Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 18 కరెంట్‌ అఫైర్స్‌

Modi

Bharatiya Janata Party: సేవా ఔర్‌ సమర్పణ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజకీయ పార్టీ?

కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌లో భారత్‌ కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 17న దేశవ్యాప్తంగా 2 కోట్లకుపైగా టీకా డోసులు ప్రజలకు వేశారు. కో–విన్‌ పోర్టల్‌ గణాంకాల ప్రకారం... దేశంలో సెప్టెంబర్‌ 17న ఒక్కరోజే 2.26 కోట్లకుపైగా డోసులు ఇచ్చారు. ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం కరోనా వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 79.25 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

సేవా ఔర్‌ సమర్పణ్‌..
ప్రధాని మోదీ జన్మదినంతోపాటు ఆయన గుజరాత్‌ సీఎంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని... భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ‘సేవా ఔర్‌ సమర్పణ్‌ అభియాన్‌’కి సెప్టెంబర్‌ 17న న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో శ్రీకారం చుట్టారు. అక్టోబర్‌ 7 వరకు 20 రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా... దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడతారు.

1950 సెప్టెంబర్‌ 17న జననం...
గుజరాత్‌ రాష్ట్రం మెహసానా జిల్లా వద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్‌ 17న జన్మించిన నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ తొలుత రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)లో చేరారు. అనంతరం బీజేపీలో చేరి 2001, అక్టోబర్‌ 7న గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడుసార్లు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2014, మే 26 తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సేవా ఔర్‌ సమర్పణ్‌ అభియాన్‌ ప్రారంభం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 17
ఎవరు    : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా
ఎక్కడ    : బీజేపీ కార్యాలయం, న్యూఢిల్లీ
ఎందుకు : ప్రధాని మోదీ జన్మదినంతోపాటు ఆయన గుజరాత్‌ సీఎంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని... దేశ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు...


GST Council Meeting: ఆహార డెలివరీ యాప్‌ల సరఫరాలపై ఎంత శాతం జీఎస్‌టీ విధించనున్నారు?

Swiggy and Zomato

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోలో సెప్టెంబర్‌ 17న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో... వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అత్యున్నత స్థాయి విధాన నిర్ణయ మండలి (జీఎస్‌టీ కౌన్సిల్‌) 45వ సమావేశం జరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. భేటీ అనంతరం మంత్రి నిర్మల తెలిపిన వివరాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

  • జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5 శాతం జీఎస్‌టీ పన్ను విధింపు. 
  • కేన్సర్‌ సంబంధిత ఔషధాలపై రేటు 12 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు. 
  • బలవర్థకమైన బియ్యం విషయంలో  18 శాతం నుండి 5 శాతానికి జీఎస్‌టీ రేటు కోత.
  • బయో–డీజిల్‌ బ్లెండింగ్‌కు సంబంధించి రేటు 12 శాతం నుంచి 5 శాతానికి కుదింపు. 
  • వస్తు రవాణా విషయంలో రాష్ట్రాలు విధించే నేషనల్‌ పర్మిట్‌ ఫీజు జీఎస్‌టీ నుంచి మినహాయింపు 
  • లీజ్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ దిగుమతి ఐ–జీఎస్‌టీ చెల్లింపు మినహాయింపు. 
  • అన్ని రకాల పెన్నులపై 18 శాతం జీఎస్‌టీ విధింపు   
  • పునరుత్పాదక రంగ పరికరాలకు 12 శాతం పన్ను విధింపు. 
  • కొన్ని కోవిడ్‌–19 ఔషధాలపై రాయితీ పన్ను రేట్లను మూడు నెలలు అంటే డిసెంబర్‌ 31 వరకూ పొడిగింపు. 
  • ఖరీదైన జోల్జెన్సా్మ, విల్టెప్సో వంటి కండరాల క్షీణత ఔషధాలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు.
  • పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చే అంశంపై ఇప్పుడేమీ చర్చించేది లేదు. కేంద్రం, రాష్ట్రాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న అభిప్రాయమే ఇందుకు కారణం.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌ల సరఫరాలపై 5 శాతం జీఎస్‌టీ పన్ను విధించాలని నిర్ణయం
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 17
ఎవరు    : వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అత్యున్నత స్థాయి విధాన నిర్ణయ మండలి
ఎక్కడ    : జీఎస్‌టీ కౌన్సిల్‌ 45వ సమావేశం(లక్నో, ఉత్తర ప్రదేశ్‌)
ఎందుకు  : ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించడం ద్వారా... 


Ease of Doing Business Index: డూయింగ్‌ బిజినెస్‌ నివేదిక నిలిపివేత: ప్రపంచ బ్యాంకు

Doing Bussiness

వివిధ దేశాల్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితులకు సంబంధించి విడుదల చేసే ’ఈజ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ నివేదికను నిలిపివేయాలని ప్రపంచ బ్యాంకు నిర్ణయించింది. చైనాతో పాటు కొన్ని దేశాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చే విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఇందుకు కారణం. 2018, 2020 నివేదికల్లో డేటాపరమైన అవకతవకలు, బ్యాంకు సిబ్బంది నైతిక విలువలు పాటించకపోవడం వంటి ఆరోపణలపై అంతర్గతంగా విచారణ నిర్వహించిన నేపథ్యంలో డూయింగ్‌ బిజినెస్‌ నివేదికను నిలిపివేయనున్నట్లు ప్రపంచ బ్యాంకు సెప్టెంబర్‌ 17న వెల్లడించింది. అప్పట్లో వరల్డ్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ జిమ్‌ యోంగ్‌ కిమ్, సీఈవో క్రిస్టలీనా జార్జియేవా ఒత్తిడి మేరకు చైనాకు మెరుగైన ర్యాంకింగ్‌ లభించేలా వరల్డ్‌ బ్యాంక్‌ సిబ్బంది డేటాను మార్చేశారని ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయసేవల సంస్థ విల్మర్‌హేల్‌ నిర్ధారించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఈజ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నివేదిక నిలిపివేత
ఎప్పుడు : సెప్టెంబర్‌ 17
ఎవరు    : ప్రపంచ బ్యాంకు 
ఎందుకు : చైనాతో పాటు కొన్ని దేశాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చే విషయంలో అవకతవకలు జరగడంతో...

AUKUS: కొత్తగా ఏర్పాటైన ‘ఆకస్‌’ కూటమిలోని సభ్య దేశాల సంఖ్య?

AUKUS

ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో రక్షణ, శాంతి లక్ష్యంగా ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌లు కలసి సరికొత్త కూటమి ‘ఆకస్‌’ (ఏయూకేయూఎస్‌)ను ఏర్పాటు చేశాయి. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో ఇటీవల చైనా వ్యూహాత్మకంగా పట్టును పెంచుకుంటున్న నేపథ్యంలో, ఆ దేశానికి అడ్డు కట్ట వేసేందుకు ఆకస్‌ను ఏర్పాటు చేసినట్లు భారత్‌లో ఆస్ట్రేలియా రాయబారి బారీ ఓ ఫారెల్‌ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌లు సెప్టెంబర్‌ 16న ఆకస్‌కు శ్రీకారం చుట్టారు. అత్యాధునిక న్యూక్లియర్‌ ఆధారిత సబ్‌మెరైన్లను ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో మొదటిసారిగా ప్రవేశపెట్టేందుకు ఆకస్‌ సిద్ధమవుతోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సరికొత్త కూటమి ‘ఆకస్‌’ (ఏయూకేయూఎస్‌) ఏర్పాటు
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 16
ఎవరు    : ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌
ఎందుకు : ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో రక్షణ, శాంతి లక్ష్యంగా...


Break Point: లియాండర్‌ పేస్‌–మహేశ్‌ భూపతి ద్వయంపై నిర్మితమైన వెబ్‌ సిరీస్‌ పేరు?

Break Point

భారత టెన్నిస్‌ స్టార్లు లియాండర్‌ పేస్, మహేశ్‌ భూపతిల ఆట, అనుబంధం, స్పర్ధలు, గెలుపోటములు... ఇలా ఇప్పటి వరకు ఎక్కడా చెప్పని పలు ఆసక్తికర అంశాలతో ‘బ్రేక్‌ పాయింట్‌’ అనే వెబ్‌ సిరీస్‌ నిర్మితమైంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను సెప్టెంబర్‌ 17న విడుదలైంది. అశ్విని అయ్యర్‌ తివారి, నితీశ్‌ తివారిల దర్శకత్వంలో రూపొందిన ‘బ్రేక్‌ పాయింట్‌’ ‘జీ5’ ఓటీటీలో అక్టోబర్‌ 1న విడుదల కానుంది.

ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌...
దశాబ్దానికిపైగా భారత టెన్నిస్‌ ముఖ చిత్రంగా ఉన్న పేస్‌–భూపతి ద్వయం 1994–2006, 2008–2011 మధ్య డబుల్స్‌ జోడీగా చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. 1999లో జరిగిన నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో (ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌)నూ పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరిన ఈ జంట... ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌ల్లో విజేతలుగా నిలిచింది. అనంతరం 2001 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మరోసారి చాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో వీరిని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ అంటూ భారతీయులు కీర్తించారు.


Open Athletics Championship: స్టీపుల్‌చేజ్‌లో పసిడి పతకం సాధించిన రైల్వేస్‌ అథ్లెట్‌?

Parul Chaudhary

 

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రైల్వేస్‌ అథ్లెట్‌ పారుల్‌ చౌదరి పసిడి పతకం సాధించింది. పోటీల్లో భాగంగా హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో సెప్టెంబర్‌ 17న జరిగిన మహిళల 3000 మీ. స్టీపుల్‌చేజ్‌ ఫైనల్లో పారుల్‌ అందరికంటే ముందుగా(9ని.51.01 సె) గమ్యాన్ని చేరి విజేతగా నిలవడంతోపాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మహారాష్ట్ర అథ్లెట్‌ కోమల్‌ చంద్రకాంత్‌ జగ్దలే 9 ని.51.03సెకన్ల టైమింగ్‌తో రజతంతో సరిపెట్టుకొంది. ఈ ఈవెంట్‌లో ప్రీతి (రైల్వేస్‌; 10 ని.22.45 సె.) కాంస్యం గెలిచింది.

5000 మీటర్ల పరుగులోనూ...
పోటీల ప్రారంభ రోజే పారుల్‌ 5000 మీటర్ల పరుగులో కూడా బంగారు పతకం సాధించింది. మరో ఐదు ఈవెంట్లలో రైల్వేస్‌ అథ్లెట్లు స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల హైజంప్‌లో సందేశ్, షాట్‌పుట్‌లో కరణ్‌వీర్‌ సింగ్, మహిళల లాంగ్‌జంప్‌లో ఐశ్వర్య, హర్డిల్స్‌లో కనిమొని స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు.

జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా శరత్‌...
జాతీయ జూనియర్‌ క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా తమిళనాడు రంజీ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ శ్రీధరన్‌ శరత్‌ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు జట్టు తరఫున 100 రంజీ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా శరత్‌ ఘనత వహించాడు. ఈ కమిటీలో కిషన్‌ మోహన్, రణదేవ్‌ బోస్, పథీక్‌ పటేల్, హర్వీందర్‌ సింగ్‌ సోధీ ఇతర సభ్యులు. ఈ కమిటీ 2022 ఏడాది వెస్టిండీస్‌ వేదికగా జరిగే అండర్‌19 ప్రపంచ కప్‌ కోసం త్వరలోనే భారత జట్టును ఎంపిక చేయనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ మహిళల 3000 మీ. స్టీపుల్‌చేజ్‌ పసిడి పతకం సాధించిన రైల్వేస్‌ అథ్లెట్‌? 
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 17
ఎవరు    : పారుల్‌ చౌదరి
ఎక్కడ    : జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం, హన్మకొండ, హన్మకొండ జిల్లా  


Jute Industry: రాష్ట్రంలో జూట్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్న కంపెనీలు?

Jute Industry

తెలంగాణ రాష్ట్రంలో జూట్‌ పరిశ్రమల స్థాపనకు మూడు ప్రసిద్ధ కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.887 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు గ్లోస్టర్‌ లిమిటెడ్, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్, ఎంజీబీ కమోడిటీస్‌ లిమిటెడ్‌ కంపెనీలు అంగీకరించి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా వరంగల్‌ జిల్లాలో గ్లోస్టర్‌ కంపెనీ రూ.330 కోట్లు, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం అగ్రో లిమిటెడ్‌ రూ. 254 కోట్లు, సిరిసిల్ల జిల్లాలో ఎంజీబీ కమోడిటీస్‌ లిమిటెడ్‌ రూ. 303 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నాయి. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సోమాజిగూడలో జరిగిన కార్యక్రమంలో ఈ మూడు కంపెనీలు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ల సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి.

కైటెక్స్‌ గ్రూప్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుతో పాటు హైదరాబాద్‌ పారిశ్రామిక పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో  అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కైటెక్స్‌ గ్రూప్‌ సెప్టెంబర్‌ 17న ప్రకటించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 17
ఎవరు    : గ్లోస్టర్‌ లిమిటెడ్, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్, ఎంజీబీ కమోడిటీస్‌ లిమిటెడ్‌ కంపెనీ
ఎందుకు  : వరంగల్‌ జిల్లా(గ్లోస్టర్‌ కంపెనీ),కామారెడ్డి జిల్లా(కాళేశ్వరం అగ్రో లిమిటెడ్‌), సిరిసిల్ల జిల్లా(ఎంజీబీ కమోడిటీస్‌ లిమిటెడ్‌)ల్లో  జూట్‌ పరిశ్రమల స్థాపనకు...


Union Bank of India: రాజభాష కీర్తి పురస్కార్‌ గెలుచుకున్న బ్యాంక్‌?

Union Bank of India

హిందీ భాషను విజయవంతంగా అమలు చేసినందుకు 2018–19, 2019–20, 2020–21 సంవత్సరాలకు గాను యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ‘రాజభాష కీర్తి పురస్కార్‌’ను దక్కించుకుంది. బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్‌ రాయ్‌ సెప్టెంబర్‌ 15న ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నేషనలైజ్డ్‌ బ్యాంకు విభాగంలో.. 2019–20లో మొదటి బహుమతిని, 2020–21 లో తృతీయ బహుమతిని అందుకుంది. హౌస్‌ మేగజైన్‌ విభాగంలో 2018–19లో.. సంస్థ అంతర్గత మేగజైన్‌ ‘యూనియన్‌ శ్రీజన్‌’కు రెండో బహుమతి లభించింది. ఇలా అధికారిక భాష అమలులో 5 అవార్డులను బ్యాంకు దక్కించుకుంది.

రజిత ప్రియకు కౌశలాచార్య అవార్డు
‘స్కిల్‌ ఇండియా’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, శిక్షణ కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా విశేష ప్రతిభ చాటిన 41 మంది శిక్షకులకు కౌశలాచార్య–2021 అవార్డులను లభించాయి. అవార్డులను అందుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వై.రజిత ప్రియ ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వీటిని సెప్టెంబర్‌ 17న వర్చువల్‌ విధానంలో అందజేశారు.

సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డులు...
విభిన్న రంగాల్లో విజయాలు సాధించినవారిని గుర్తించి పురస్కారాలు అందించే ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డుల కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి పాల్గొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు రాజభాష కీర్తి పురస్కార్‌(2018–19, 2019–20, 2020–21) ప్రదానం
ఎప్పుడు : సెప్టెంబర్‌ 15
ఎవరు    : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా
ఎక్కడ    : విజ్ఞాన్‌ భవన్, న్యూఢిల్లీ
ఎందుకు  : అధికార భాష హిందీని విజయవంతంగా అమలు చేసినందుకు...


Mekapati Goutham Reddy: రాష్ట్రంలోని ఏ నగరంలో వాణిజ్య ఉత్సవ్‌–2021 జరగనుంది?

Mekapati

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల రెట్టింపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర వాణిజ్యశాఖతో కలిసి రాష్ట్రంలో ‘వాణిజ్య ఉత్సవ్‌–2021’ పేరిట సెప్టెంబర్‌ 21, 22 తేదీల్లో విజయవాడలో భారీ వాణిజ్య సదస్సు నిర్వహించనుంది. ఈ విషయాన్ని సెప్టెంబర్‌ 16న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు.

రెండో ఐటీ పాలసీ ఆవిష్కరణ
డిజిటల్‌ ప్రపంచానికి పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అన్ని సామాజిక నేపథ్యాల ప్రజలు సాధికారత సాధించేలా రెండో ‘ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ)’పాలసీకి రూపకల్పన చేశామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావు తెలిపారు. 2021 నుంచి 2026 వరకు అమలు చేసే ఈ రెండో ఐసీటీ పాలసీని సెప్టెంబర్‌ 16న హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో రూ.3లక్షల కోట్ల వార్షిక ఎగుమతులు సాధించాలని.. పది లక్షల మందికి ఉద్యోగాల కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సెప్టెంబర్‌ 21, 22 తేదీల్లో వాణిజ్య ఉత్సవ్‌–2021 పేరిట భారీ వాణిజ్య సదస్సు నిర్వహణ 
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 16
ఎవరు    : తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
ఎక్కడ    : విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల రెట్టింపే లక్ష్యంగా...


Minister Ashwini Vaishnav: కేంద్రం ప్రారంభించిన రైల్‌ కౌశల్‌ వికాస్‌ యోజన ఉద్దేశం?

Rail Kaushal Vikas Yojana

 

ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజనలో భాగంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌... రైల్‌ కౌశల్‌ వికాస్‌ యోజనను సెప్టెంబర్‌ 17న న్యూఢిల్లీలో రైల్‌ భవన్‌లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మూడేళ్ల పాటు 50 వేల మంది యువతకు ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, ఫిట్టర్‌ తదితర నాలుగు ట్రేడ్‌లలో నైపుణ్య శిక్షణ అందించనున్నట్టు మంత్రి అశ్విని తెలిపారు. దేశవ్యాప్తంగా 75 రైల్వే శిక్షణ కేంద్రాల్లో పరిశ్రమ సంబంధిత నైపుణ్య శిక్షణను అందించనున్నట్టు పేర్కొన్నారు.

బైజూస్, నీతి ఆయోగ్‌ జోడీ
ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌ తాజాగా నీతి ఆయోగ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా బైజూస్‌ అభివృద్ధి చేసిన అభ్యాస కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 112 వెనుకబడిన జిల్లాల్లోని విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. నీట్, జేఈఈ లక్ష్యంగా చదువుతున్న 3,000 మంది ప్రతిభావంతులైన 11, 12వ తరగతి విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇస్తారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజనలో భాగంగా రైల్‌ కౌశల్‌ వికాస్‌ యోజన ప్రారంభం
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 17
ఎవరు    : రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌
ఎక్కడ    : రైల్‌ భవన్, న్యూఢిల్లీ
ఎందుకు  : యువతకు రైల్వే పరిశ్రమ సంబంధిత నైపుణ్య శిక్షణను అందించేందుకు...


Bajireddy Goverdhan: రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులైన ఎమ్మెల్యే?

MLA Bajireddy Goverdhan

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) చైర్మన్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సెప్టెంబర్‌ 16న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 వరకు ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు సత్యనారాయణ పనిచేశారు. ఆ తరువాత నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం చీమన్‌పల్లి గ్రామానికి చెందిన బాజిరెడ్డి... 1999 నుంచి 2004 వరకు ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా, 2004 నుంచి 2009 వరకు బాన్సువాడ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 నుంచి నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు.

నమామి గంగే మిషన్‌కు...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులు, జ్ఞాపికలను ఈ–వేలం నిర్వహించేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి అక్టోబర్‌ 7వ తేదీ వరకు జరిగే ఈ–వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని గంగా పరిరక్షణ, పునరుజ్జీవనం కొరకు నమామి గంగే మిషన్‌కు అందించనున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 17
ఎవరు    : నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌
ఎందుకు : ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఖాళీగా ఉన్న నేపథ్యంలో...

 

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 17 కరెంట్‌ అఫైర్స్‌

 

Published date : 18 Sep 2021 07:05PM

Photo Stories