Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 22 కరెంట్‌ అఫైర్స్‌

V R Chaudhari


IAF: భారత వైమానిక దళం నూతన చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న అధికారి?

భారత వైమానిక దళం నూతన చీఫ్‌గా ఎయిర్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌధరి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌. భదూరియా 2021, సెప్టెంబర్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో చౌధరిని నియమించినట్లు భారత రక్షణ శాఖ సెప్టెంబర్‌ 21న వెల్లడించింది. చౌధరి ప్రస్తుతం వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌గా ఉన్నారు. 1982, డిసెంబర్‌ 29న ఎయిర్‌ ఫోర్స్‌లో చేరిన చౌధరి... దాదాపు 38 ఏళ్లపాటు వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. వైస్‌ చీఫ్‌కు ముందు ఆయన కీలకమైన లద్దాఖ్‌ బాధ్యతలను చూసే వెస్టర్న్‌ ఎయిర్‌ కమాండ్‌కు కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉన్నారు. మిగ్‌–21,23 ఎంఎఫ్, మిగ్‌–29, సుఖోయ్‌–30 ఎంకేఐ వంటి పలు రకాల యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఆయన సొంతం. 3,800 గంటలకుపైగా ఫ్లయింగ్‌ అనుభవం ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : త్వరలో భారత వైమానిక దళం నూతన చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న అధికారి?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 21
ఎవరు    : ఎయిర్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌధరి
ఎందుకు  : ప్రస్తుత ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌. భదూరియా 2021, సెప్టెంబర్‌ 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో... 

 

Canada Parliament Election: కెనడా ప్రధానమంత్రిగా మూడోసారి ఎన్నికైన నేత?

Justin Trudeau

కెనడా పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో... కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మూడోసారి విజయం సాధించారు. రెండేళ్లు ముందుగానే ఎన్నికలకు వెళ్లిన ట్రూడో.. ఈ సారి మెజార్టీ ప్రభుత్వం ఏర్పడితే విధాన పరమైన నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకోవచ్చునని ఆశించారు. కానీ ఇంచుమించుగా 2019 నాటి ఎన్నికల ఫలితాలే పునరావృతమయ్యాయి. 338 స్థానాలున్న కెనడా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో అధికార లిబరల్‌ పార్టీ 158 స్థానాలను గెలుచుకోగా, కన్జర్వేటివ్‌ పార్టీ 119 స్థానాలకు పరిమితమైనట్టుగా ప్రాథమిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 25 స్థానాలను దక్కించుకున్న న్యూ డెమొక్రాటిక్‌ పార్టీ మద్దతుతో జస్టిన్‌ ట్రూడో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ నాయకుడు ఎరిన్‌ ఒ టూలే తన ఓటమిని అంగీకరించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కెనడా ప్రధానమంత్రిగా మూడోసారి ఎన్నికైన నేత?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 22
ఎవరు    : కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో 
ఎందుకు : కెనడా పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో... అధికార లిబరల్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించినందున...


America CIA: హవానా సిండ్రోమ్‌ వ్యాధిని తొలుత ఏ దేశంలో గుర్తించారు?

Havana Syndrome

అమెరికా దౌత్యప్రతినిధులు, గూఢచారులకు సోకుతూ వైద్య రంగానికే సవాల్‌ విసిరిన హవానా సిండ్రోమ్‌ మొట్టమొదటిసారిగా భారత్‌లో వెలుగు చూసింది. 2021, సెప్టెంబర్‌ నెల మొదటి వారంలో భారత్‌ పర్యటనకు వచ్చిన అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ)కి చెందిన అధికారి హవానా సిండ్రోమ్‌ లక్షణాలతో బాధపడినట్టుగా ఆలస్యంగా బయటపడింది. తిరిగి వెళ్లిన వెంటనే ఆయనకు వైద్యం అందించినట్టు సెప్టెంబర్‌ 21న సీఎన్‌ఎన్‌ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 మంది అమెరికా అధికారులు, వారి కుటుంబీకులు ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

క్యూబాలో...
2017 ఏడాదిలో క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయం సిబ్బందిలో తొలిసారిగా హవానా సిండ్రోమ్‌ వ్యాధి లక్షణాలు మైగ్రేన్‌ తరహాలో తలనొప్పి, అలసట, కడుపులో వికారం, నిద్రమత్తు, చెవుల్లో వింత శబ్దాలు, తలతిరగడం  కనిపించాయి. ఎందుకు సోకుతోందో ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.

రష్యా దాడి చేస్తోందా ?
రష్యా నిఘా వర్గాలు అల్ట్రాసోనిక్‌ వెపన్స్‌ వాడడం ద్వారా అమెరికా ఇంటెలిజెన్స్‌ ప్రతినిధులపై దాడి చేస్తున్నాయని, అందువల్లే నరాల బలహీనత, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయనే అనుమానాలున్నాయి.

అమెరికా ఏమంటోంది?
ఇటీవల అమెరికా దౌత్య ప్రతినిధుల్లో హవానా సిండ్రోమ్‌ లక్షణాలు బయటకు రావడం సర్వసాధారణంగా మారిందని సీఐఏ వెల్లడించింది. ఎక్కువ మందిలో వైద్యం అందిన వెంటనే ఈ లక్షణాలు సర్దుకుంటున్నాయని, కొందరిలో మాత్రం శాశ్వతంగా మెదడు దెబ్బతింటోందని తెలిపింది. ఇది మానసిక ఒత్తిడికి సంబంధించిన వ్యాధిగా అమెరికాలోని పలువురు న్యూరాలజిస్టులు చెబుతున్నారు.


Education Ministry: స్టీరింగ్‌ కమిటీకి నేతృత్వం వహించనున్న ఇస్రో మాజీ చీఫ్‌?

Kasturirangan

జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధి కోసం ఇస్రో మాజీ చీఫ్‌ కస్తూరి రంగన్‌ నేతృత్వంలో జాతీయ స్టీరింగ్‌ కమిటీని కేంద్ర విద్యాశాఖ సెప్టెంబర్‌ 21న ఏర్పాటు చేసింది. కస్తూరి గతంలో జాతీయ విద్యా విధానం–2020 డ్రాఫ్టింగ్‌ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు.

మూడేళ్ళ కాలపరిమితితో...
మూడేళ్ళ కాలపరిమితితో నిర్ణయించిన ఈ నూతన కమిటీ జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)–2020 దృక్పథాల ప్రకారం నాలుగు జాతీయ పాఠ్యాంశాల ముసాయిదాలను అభివృద్ధి చేస్తుంది. పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా, ప్రారంభ బాల్య సంరక్షణ, విద్య కోసం జాతీయ పాఠ్యాంశాలు, ఉపాధ్యాయ విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక, వయోజన విద్య కోసం జాతీయ పాఠ్యాంశాల ముసాయిదాలను ఈ కమిటీలోని మొత్తం 12మంది సభ్యులు సిద్ధం చేయనున్నారు.

కమిటీలోని సభ్యులు
1. భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త కె.కస్తూరిరంగన్‌(చైర్మన్‌)
2 .నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రస్తుత ఛాన్సలర్‌ మహేష్‌ చంద్ర పంత్‌
3. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌  గోవింద్‌ ప్రసాద్‌ శర్మ
4. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి వైస్‌ ఛాన్సలర్‌ నజ్మా అక్తర్‌
5. సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ మొదటి వైస్‌–ఛాన్సలర్‌ టి వి కత్తిమణి
6. పద్మశ్రీ మిచెల్‌ డానినో
7. జమ్మూ ఐఐఎం చైర్‌పర్సన్‌ మిలింద్‌ కాంబ్లే
8. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పంజాబ్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జగ్బీర్‌ సింగ్‌
9. భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ గణిత శాస్త్రవేత్త మంజుల్‌ భార్గవ
10. ఎన్‌ఈపీ–2020 డ్రాఫ్ట్‌ కమిటీ సభ్యుడు ఎంకె శ్రీధర్‌
11. మాజీ ఐఏఎస్‌ అధికారి ధీర్‌ జింగ్రాన్‌
12. ఏక్‌ స్టెప్‌ ఫౌండేషన్‌ సీఈఓ శంకర్‌ మరువాడ
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఇస్రో మాజీ చీఫ్‌ కస్తూరి రంగన్‌ నేతృత్వంలో జాతీయ స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 21
ఎవరు    : కేంద్ర విద్యాశాఖ
ఎందుకు : జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధి కోసం...


World Cup Snooker Tournament: 6 రెడ్స్‌ స్నూకర్‌ టోర్నీలో విజేతగా నిలిచిన భారతీయుడు?

Pankaj Advani

6 రెడ్స్‌ వరల్డ్‌కప్‌ స్నూకర్‌ టోర్నీలో భారత స్టార్‌ స్నూకర్‌ పంకజ్‌ అద్వానీ విజేతగా నిలిచాడు. ఖతార్‌ రాజధాని దోహాలో సెప్టెంబర్‌ 21న ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో పంకజ్‌ 7–5 ఫ్రేమ్‌ల తేడాతో బాబర్‌ మసీ (పాకిస్తాన్‌) పై నెగ్గాడు. పంకజ్‌కు 12 వేల డాలర్ల (రూ. 8 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఇటీవల జరిగిన ఆసియా స్నూకర్‌ టోర్నీలోనూ పంకజ్‌ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.

హుసాముద్దీన్‌కు రజతం...
జాతీయ సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ (57 కేజీలు) రజతం సాధించాడు. సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హుసాముద్దీన్‌ ఫైనల్లో 0–5తో రోహిత్‌ మోర్‌ (ఢిల్లీ) చేతిలో ఓడిపోయాడు. దాంతో విజేతగా నిలిచిన రోహిత్‌ మోర్‌ సెర్బియా వేదికగా అక్టోబర్‌ 24 నుంచి నవంబర్‌ 6 వరకు జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తరఫున బరిలోకి దిగుతాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 6 రెడ్స్‌ వరల్డ్‌కప్‌ స్నూకర్‌ టోర్నీలో విజేతగా నిలిచిన భారతీయుడు? 
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 21
ఎవరు    : భారత స్టార్‌ స్నూకర్‌ పంకజ్‌ అద్వానీ
ఎక్కడ    : దోహా, ఖతార్‌
ఎందుకు  : ఫైనల్లో పంకజ్‌ 7–5 ఫ్రేమ్‌ల తేడాతో బాబర్‌ మసీ (పాకిస్తాన్‌) పై విజయం సాధించినందున...


Vanijya Utsav-2021: ఎగుమతిదారుల కోసం ఎక్స్‌పోర్ట్‌ ట్రేడ్‌ పోర్టల్‌ను రూపొందించిన రాష్ట్రం?Vanijya Utsav-2021

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా రెండు రోజుల ట్రేడ్‌ కార్నివాల్‌ ‘వాణిజ్య ఉత్సవ్‌–2021’ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 21న విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వాణిజ్య సదస్సును ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికను విడుదల చేయడంతో పాటు ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్‌పోర్ట్‌ ట్రేడ్‌ పోర్టల్, వైఎస్సార్‌ ఏపీ వన్‌ బిజినెస్‌ అడ్వైజరీ సర్వీసులను బటన్‌ నొక్కి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.

కేంద్ర వాణిజ్యశాఖతో కలిసి...
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర వాణిజ్యశాఖతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ వాణిజ్య ఉత్సవ్‌ను నిర్వహిస్తోంది. సెప్టెంబర్‌ 22వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాల దౌత్యాధికారులు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటున్నారు. వాణిజ్య ఉత్సవ్‌ అనంతరం నాలుగు రోజులపాటు జిల్లాల్లో కూడా వాణిజ్య సదస్సులు జరుగుతాయని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వాణిజ్య ఉత్సవ్‌–2021 ప్రారంభం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 21
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
ఎక్కడ    : విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను పెంచేందుకు...


Publicity Designer: రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న తొలి సాంకేతిక నిపుణులు?

Eswar

ప్రసిద్ధ పబ్లిసిటీ డిజైనర్, రచయిత కొసనా ఈశ్వరరావు (ఈశ్వర్‌) సెప్టెంబర్‌ 21న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈశ్వర్‌ వయసు 84 ఏళ్ళు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లుకి చెందిన ఈశ్వర్‌... బాపు దర్శకత్వంలోని ‘సాక్షి’ (1967) సినిమాతో పబ్లిసిటీ డిజైనర్‌గా శుభారంభం పలికారు. పబ్లిసిటీ డిజైనర్‌గా 40 ఏళ్ళు నిర్విరామంగా కృషి చేసిన ఆయన... తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2600కుపైగా చిత్రాలకు పనిచేశారు. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్‌ మీడియా రంగంలో వినియోగిస్తున్న తెలుగు అక్షరాలు (ఫాంట్‌) చాలా వరకు ఈశ్వర్‌ తన తమ్ముడు బ్రహ్మంతో కలసి రూపొందించినవే.

రఘుపతి వెంకయ్య పురస్కారం...
ఈశ్వర్‌ రాసిన ‘సినిమా పోస్టర్‌’కు నంది అవార్డు లభించింది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను 2015లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారంతో ఈశ్వర్‌ని సత్కరించింది. అప్పటికి సినిమా నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఎక్కువగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కానీ, సాంకేతిక నిపుణుల్లో ఛాయాగ్రాహకుడు యం.ఎ. రహమాన్‌ (1983) తొలిసారి ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారాన్ని అందుకోగా, పబ్లిసిటీ రంగం నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి సాంకేతిక నిపుణులు ఈశ్వరే.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రసిద్ధ పబ్లిసిటీ డిజైనర్, రచయిత కన్నుమూత
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 21
ఎవరు    : కొసనా ఈశ్వరరావు (ఈశ్వర్‌)(84)
ఎక్కడ    : చెన్నై, తమిళనాడు
ఎందుకు  : వయో భారం కారణంగా...


NCRB: దేశంలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్న రాష్ట్రం?

Child Marriages

దేశంలోనే కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 2020 ఏడాదిలో 185, 2019 ఏడాదిలో 111 బాల్య వివాహాలు కర్ణాటకలో నమోదయ్యాయి. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తెలిపిన సమాచారం ప్రకారం... కర్ణాటక బాల్య వివాహాల్లో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో అస్సాం –138 వివాహాలు, పశ్చిమ బెంగాల్‌– 98, తమిళనాడు –77 ఉన్నాయి.

‘ఈ–సంజీవని’లో ఏపీకి అగ్రస్థానం
జాతీయ టెలీ మెడిసిన్‌ సేవ ఈ–సంజీవనిలో 37,04,258 సంప్రదింపులతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర కుటుంబ,ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది. ఏపీ తరువాత కర్ణాటక (22,57,994), తమిళనాడు (15,62,156), ఉత్తరప్రదేశ్‌ (13,28,889), గుజరాత్‌ (4,60,326), మధ్యప్రదేశ్‌ (4,28,544), బిహార్‌ (4,04,345), మహారాష్ట్ర (3,78,912), పశ్చిమ బెంగాల్‌ (2,74,344), కేరళ (2,60,654) ఉన్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఈ–సంజీవని ప్రారంభించిన తరువాత దీన్ని అమలు పరిచిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశే.

15 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి
2021 ఖరీఫ్‌ సీజన్‌లో రికార్డు స్థాయిలో 15 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి కానున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇది గడిచిన ఐదేళ్ల సగటు కంటే 1.2 కోట్ల టన్నులు అధికం. ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రిగా నరేంద్ర తోమర్‌ ఉన్నారు.


India-France: ప్రస్తుతం ఫ్రాన్స్‌ దేశ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు?

Modi and Macron

జలాంతర్గాముల కొనుగోలు వివాద అంశంలో అమెరికా, ఆస్ట్రేలియాపై కోపంగా ఉన్న ఫ్రాన్స్‌ ఇకపై ఇండోపసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాజాగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ టెలిఫోన్‌ ద్వారా చర్చలు జరిపారు. భారత్‌కు ఎటువంటి సాయం అందించేందుకైనా తయారుగా ఉన్నట్లు మాక్రాన్‌ చెప్పారు.

వివాదం ఇదే..
ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేయాల్సిన  జలాంతర్గాముల ఆర్డర్‌ను ఆస్ట్రేలియా అర్థాంతరంగా రద్దు చేసింది. వీటికి బదులు అమెరికా నుంచి జలాంతర్గాములు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఆగ్రహించిన ఫ్రాన్స్‌ తన రాయబారులను యూఎస్, ఆస్ట్రేలియా నుంచి వెనక్కుపిలిపించింది. అలాగే ఫ్రాన్స్‌కు సంబంధం లేకుండా యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలు ఇండోపసిఫిక్‌ ప్రాంతంలో ఆకస్‌(అ్ఖఓ్ఖ )పేరిట కొత్త గ్రూపును ఏర్పరుచుకోవడం కూడా ఫ్రాన్స్‌ ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తమకు ఈ ప్రాంతంలో నమ్మకమైన మిత్రదేశం అవసరం ఉందని గ్రహించే భారత్‌ను ఫ్రాన్స్‌ సంప్రదించిందని నిపుణుల అభిప్రాయం.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్‌ ద్వారా చర్చలు
ఎప్పుడు : సెప్టెంబర్‌ 21
ఎవరు    : ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌
ఎందుకు : ఇండోపసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌–ఫ్రాన్స్‌ కలిసి పనిచేసే అంశంపై చర్చలు జరిపేందుకు...


UNGA 76th Session: ఐరాస జనరల్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టారు?

UN Flag

76వ సెషన్‌ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు సెప్టెంబర్‌ 21న ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ 27వ తేదీ వరకు జరిగే ఐరాస 76వ సెషన్స్‌కు అధ్యక్షుడిగా అబ్దుల్లా షాహిద్‌ ఉన్నారు. మాల్దీవులకు చెందిన అబ్దుల్లా షాహిద్‌ ఐరాస జనరల్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా సెప్టెంబర్‌ 14న బాధ్యతలు చేపట్టారు. ఐరాస తాజా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తొలిసారి ప్రసంగించారు. కరోనా వైరస్‌ కారణంగా గత ఏడాది(2020) సమావేశాలను వర్చువల్‌ విధానంలో నిర్వహించారు.

బ్రిటన్‌ నూతన టీకా పాలసీపై భారత్‌ మండిపాటు
బ్రిటన్‌ జారీ చేసిన నూతన రవాణా నిబంధనలపై భారత్‌ తీవ్రంగా ప్రతిస్పందించింది. కరోనా టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్‌ ఉన్నా సరే బ్రిటన్‌కు వచ్చే భారతీయులు క్వారంటైన్‌లో ఉండాలంటూ బ్రిటన్‌ కొత్త ప్రయాణ నిబంధనలు తెచ్చింది. అక్టోబర్‌ 4 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులను రెడ్‌లిస్టులో పెడతారు. అంటే భారత్‌లో వేస్తున్న టీకాలను బ్రిటన్‌ గుర్తించదని పేర్కొన్నట్లయింది. ఈ నిబంధనలు వివక్షపూరితమైనవంటూ కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్‌ శ్రింగ్లా మండిపడ్డారు.

 

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 21 కరెంట్‌ అఫైర్స్‌

 

Published date : 22 Sep 2021 07:04PM

Photo Stories