల శిఖరాగ్ర సమావేశం ఏ దేశ రాజధానిలో జరగనుంది?
అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్‌లో సెప్టెంబర్ 24న క్వాడ్ (Quadrilateral Security Dialogue-Quad) శిఖరాగ్ర సదస్సు–2021 జరగనుంది. నాలుగు దేశాల కూటమైన (అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా) క్వాడ్ సదస్సులో... ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లైన అఫ్గాన్ సంక్షోభం, కోవిడ్ మహమ్మారి, స్వేచ్ఛాయుత ఇండో ఫసిఫిక్ విధానంపై చర్చించనున్నారు. 2021, మార్చిలో కరోనా విజృంభణ కారణంగా నాలుగు దేశాల అధినేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. తాజా సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా తొలిసారిగా ప్రత్యక్షంగా సమావేశమవుతున్నారు. ఇప్పటివరకు క్వాడ్ సమావేశాలు విదేశాంగ మంత్రులు, దౌత్య ప్రతినిధుల మధ్య మాత్రమే జరిగాయి.
సదస్సులో చర్చకు వచ్చే అంశాలు..
- ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా పట్టు పెరిగిపోతున్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం నెలకొల్పడం
- దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియత్నాం దేశాలను కూడా కలుపుకొని క్వాడ్ ప్లస్ కూటమి ఏర్పాటు
- 2021, మార్చిలో ప్రకటించిన క్వాడ్ వ్యాక్సిన్‌పై సమీక్ష
- పర్యావరణ మార్పుల్ని ఎదుర్కోవడం
- సైబర్ స్పేస్, జీ5 టెక్నాలజీలో పరస్పర సహకారం
క్వాడ్ లక్ష్యాలేంటి?
క్వాడిలేటరలర్ సెక్యూరిటీ డైలాగ్(క్వాడ్)... అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రయోజనాలు కాపాడుకుంటూ భద్రతలో ఒకరికొకరు సహకరించుకోవడం దీని లక్ష్యం. 2004లో సునామీ అల్లకల్లోలం తర్వాత విపత్తుల సమయంలో సహకరించుకోవడానికి ఏర్పడిన ఈ కూటమి.. 2007లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబె చొరవతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపనే లక్ష్యంగా రూపాంతరం చెందింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, సెప్టెంబర్ 24న క్వాడ్ (Quadrilateral Security Dialogue-Quad) సదస్సు నిర్వహణ
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : అఫ్గాన్ సంక్షోభం, కోవిడ్ మహమ్మారి, స్వేచ్ఛాయుత ఇండో ఫసిఫిక్ విధానంపై చర్చలు జరిపేందుకు...
One Time Settlement: శాశ్వత గృహ హక్కు పథకం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది?
గృహ రుణాల నుంచి పేదలను విముక్తుల్ని చేసేందుకు ఉద్దేశించిన ‘‘జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం(జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం)’’ 2021, డిసెంబర్ 21 నుంచి అమల్లోకి రానుంది. గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సెప్టెంబర్ 22న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ పథకం వల్ల దాదాపు 67 లక్షల మంది పేదలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి వర్తింపచేసే వన్‌టైం సెటిల్‌మెంట్‌కు ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’ పథకం’ గా నామకరణం చేశారు.
సిరిసిల్లలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ
తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఎఫ్‌జీవీ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ విషయమై చర్చించేందుకు సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కంపెనీ ప్రతినిధి బృందంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు భేటీ అయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, డిసెంబర్ 21 నుంచి జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం అమలు
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా...
ఎందుకు : గృహ రుణాల నుంచి పేదలను విముక్తుల్ని చేసేందుకు...
Gurajada Apparao: ఇంగ్లిష్ పద్య కావ్యం సారంగధరను ఎవరు రచించారు?
మహాకవి గురజాడ వేంకట అప్పారావు 159వ జయంతి కార్యక్రమాలు సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన విజయనగరంలో సెప్టెంబర్ 21న ఘనంగా జరిగాయి. గురజాడ జయంతి(సెప్టెంబర్ 21న) సందర్భంగా.. గురజాడ సాంస్కృతిక సమాఖ్య, నవసాహితీ ఇంటర్నేషనల్ (చెన్నై) సంస్థలు సంయుక్తంగా ఉత్తమ కవితా పురస్కారాన్ని ప్రదానం చేశాయి. సాహిత్యం రంగంలో విశేష కృషి చేసిన బెంగళూరుకు చెందిన పువ్వాడ వెంకటేష్ ఈ అవార్డును అందుకున్నారు.
గురజాడ...
ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు 1862 సెప్టెంబరు 21న విశాఖపట్నం జిల్లా, ఎలమంచిలి మండలం, యస్. రాయవరం గ్రామంలో జన్మించారు. 1915, నవంబర్ 30న మరణించిన గురజాడ... తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరిగా నిలిచారు.
గురజాడ రచనల్లో కొన్ని...
- దేశమును ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా(దేశ భక్తి గేయం)
- కన్యాశుల్కము(నాటకం)
- సారంగధర (ఇంగ్లిష్ పద్య కావ్యం)
- పూర్ణమ్మ
- కొండుభట్టీయం
- నీలగిరి పాటలు
- ముత్యాల సరాలు
- కన్యక
- సత్యవ్రతి శతకము
- బిల్హణీయం (అసంపూర్ణం)
- సుభద్ర
- లంగరెత్తుము
- దించులంగరు
- లవణరాజు కల
- కాసులు
- సౌదామిని (రాయాలనుకున్న నవలకు తొలిరూపం)
- కథానికలు
- మీపేరేమిటి
- దిద్దుబాటు
- మెటిల్డా
- సంస్కర్త హృదయం
- మతము విమతము
- పుష్పాలవికలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : బెంగళూరుకు చెందిన పువ్వాడ వెంకటేష్‌కు ఉత్తమ కవితా పురస్కారం ప్రదానం
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : గురజాడ సాంస్కృతిక సమాఖ్య, నవసాహితీ ఇంటర్నేషనల్ (చెన్నై) సంస్థలు
ఎక్కడ : విజయనగరం, విజయనగరం జిల్లా
ఎందుకు : సాహిత్యం రంగంలో విశేష కృషి చేసినందుకు...
గంగవరం పోర్ట్‌లో ప్రభుత్వ వాటా కొనుగోలు పూర్తి
గంగవరం పోర్టు (జీపీఎల్)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీఎస్‌ఈజెడ్) వెల్లడించింది. ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాను రూ. 645 కోట్లకు కొనుగోలు చేసినట్లు సెప్టెంబర్ 22న తెలిపింది. మరోవైపు, ఏపీఎస్‌ఈజెడ్‌లో జీపీఎల్ విలీనానికి సంబంధించిన ప్రతిపాదనకు ఇరు కంపెనీల బోర్డ్‌లు ఆమోదముద్ర వేశాయి. దీంతో జీపీఎల్‌లో 100 శాతం వాటాలు ఏపీఎస్‌ఈజెడ్ దక్కించుకున్నట్లయ్యింది.
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్ 22 కరెంట్ అఫైర్స్