Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్ 21 కరెంట్ అఫైర్స్
Director of Public Policy: ఫేస్‌బుక్ ప్రజా విధానాల అధికారిగా నియమితులైన మాజీ ఐఏఎస్?
తమ యూజర్ల సేఫ్టీ, డాటా ప్రొటెక్షన్, ప్రైవసీ, ఇంటర్నెట్ విధానపర నిర్ణయాలను భారత్‌లో అమలుచేసే పబ్లిక్ పాలసీ విభాగం డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ అగర్వాల్‌ను నియమిస్తున్నట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ ఇండియా సెప్టెంబర్ 20న ప్రకటించింది. గత పబ్లిక్ పాలసీ మహిళా డైరెక్టర్ అంఖి దాస్ స్థానంలో అగర్వాల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఫేస్‌బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ పర్యవేక్షణలో రాజీవ్ పనిచేస్తారు.
ఐఏఎస్ అధికారిగా 26 ఏళ్లపాటు ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో పనిచేసిన రాజీవ్ గతంలో యూపీలో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలోనే తొలిసారిగా మేథో హక్కులకు సంబంధించిన నేషనల్ పాలసీలో విధానపర నిర్ణయాల రూపకల్పనలో కీలకంగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన పారిశ్రామిక ప్రోత్సహకాలు, అంతర్గత వాణిజ్య విభాగంలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పేస్‌బుక్ ప్రజా విధానాల అధికారిగా నియమితులైన మాజీ ఐఏఎస్?
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ అగర్వాల్
ఎక్కడ : భారత్
ఎందుకు : ఫేస్‌బుక్ యూజర్ల సేఫ్టీ, డాటా ప్రొటెక్షన్, ప్రైవసీ, ఇంటర్నెట్ విధానపర నిర్ణయాలను భారత్‌లో అమలుచేసేందుకు...
Guinness World Records: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కవలలుగా గుర్తింపు పొందిన దేశస్థులు?
జపాన్‌కు చెందిన 107 ఏళ్ల అక్కాచెల్లెళ్లు ప్రపంచంలోనే అత్యంత వృద్ధులైన కవలలుగా గిన్నిస్ రికార్డులకెక్కారు. ఉమెనొ సుమియామ, కౌమె కొడమ అనే ఈ తోబుట్టువుల వయస్సు 107 ఏళ్ల 330 రోజులని గిన్నిస్ సంస్థ సెప్టెంబర్ 20న తెలిపింది. వీరు ప్రపంచంలోనే జీవించి ఉన్న కవలల్లో అత్యంత వృద్ధులని పేర్కొంది. ఇప్పటి వరకు జపాన్‌కే చెందిన కిన్ నరిటా, జిన్ కానీ అనే కవలల పేరిట ఉన్న 107 ఏళ్ల 75 రోజుల రికార్డును ఈ సోదరీమణులు బద్దలు కొట్టారు. జపాన్‌లోని షొడొషిమా దీవిలో 1913 నవంబర్ 5వ తేదీన వీరు జన్మించారు.
ఉమెనొ, కౌమె ఘనతను ప్రశంసిస్తూ గిన్నిస్ సంస్థ కొత్త రికార్డు సర్టిఫికెట్లను సెప్టెంబర్ 20న ‘రెస్పెక్ట్ ఫర్ ది ఏజ్‌డ్ డే’సందర్భంగా మెయిల్ ద్వారా పంపించింది. ‘రెస్పెక్ట్ ఫర్ ది ఏజ్‌డ్ డే’ జపాన్‌లో జాతీయ సెలవుదినం. జపాన్ 12.5 కోట్ల జనాభాలో 29 శాతం మంది 65 ఏళ్లు, ఆపైని వారే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత వృద్ధులైన కవలలుగా గిన్నిస్ రికార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : జపాన్‌కు చెందిన 107 ఏళ్ల అక్కాచెల్లెళ్లు ఉమెనొ సుమియామ, కౌమె కొడమ
ఎక్కడ : ప్రపంచంలోనే...
WIPO: అంతర్జాతీయ నవకల్పనల సూచీలో భారత్ ర్యాంకు?
ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (World Intellectual Property Organization-WIPO) తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ నవకల్పనల (ఇన్నోవేషన్) సూచీ–2021లో భారత్‌కు 46వ ర్యాంకు లభించింది. 2020తో పోలిస్తే 2 స్థానాలు మెరుగుపర్చుకుంది. గత కొన్నేళ్లుగా భారత్ ర్యాంకు మెరుగుపడుతోందని.. 2015లో 81వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 46వ స్థానానికి చేరిందని డబ్ల్యూఐపీవో తెలిపింది. అపారమైన విజ్ఞాన సంపత్తి, క్రియాశీలకమైన స్టార్టప్ వ్యవస్థ, ప్రభుత్వ.. ప్రైవేట్ పరిశోధన సంస్థల కృషి ఇందుకు దోహదపడ్డాయని వివరించింది. జాతీయ ఆవిష్కరణల వ్యవస్థను సుసంపన్నం చేయడంలో ఆటమిక్ ఎనర్జీ విభాగం, శాస్త్ర..సాంకేతిక విభాగం, బయోటెక్నాలజీ విభాగం, అంతరిక్ష విభాగం మొదలైన సైంటిఫిక్ డిపార్ట్‌మెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ నవకల్పనల (ఇన్నోవేషన్) సూచీ–2021లో భారత్‌కు 46వ ర్యాంకు
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీవో)
ఎందుకు : భారత్‌లో అపారమైన విజ్ఞాన సంపత్తి, క్రియాశీలకమైన స్టార్టప్ వ్యవస్థ, ప్రభుత్వ.. ప్రైవేట్ పరిశోధన సంస్థల కృషి కారణంగా...
One Time Settlement: ఏ పథకానికి జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా నామకరణం చేశారు?
గృహ రుణాల నుంచి పేదలను విముక్తుల్ని చేసేందుకు ఉద్దేశించిన వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకం, పేదల ఇళ్ల నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 20న తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా అమలు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. పేదల ఇళ్లకు సంబంధించి జగనన్న కాలనీల్లో... కాలనీ యూనిట్‌గా తీసుకుని మౌలిక సదుపాయాల పనులను అప్పగించాలని చెప్పారు.
పథకం పేరు.. ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి వర్తింపచేసే వన్‌టైం సెటిల్‌మెంట్‌కు ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’ పథకంగా పేరు ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్‌మెంట్ పథకం డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు. పథకం అర్హుల వివరాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకానికి ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’ పథకంగా నామకరణం
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : గృహ రుణాల నుంచి పేదలను విముక్తుల్ని చేసేందుకు...
Dancing with Dreams: రాష్ట్ర సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ రచించిన కవితా సంకలనం పేరు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రచించిన ‘‘డాన్సింగ్ విత్ డ్రీమ్స్’’ కవితా సంకలనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 18న ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పుస్తక ప్రచురణకర్త రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడు?
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడి కుమారుడు ఎనిమిదేళ్ల గంధం భువన్... యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన ప్రముఖ శిఖరం ఎల్బ్రస్(5,642 మీటర్లు)ను సెప్టెంబర్ 18న అధిరోహించాడు. రష్యాలోని ఎల్బ్రస్‌ను అతి పిన్న వయసులోనే అధిరోహించిన తొలి భారతీయ బాలుడిగా భువన్ రికార్డు సృష్టించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రచించిన ‘‘డాన్సింగ్ విత్ డ్రీమ్స్’’ కవితా సంకలనం ఆవిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : తాడేపల్లి, గుంటూరు జిల్లా
NMDC: కొల్లాటరల్ అవార్డును కైవసం చేసుకున్న ప్రభుత్వం సంస్థ?
అఖిల భారత కార్పొరేట్ కొల్లాటరల్ అవార్డు–2021ను జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) కైవసం చేసుకుంది. కమ్యూనికేషన్స్ రంగంలో చేసిన విశేషకృషిగాను ఈ అవార్డు దక్కింది. పబ్లిక్ రిలేషన్స్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా (పీఆర్‌సీఐ) గోవాలోని వెల్హా గోవాలో నిర్వహించిన గ్లోబల్ కమ్యూనికేషన్ కాన్‌క్లేవ్‌లో ఈ అవార్డును గోవా సాంస్కృతిక శాఖమంత్రి గోవింద్‌గౌడ్ చేతుల మీదుగా ఎన్‌ఎండీసీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగాధిపతి జయప్రకాశ్ సెప్టెంబర్ 20న అందుకున్నారు. మొత్తంగా ఎన్‌ఎండీసీకి 13 విభాగాల్లో అవార్డులు దక్కాయి.
ఏయూ విద్యార్థికి ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ పురస్కారం
ఆంధ్ర విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం విద్యార్థి ధనియాల సాయి జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) జాతీయ ఉత్తమ వలంటీర్‌గా ఎంపికయ్యాడు. 2019–20 సంవత్సరానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డుకు సాయి ఒక్కరే ఎంపికయ్యాడు. దేశవ్యాప్తంగా 30 మందికి అవార్డులు ప్రకటించగా.. సాయి ద్వితీయ స్థానంలో నిలిచాడు. సెప్టెంబర్ 24న జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సాయి ఈ అవార్డును అందుకోనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అఖిల భారత కార్పొరేట్ కొల్లాటరల్ అవార్డు–2021ను కైవసం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)
ఎక్కడ : వెల్హా గోవా, నార్త్ గోవా జిల్లా, గోవా రాష్ట్రం
ఎందుకు : కమ్యూనికేషన్స్ రంగంలో చేసిన విశేషకృషిగాను...
Inspiration-4: ఏ పేరుతో స్పేస్‌ఎక్స్ సంస్థ మూడు రోజుల అంతరిక్ష యాత్రను చేపట్టింది?
ఇన్‌స్పిరేషన్–4 పేరుతో స్పేస్‌ఎక్స్ సంస్థ చేపట్టిన మూడు రోజుల అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. అపర కుబేరుడు జేర్డ్ ఐసాక్‌మ్యాన్ నేతృత్వంలో నలుగురు పర్యాటకులతో అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక సురక్షితంగా భూమికి చేరింది. అమెరికాలోని ఫ్లోరిడా తీరం(అట్లాంటిక్ మహా సముద్రం)లో సెప్టెంబర్ 18న స్పేస్‌ఎక్స్ క్యాప్సుల్ సురక్షితంగా ల్యాండ్ అయింది. వ్యోమగాములు లేకుండా, ఎలాంటి అంతరిక్ష యాత్రల అనుభవంలేని సాధారణ పౌరులతో అంతరిక్ష యాత్ర చేపట్టడం ఇదే తొలిసారి. ఈ యాత్ర విజయవంతం కావడంతో భవిష్యత్‌లో మరిన్ని పర్యాటక రోదసి యాత్రలకు బాటలు వేసినట్టయింది.
కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి...
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మెరిట్ ద్వీపంలో ఉన్న కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సెప్టెంబర్ 15న ఫాల్కన్–9 రాకెట్ ద్వారా క్రూ డ్రాగన్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 585 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ చక్కర్లు కొట్టింది. క్రూ డ్రాగన్ క్యాప్సుల్‌కి అతిపెద్ద బబుల్ ఆకారంలో ఉన్న కిటికీని అమర్చారు. ఈ గాజు కిటికీ ద్వారా అందులో ప్రయాణించిన నలుగురు ప్రయాణికులు అంతరిక్షాన్ని తనివితీరా చూశారు. ఈ రాకెట్ గమనాన్ని ఆటోపైలట్‌మోడ్‌లో భూమి మీద నుంచే నియంత్రించారు.
నలుగురు యాత్రికులు వీరే...
జేర్డ్ ఐసాక్‌మ్యాన్(38): ఫిష్ట్4 పేమెంట్స్ అనే చెల్లింపుల ప్రాసెసింగ్ కంపెనీని ఆయన నిర్వహిస్తున్నారు. ఈ యాత్రకు కమాండర్‌గా వ్యవహరించిన ఆయన పైలట్‌గానూ శిక్షణ పొందారు. అమెరికా కుబేరుడు అయిన ఈయన ఈ యాత్ర పూర్తి వ్యయ ప్రయాసల బాధ్యతలను తన భుజాలకెత్తుకున్నారు. అయితే ఈ యాత్ర కోసం స్పేస్‌ఎక్స్‌కు ఎంత చెల్లించారో వెల్లడించలేదు. నేరుగా అంతరిక్ష ప్రయాణం చేసిన మూడో బిలియనీర్‌గా చరిత్రలకెక్కారు. 2021, జులైలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్, బ్లూ ఆరిజిన్ అధిపతి జెఫ్ బెజోస్‌లు రోదసియాత్రలు చేసిన విషయం తెలిసిందే.
హేలి అర్సెనాక్స్(29): ఎముక క్యాన్సర్ బారినపడి కోలుకున్న ఈమె... తాను చికిత్సపొందిన టెన్నెస్సీలోని సెయింట్ జూడ్ ఆస్పత్రిలోనే హెల్త్‌కేర్ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రయాణికుల్లో ఒకరైన ఐసాక్‌మ్యాన్ ఈ ఆస్పత్రికి 10 కోట్ల డాలర్ల విరాళం ఇచ్చారు. నింగిలోకి దూసుకెళ్లిన అత్యంత పిన్న అమెరికన్‌గా, కృత్రిమ అవయవంతో అంతరిక్ష యాత్ర చేసిన తొలి వ్యక్తిగా హేలి గుర్తింపు పొందారు.
క్రిస్ సెంబ్రోస్కీ(42): ఏరోస్పేస్ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్‌లో డేటా ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతంలో అమెరికా వైమానిక దళంలో పనిచేశారు. ఈయన కూడా సెయింట్ జూడ్ ఆసుపత్రికి విరాళమిచ్చారు.
సియాన్ ఫ్రాక్టర్ (51): ఆరిజోనాలోని కాలేజీలో జియాలజీ ప్రొఫెసర్ అయిన ఆఫ్రికన్ అమెరికన్ మహిళ సియాన్ ప్రోక్టర్... జియో సైంటిస్ట్, ఆర్టిస్ట్, సైన్స్ రచయిత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్రలో ఆమె పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. తద్వారా వ్యోమనౌకకు పైలట్‌గా వ్యవహరించిన తొలి నల్లజాతీయురాలిగా గుర్తింపు పొందారు.
వచ్చే ఏడాది తొలినాళ్లలో మరో ట్రిప్...
ముగ్గురు అత్యంత ధనవంతులైన ప్రయాణికులు, ఒక మాజీ నాసా వ్యోమగామితో వారంపాటు కొనసాగే మరో అంతరిక్ష పర్యాటక యాత్ర 2022 ఏడాది తొలినాళ్లలో ఉంటుందని స్పేస్‌ఎక్స్ వెల్లడించింది. రష్యాకు చెందిన నటి, దర్శకుడు, జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం ఈ యాత్రలో పాలుపంచుకుంటారని పేర్కొంది.
Drone Warfare Programme: స్వదేశీ పరిజ్ఞానంతో సూడో శాటిలైట్‌ను రూపొందించనున్న సంస్థ?
పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ (హెచ్‌ఏపీఎస్)ను రూపొందించేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) సిద్ధమవుతోంది. కంబైండ్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ (సీఏటీఎస్) పేరిట అన్‌మ్యాన్డ్ డ్రోన్ వార్‌ఫేర్ కార్యక్రమంలో భాగంగా రూపొందించే ఈ ఉపగ్రహం కోసం రూ.700కోట్లు వ్యయం చేయనున్నారు. భారత ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయనున్నట్లు సెప్టెంబర్ 20న హెచ్‌ఏఎల్ ప్రకటించింది. పూర్తిస్థాయి హెచ్‌ఏపీఎస్ పూర్తయ్యేందుకు కనీసం నాలుగేళ్లు పట్టనుందని వెల్లడించింది.
హెచ్‌ఏపీఎస్ విశేషాలు...
- 500 కిలోల కంటే ఎక్కువ బరువుండే ఈ హెచ్‌ఏపీఎస్ సౌర విద్యుత్తుతో పని చేస్తుంది.
- దాదాపు 70వేల అడుగుల ఎత్తు ఎగరగలిగే ఈ ఉపగ్రహం నెలల తరబడి సేవలందిస్తుంది.
- టెలీకమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ ప్రత్యేకతలతో రూపొందనున్న ఈ ఉపగ్రహం రక్షణ, పౌర సేవలకు ఉపయోగపడనుంది.
- మానవ రహిత విమానాలు(యూఏవీ), సంప్రదాయ ఉపగ్రహాలకు ప్రత్యామ్నాయంగా తయారవుతున్న హెచ్‌ఏపీఎస్ కమ్యూనికేషన్, సర్వేలెన్స్, లైవ్ వీడియోలతో పాటు స్పష్టమైన చిత్రాలను తీయగలగుతుంది.
- ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా సమర్థమైన రక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కంబైండ్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ (సీఏటీఎస్) పేరుతో హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ (హెచ్‌ఏపీఎస్) రూపకల్పన
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)
ఎందుకు : అన్‌మ్యాన్డ్ డ్రోన్ వార్‌ఫేర్ కార్యక్రమంలో భాగంగా...
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్ 20 కరెంట్ అఫైర్స్