Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్ 20 కరెంట్ అఫైర్స్
Ravindra Narayana Ravi: తమిళనాడు గవర్నర్‌గా ప్రమాణం చేసిన మాజీ ఐపీఎస్?
తమిళనాడు రాష్ట్ర 26వ గవర్నర్‌గా మాజీ ఐపీఎస్ రవీంద్ర నారాయణ్ రవి(ఆర్‌ఎన్ రవి) ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో సెప్టెంబర్ 18న జరిగిన కార్యక్రమంలో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజిబ్ బెనర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం ఎంకే స్టాలిన్, ప్రతిపక్ష నేత కె. పళనిస్వామి హాజరయ్యారు. మాజీ ఐపీఎస్ అయిన ఆర్‌ఎన్ రవి 2014 ఆగస్టు 29న నాగా శాంతి చర్చల్లో కేంద్ర తరఫున నియమితులయ్యారు. 2019 ఆగస్టు 1 నుంచి 2021 సెప్టెంబర్ 15 వరకు నాగాలాండ్ గవర్నర్‌గా పని చేశారు. ఇప్పటి వరకూ తమిళనాడు గవర్నర్‌గా పని చేసిన భన్వరిలాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్‌గా బదిలీ అయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తమిళనాడు రాష్ట్ర 26వ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : మాజీ ఐపీఎస్ రవీంద్ర నారాయణ్ రవి(ఆర్‌ఎన్ రవి)
ఎక్కడ : రాజ్‌భవన్, చెన్నై
ఎందుకు : ఇప్పటి వరకూ తమిళనాడు గవర్నర్‌గా పని చేసిన భన్వరిలాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో...
Grandmaster: రాష్ట్రం నుంచి జీఎం హోదా పొందిన మూడో ప్లేయర్?
ప్రతి చెస్ క్రీడాకారుడు గొప్ప ఘనతగా భావించే గ్రాండ్‌మాస్టర్ (జీఎం) టైటిల్ హోదాను తెలంగాణ కుర్రాడు రాజవరం రాజా రిత్విక్ సెప్టెంబర్ 18న అందుకున్నాడు. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో సెప్టెంబర్ 15న మొదలైన వెజెర్‌కెప్జో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) చెస్ టోర్నమెంట్‌లో 17 ఏళ్ల రిత్విక్ జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్ పాయింట్ల మైలురాయిని దాటాడు. ఫలితంగా భారత్ తరఫున 70వ గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. వరంగల్ జిల్లాకు చెందిన రిత్విక్... ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని భవాన్స్ శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్నాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు జాతీయస్థాయిలో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు... అంతర్జాతీయస్థాయిలో 10 స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించాడు.
మూడో ప్లేయర్...
- తెలంగాణ నుంచి గ్రాండ్‌మాస్టర్ అయిన మూడో ప్లేయర్ రిత్విక్. గతంలో హర్ష భరతకోటి, ఎరిగైసి అర్జున్ ఈ ఘనత సాధించారు.
- తెలుగు రాష్ట్రాల నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన ఎనిమిదో ప్లేయర్ రిత్విక్. గతంలో పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, హారిక, లలిత్‌బాబు, కార్తీక్ వెంకటరామన్ (ఆంధ్రప్రదేశ్) ఈ ఘనత సాధించారు.
అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ముగింపు
హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు సెప్టెంబర్ 19న ముగిశాయి. ఈ పోటీల్లో 13 స్వర్ణాలు, 10 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి మొత్తం 36 పతకాలు నెగ్గిన రైల్వేస్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్రం నుంచి జీఎం హోదా పొందిన మూడో ప్లేయర్?
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : రాజవరం రాజా రిత్విక్
ఎక్కడ : బుడాపెస్ట్, హంగేరి
ఎందుకు : వెజెర్‌కెప్జో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) చెస్ టోర్నమెంట్‌లో రిత్విక్ జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్ పాయింట్ల మైలురాయిని దాటడంతో...
Capt Amarinder Singh: పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేసిన మాజీ సైన్యాధికారి?
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్(79) రాజీనామా చేశారు. సెప్టెంబర్ 18న తన రాజీనామా లేఖను పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు అందజేశారు. 50కిపైగా కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు సీఎంగా అమరీందర్‌ను మార్చాలంటూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన నేపథ్యంలో... ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పాటియాలా రాజవంశానికి చెందిన అమరీందర్... 1942, మార్చి 11న జన్మించారు. వారిది సైనిక కుటుంబం. తొలుత సైన్యంలో అమరీందర్... 1965, 1971 యుద్ధాల్లో ఆయన పాల్గొన్నారు.
1980లో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్‌సభ ఎంపీగా గెలిచిన అమరీందర్... 1985లో అకాళీదళ్‌లో చేరి ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యారు. 1998లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. 2002, ఫిబ్రవరి 26న తొలిసారిగా పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 2017, మార్చి 16న రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : కెప్టెన్ అమరీందర్ సింగ్(79)
ఎందుకు : అసమ్మతి కారణంగా...
Charanjit Singh Channi: పంజాబ్ సీఎంగా ప్రమాణం చేసిన తొలి దళితుడు?
పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 20న చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో చన్నీతో రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణం చేయించారు. దీంతో పంజాబ్ సీఎంగా ప్రమాణం చేసిన తొలి దళిత నేతగా 49 ఏళ్ల చన్నీ గుర్తింపు పొందారు. చన్నీ తర్వాత కాంగ్రెస్ నేతలు సుఖిందర్ ఎస్ రంధ్వానా, ఓపీ సోని ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో... చన్నీ సీఎంగా ఎంపికయ్యారు. పంజాబ్‌లో మరో ఐదు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి.
ఎవరీ చన్నీ?
దళిత సిక్కు నాయకుడు చన్నీ 1972 ఏప్రిల్ 2న పంజాబ్‌లోని మక్రోనా కలాన్ గ్రామంలో జన్మించారు. దళితుల్లో రామదాసియా సిక్కు (చర్మకారులు) వర్గానికి చెందిన ఆయన పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. జలంధర్‌లోని పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీలో ఎంబీఏ, చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. హ్యాండ్‌బాల్ క్రీడలో ప్రావీణ్యం కలిగిన చన్నీ... ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ మీట్‌లో బంగారు పతకం సాధించాడు.
మున్సిపల్ కౌన్సిలర్ నుంచి...
చన్నీ తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా 2007లో చామ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం(రూప్‌నగర్ జిల్లా) నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012, 2017లోనూ అదే స్థానం నుంచి వరుసగా గెలిచారు. అంతకంటే ముందు మూడు పర్యాయాలు ఖరారా మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలిచారు. రెండుసార్లు కౌన్సిల్ అధ్యక్షుడిగా పని చేశారు. 2015–16లో పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2017 మార్చిలో అమరీందర్ ప్రభుత్వంలో సాంకేతిక విద్య, పారిశ్రామిక శిక్షణ, ఉద్యోగ కల్పన, పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పంజాబ్ సీఎంగా ప్రమాణం చేసిన తొలి దళితుడు?
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : చరణ్‌జిత్ సింగ్ చన్నీ
ఎక్కడ : రాజ్‌భవన్, చండీగఢ్
ఎందుకు : సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో...
Manny Pacquiao: దేశ అధ్యక్ష బరిలో ఉంటానని ప్రకటించిన బాక్సర్?
ఫిలిప్పీన్స్ అధ్యక్ష పదవికి 2022 ఏడాదిలో జరిగే ఎన్నికల్లో బరిలో ఉంటానని ఆ దేశ బాక్సింగ్ దిగ్గజం, సెనేటర్ మానీ పకియావ్(42) ప్రకటించారు. సెప్టెంబర్ 19న జరిగిన పీడీపీ–లబన్ పార్టీ సమావేశంలో పకియావ్ పేరును ఒక వర్గం నేతలు ప్రతిపాదించగా ఆయన అందుకు సమ్మతించారు. ప్రభుత్వ మార్పు కోసం వేచి చూస్తున్న ఫిలిపినో ప్రజలకు నిజాయితీతో సేవలందిస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అధికార పీడీపీ–లబన్‌లోని ఒక వర్గానికి పకియావ్, సెనేటర్ అక్విలినో నాయకత్వం వహిస్తున్నారు. పార్టీలోని మరో వర్గం, ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు డుటెర్టెని ఉపాధ్యక్షుడిగా, సెనేటర్ బాంగ్ గోను అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేసింది. బాక్సింగ్‌లోని ఎనిమిది వేర్వేరు విభాగాల్లో ప్రపంచ టైటిళ్లను గెలుచుకున్న ఏకైక బాక్సర్‌గా పకియావ్ చరిత్ర సృష్టించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిలిప్పీన్స్ అధ్యక్ష బరిలో ఉంటానని ప్రకటించిన బాక్సర్?
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : మానీ పకియావ్(42)
ఎక్కడ : ఫిలిప్పీన్స్
ఎందుకు : ఫిలిపినో ప్రజలకు సేవలందించేందుకు...
Ramky Enviro: పీఆర్‌సీఐ చాణక్య అవార్డు అందుకున్న పర్యావరణ సేవల సంస్థ?
సమగ్ర పర్యావరణ నిర్వహణ సేవల సంస్థ రామ్‌కీ ఎన్విరో తాజాగా ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. 2021 సంవత్సరానికి గాను జాతీయ, అంతర్జాతీయ ఎచీవర్స్‌కు సంబంధించి పీఆర్‌సీఐ చాణక్య ’బెస్ట్ హెచ్‌ఆర్ ఇనీషియేటివ్ ఆఫ్ ద ఇయర్ – ఎన్విరాన్‌మెంటల్లీ సస్టెయినబుల్ సీఎస్‌ఆర్’ పురస్కారాన్ని అందుకుంది. పర్యావరణపరమైన సమస్యల పరిష్కారానికి చేసిన కృషికిగాను ఈ అవార్డు దక్కింది. సెప్టెంబర్ 18న గోవా రాష్ట్రం, నార్త్ గోవా జిల్లా, వెల్హా గోవా పట్టణంలో నిర్వహించిన పీఆర్‌సీఐ 15వ గ్లోబల్ కమ్యూనికేషన్స్ సదస్సులో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చేతుల మీదుగా రామ్‌కీ ఎన్విరో ఇంజినీరింగ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సుజీవ్ నాయర్ దీన్ని అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఆర్‌సీఐ చాణక్య ’బెస్ట్ హెచ్‌ఆర్ ఇనీషియేటివ్ ఆఫ్ ద ఇయరా – ఎన్విరాన్‌మెంటల్లీ సస్టెయినబుల్ సీఎస్‌ఆర్–2021’ అవార్డు విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : సమగ్ర పర్యావరణ నిర్వహణ సేవల సంస్థ రామ్‌కీ ఎన్విరో
ఎక్కడ : వెల్హా గోవా, నార్త్ గోవా జిల్లా, గోవా రాష్ట్రం
ఎందుకు : పర్యావరణపరమైన సమస్యల పరిష్కారానికి చేసిన కృషికిగాను...
Kitex group: రాష్ట్రంలో దుస్తుల తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్న సంస్థ?
చిన్నపిల్లల దుస్తుల తయారీ రంగంలో అమెరికాకు ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న కైటెక్స్ సంస్థ సమీకృత దుస్తుల తయారీ క్లస్టర్ల ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కైటెక్స్ ఎండీ సాబు జాకబ్, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. రూ. 2,400 కోట్లతో వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుతోపాటు రంగారెడ్డి జిల్లా చందనవెల్లి ప్రాంతంలో రెండు దుస్తుల తయారీ క్లస్టర్లను కైటెక్స్ ఏర్పాటు చేయనుంది. ఈ క్లస్టర్ల ద్వారా 22 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. ఎంవోయూ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డితో కలసి కేటీఆర్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : కైటెక్స్ సంస్థ
ఎక్కడ : కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు(వరంగల్), చందనవెల్లి(రంగారెడ్డి జిల్లా)
ఎందుకు : రెండు దుస్తుల తయారీ క్లస్టర్లను ఏర్పాటు కోసం...
Om Namo: సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికైన రచయిత?
కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావును కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వరించింది. కన్నడ రచయిత శాంతినాథ దేశాయి రచించిన ‘ఓం ణమో’ పుస్తకాన్ని రంగనాథ 2018లో తెలుగులోకి అనువదించారు. ఈ రచనే పురస్కారానికి ఎంపికైంది. 2020 సంవత్సరానికి గాను అకాడమీ 24 భాషల నుంచి ఎంపిక చేసిన అనువాద రచనలకు 2021, సెప్టెంబర్ 18న అనువాద పురస్కారాలను ప్రకటించింది.
డాక్టర్ చంద్రశేఖర్ కంబర నేతృత్వంలో
సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ కంబర నేతృత్వంలోని అకాడమీ కార్యనిర్వాహక మండలి సెప్టెంబర్ 18న న్యూడిల్లీలో సమావేశమై ఈ పురస్కారాల ఎంపికను ఆమోదించింది. ప్రతి భాషలో ముగ్గురి సభ్యులతో కూడిన ఎంపిక కమిటీ ఈ పురస్కారాలను సిఫారసు చేసింది. 2014 నుంచి 2018 మధ్య ప్రచురితమైన పుస్తకాలను ఎంపికకు ప్రాతిపదికగా తీసుకుంది. ఈ పురస్కారం కింద రూ.50 వేల నగదు, తామ్రపత్రం ప్రదానం చేస్తారు.
బాలల కోసం ఎన్నో రచనలు
తెలుగు, కన్నడ సాహిత్యాలకు వారధిగా ఉన్న రంగనాథ... 1953 ఏప్రిల్ 28న ఆదోనిలో జన్మించారు. బీఎస్సీ, ఎంఏ (ఆంగ్లం), బీఈడీ చదివిన ఆయన... ఆదోని నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి 2011లో రిటైరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రంగనాథ రామచంద్రరావు బాలల కోసం ఎన్నో రచనలు చేశారు. కొన్నింటిని పుస్తకాలుగా ప్రచురించారు.
అనేక కలం పేర్లతో రచనలు
రంగనాథ రామచంద్రరావు అనేక కలం పేర్లతో రచనలు చేశారు. సూర్యనేత్ర, స్పప్నమిత్ర, రంగనాథ, మనస్విని, నిగమ, స్వరూపాదేవి తదితర కలం పేర్లతో ఇప్పటివరకు 300కు పైగా వివిధ ప్రక్రియల్లో రచనలు, 250కు పైగా అనువాద కథలు, 140కి పైగా బాలల కథలు, 70కి పైగా సొంత కథలు అందించారు.
రంగనాథ రచనల్లో కొన్ని...
- అనువాద రచనలు: తిరుగుబాటు, వడ్డారాధన, రాళ్లు కరిగే వేళ, పూర్ణచంద్ర తేజశ్వి, అంతఃపురం, అవధశ్వరి, వాగు వచ్చింది, మరిగే ఎసరు
- కథా సంపుటాలు: దింపుడు కల్లం, నేనున్నాగా, మళ్లీ సూర్యోదయం, గొప్ప త్యాగం, ఎత్తుకు పైఎత్తు
- ఆత్మ కథలు: ఓ సంచారి అంతరంగం, అక్రమ సంతానం, మౌనంలో మాటలు, జోగిని మంజమ్మ, బుర్రకథ ఈరమ్మ
- అనువాద నవలలు: తేనె జాబిలి, ఘాచర్ త్యాగరత్న, ఓ రైతు కథ, భారతీపురం, తారాబాయి లేఖ, యానిమల్ ఫామ్, రాయల్ ఎన్‌ఫీల్డ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020 ఏడాదికిగాను సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికైన రచయిత?
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : రంగనాథ రామచంద్రరావు
ఎందుకు : కన్నడ రచయిత శాంతినాథ దేశాయి రచించిన ‘ఓం ణమో’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించినందుకు...
Agni Swasa: సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న తెలుగు సాహితీవేత్త?
ప్రముఖ తెలుగు సాహితీవేత్త, విప్లవకవి నిఖిలేశ్వర్(కుంభం యాదవరెడ్డి) 2020 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆయన తెలుగులో రచించిన అగ్నిశ్వాస కవితా సంపుటి (2015–2017)కి ఈ పురస్కారం లభించింది. సెప్టెంబర్ 18న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో నిఖిలేశ్వర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దేశవ్యాప్తంగా వివి«ధ భాషల్లోని 22 మంది రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రదానం చేసింది. ఈ అవార్డు పొందినవారికి లక్ష రూపాయల ప్రైజ్ మనీతోపాటు జ్ఞాపికను అందించారు. ప్రముఖ హిందీ రచయిత విశ్వనాథ్ ప్రసాద్ తివారీ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, సాహిత్య అకాడెమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు.
బాహుబలి అహింస దిగ్విజయం
కన్నడభాషలో కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ రచించిన ‘శ్రీ బాహుబలి అహింస దిగ్విజయం’పుస్తకానికిగాను ఆయన సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ‘వెన్ గాడ్ ఈజ్ ఏ ట్రావెలర్’అనే ఆంగ్ల రచనకుగాను ప్రముఖ రచయిత్రి అరుంధతి సుబ్రమణ్యం అకాడమీ అవార్డు అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సాహిత్య అకాడమీ అవార్డు–2020 అందుకున్న తెలుగు సాహితీవేత్త?
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : ప్రముఖ తెలుగు సాహితీవేత్త, విప్లవకవి నిఖిలేశ్వర్(కుంభం యాదవరెడ్డి)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : అగ్నిశ్వాస కవితా సంపుటిని రచించినందుకు...
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్ 18 కరెంట్ అఫైర్స్