Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 17 కరెంట్‌ అఫైర్స్‌

Shashi Tharoor, Priyanka Chaturvedi

Sansad TV: సంసద్‌ టీవీ హోస్ట్‌లుగా వ్యవహరించనున్న ప్రతిపక్ష ఎంపీలు?

లోక్‌సభ, రాజ్యసభల టీవీలను కలిపేస్తూ కొత్తగా వచ్చిన సంసద్‌ టీవీలో ప్రతిపక్ష ఎంపీలు శశిథరూర్, ప్రియాంక చతుర్వేది యాంకర్లుగా దర్శనమివ్వబోతున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ‘టు ది పాయింట్‌’ అనే కార్యక్రమాన్ని హోస్ట్‌ చేయబోతుండగా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ‘మేరి కహానీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. థరూర్‌ నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖులతో వివిధ అంశాలపై లోతైన చర్చలు  ఉంటే, చతుర్వేది మహిళా ఎంపీల రాజకీయ ప్రయాణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.

హైపరైస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కోహ్లి...
వెల్‌నెస్‌ సంస్థ హైపరైస్‌తో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి చేతులు కలిపారు. కంపెనీలో అథ్లెట్‌–ఇన్వెస్టర్‌గా ఉండటంతో పాటు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా ఆయన వ్యవహరిస్తారు. తద్వారా అంతర్జాతీయ అథ్లెట్‌ ఇన్వెస్టర్లయిన ఎర్లింగ్‌ హాలాండ్‌ (ఫుట్‌బాల్‌), నయోమి ఒసాకా (టెన్నిస్‌ దిగ్గజం), ప్యాట్రిక్‌ మహోమ్స్‌ (సూపర్‌ బౌల్‌), యా మొరాంట్‌ (ఎన్‌బీఏ) రికీ ఫౌలర్‌ (గోల్ఫ్‌) సరసన కోహ్లి చేరతారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సంసద్‌ టీవీ హోస్ట్‌లుగా వ్యవహరించనున్న ప్రతిపక్ష ఎంపీలు?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 17
ఎవరు    : శశిథరూర్, ప్రియాంక చతుర్వేది   
ఎందుకు  : టు ది పాయింట్‌(శశిథరూర్‌), మేరి కహానీ(ప్రియాంక చతుర్వేది) కార్యక్రమాలను నిర్వహించేందుకు...


United Nations: ఐరాస అంచనాల ప్రకారం... 2021లో భారత్‌ వృద్ధి రేటు?

GDP

2021 సంవత్సరంలో భారత్‌ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుందని ఐక్యరాజ్యసమితి అంచానా వేసింది. అయితే 2022 ఏడాదిలో ఈ వృద్ధి నెమ్మదించే అవకాశం ఉందని పేర్కొంది. సెప్టెంబర్‌ 16న విడుదలైన ‘యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ నివేదిక 2021’లో ఈ విషయాలను వెల్లడించింది. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన మానవతా, ఆర్థిక నష్టం, ప్రైవేటు వినియోగంపై ధరల పెరుగుదల ప్రభావం భారత్‌లో వృద్ధికి అవరోధాలు కలిగించినట్టు నివేదిక పేర్కొంది. 2021 ఏడాది ప్రపంచ స్థూల ఉత్పత్తి 5.3 శాతం ఉంటుందని అంచనా వేసింది.

జనవరిలో డబ్ల్యూఈఎఫ్‌ దావోస్‌ సదస్సు... 
కరోనా వైరస్‌ మహమ్మారి ప్రబలిన రెండేళ్ల తర్వాత వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) తొలిసారిగా పూర్తి స్థాయి వార్షిక సదస్సు నిర్వహించనుంది. 2022 జనవరిలో 17–21 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో దీన్ని నిర్వహించనున్నట్లు డబ్ల్యూఈఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. పలువురు వ్యాపార దిగ్గజాలు, ప్రభుత్వధినేతలు, పౌర సమాజ నేతలు, ఆర్థికవేత్తలు మొదలైన వారు సదస్సుకు హాజరు కానున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2021 సంవత్సరంలో భారత్‌ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుంది
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 17
ఎవరు    : యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ నివేదిక–2021

 

Justice Ashok Cheema: ఎన్‌సీఎల్‌ఏటీ చైర్మన్‌గా జస్టిస్‌ చీమా కొనసాగొచ్చు: సుప్రీంకోర్టు 

supreme court

నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) చైర్‌పర్సన్‌ జస్టిస్‌ అశోక్‌ ఇక్బాల్‌సింగ్‌ చీమాను గడువు కంటే ముందే పదవీ విరమణ చేయించడంపై తలెత్తిన వివాదానికి తెరపడింది. 2021, సెప్టెంబర్‌ 20వ తేదీ దాకా పదవిలో కొనసాగుతూ తీర్పులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. జస్టిస్‌ చీమా ఎన్‌సీఎల్‌ఏటీ చైర్‌పర్సన్‌గా 2021, సెప్టెంబర్‌ 20న పదవీ విమరణ చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ పదవిలో జస్టిస్‌ ఎం.వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం సెప్టెంబర్‌ 11వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జస్టిస్‌ చీమా సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం సెప్టెంబర్‌ 17న తీర్పు వెల్లడించింది.

 

Central Vista Project: సెంట్రల్‌ విస్టాలోని డిఫెన్స్‌ కాంప్లెక్స్‌లను ఏ శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు?

Defence Complexes in Central Vista

 

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా కస్తూర్బాగాంధీ మార్గ్, ఆఫ్రికా అవెన్యూలో నిర్మించిన రెండు నూతన బహుళ అంతస్తుల రక్షణ శాఖ కార్యాలయ కాంప్లెక్స్‌(డిఫెన్స్‌ ఆఫీసు కాంప్లెక్స్‌)లను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 16న ప్రారంభించారు. ఇక్కడ 7,000 మందికిపైగా రక్షణ శాఖ, సైనిక దళాల ఉద్యోగులు పని చేయనున్నారు. ఢిఫెన్స్‌ ఆఫీసు కాంప్లెక్స్‌లను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు. నిధులు, వనరులను రక్షణ శాఖ సమకూర్చింది. వీటితో 9.60 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీసు స్పేస్‌ అందుబాటులోకి వచ్చింది.

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌ కింద...
ప్రస్తుత పార్లమెంట్‌కు దగ్గరోనే సెంట్రల్‌ విస్టా రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ కింద కొత్త పార్లమెంట్‌ భవనాలను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక కొత్త పార్లమెంట్‌ భవనం, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ భవనం నిర్మించడమే కాకుండా రాజ్‌పథ్‌ రోడ్‌ను మెరుగుపరుస్తున్నారు. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు చేపట్టిన ప్రాంతం ల్యూటెన్‌ ఢిల్లీలో ఉంది. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020, డిసెంబర్‌ 10న శంకుస్థాపన చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  కస్తూర్బాగాంధీ మార్గ్, ఆఫ్రికా అవెన్యూలో నిర్మించిన రెండు నూతన బహుళ అంతస్తుల రక్షణ శాఖ కార్యాలయ కాంప్లెక్స్‌(డిఫెన్స్‌ ఆఫీసు కాంప్లెక్స్‌)ల ప్రారంభం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 17
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు   : సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా...


Bad Bank: మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న బ్యాంక్‌?

FM Nirmala

 

బ్యాంకింగ్‌ మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న ప్రతిపాదిత నేషనల్‌ అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) లేదా బ్యాడ్‌ బ్యాంక్‌ జారీ చేసే రిసిట్స్‌కు ప్రభుత్వ (సావరిన్‌) గ్యారంటీ లభించింది. ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సెప్టెంబర్‌ 17న తెలిపారు. గత ఆరు సంవత్సరాల్లో బ్యాంకులు రూ.5.01 లక్షల కోట్ల రుణ రికవరీ చేశాయని చెప్పారు. 2018 మార్చి నుంచి చూస్తే ఈ విలువ రూ.3.1 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్నారు.

నిర్వహణా తీరు ఇది... 
ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, ఒక బ్యాంక్‌ నుంచి మొండిబకాయి (ఎన్‌పీఏ) కొనే సందర్భంలో, అంగీకరించిన విలువలో 15 శాతం వరకూ ఎన్‌ఏఆర్‌సీఎల్‌ నగదు రూపంలో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం కేంద్ర హామీతో కూడిన సెక్యూరిటీ రిసిట్స్‌ ఉంటాయి. ఏదైనా ఎన్‌పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో  నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుంది.

2021–22 బడ్జెట్‌లో ప్రతిపాదన...
2021–22 ఆర్థిక సంవత్సరం బడెట్‌  ఆర్థికమంత్రి బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. బ్యాంకింగ్‌ మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారం దిశలో ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోషియేషన్‌ (ఐబీఏ) బ్యాడ్‌ బ్యాంక్‌(ఎన్‌ఏఆర్‌సీఎల్‌)ను ఏర్పాటు చేయనుంది. బ్యాడ్‌ బ్యాంక్‌ ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్‌బీఎఫ్‌సీలుసహా ఎన్‌ఏఆర్‌సీఎల్‌లో 16 మంది షేర్‌హోల్డర్లు ఉంటారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఎన్‌ఏఆర్‌సీఎల్‌ లేదా బ్యాడ్‌ బ్యాంక్‌ జారీ చేసే రిసిట్స్‌కు ప్రభుత్వ (సావరిన్‌) గ్యారంటీకి సంబంధించి రూ.30,600 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 16
ఎవరు    : కేంద్ర కేబినెట్‌
ఎందుకు  : బ్యాంకింగ్‌ మొండిబకాయిల భారం తగ్గించేందుకు...


Esperer Nutrition: దేశంలో తొలి క్యాన్సర్‌ న్యూట్రిషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఎక్కడ ఏర్పాటైంది?

Esperer Nutrition

 

పరిశోధన ఆధారిత క్లినికల్‌ న్యూట్రిషన్‌ కంపెనీ ఎస్పెరర్‌ న్యూట్రిషన్‌.. దేశంలో తొలిసారిగా క్యాన్సర్‌ న్యూట్రిషన్‌ రిసెర్చ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌లో ఏర్పాటు చేసింది. ‘క్యాన్సర్‌ వంటి సంక్రమించని వ్యాధులను అధిగమించాలంటే పోషకాలతో కూడిన ఆహారం అవసరం. ఇందుకు పరిష్కారాన్ని కనుగొనడానికి కఠినమైన క్షేత్ర, ప్రయోగశాల అధ్యయనాలను నిర్వహించడం ద్వారా క్యాన్సర్‌ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుంది’ అని సెప్టెంబర్‌ 16న కంపెనీ తెలిపింది.

రాష్ట్రంలో గోల్డ్‌ రిఫైనరీ ఏర్పాటు చేయనున్న దేశీయ సంస్థ?
ఆభరణాల రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన దేశీయ దిగ్గజసంస్థ మలబార్‌ గ్రూప్‌ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రూ.750 కోట్లతో బంగారు, వజ్రాభరణాల తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్‌ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై చర్చించేందుకు మలబార్‌ గ్రూప్‌ అధినేత ఎంపీ అహ్మద్‌తో కూడిన ప్రతినిధి బృందం సెప్టెంబర్‌ 15న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : దేశంలో తొలి క్యాన్సర్‌ న్యూట్రిషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఎక్కడ ఏర్పాటైంది?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 17
ఎవరు    : ఎస్పెరర్‌ న్యూట్రిషన్‌ కంపెనీ
ఎక్కడ    : శామీర్‌పేట్‌, హైదరాబాద్, తెలంగాణ
ఎందుకు  : కఠినమైన క్షేత్ర, ప్రయోగశాల అధ్యయనాలను నిర్వహించడం ద్వారా క్యాన్సర్‌ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా...


Italy: ఇన్‌లైన్‌ హాకీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇస్తోన్న దేశం? 

Aryan Karra

ఇన్‌లైన్‌ హాకీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌–2021లో పాల్గొంటున్న భారత సీనియర్‌ జట్టుకు తెలంగాణకు చెందిన ఆర్యన్‌ కర్రా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటలీలోని రొకారాసో పట్టణంలో ప్రస్తుతం ఈ టోర్నీ జరుగుతోంది. పురుషుల విభాగంలో 16 మంది సభ్యుల, మహిళల విభాగంలో 10 మంది సభ్యుల జట్టు పోటీల్లో తలపడుతోంది.

కామెంటరీకి వీడ్కోలు పలికిన వెస్టిండీస్‌ పేస్‌ దిగ్గజం?
క్రికెట్‌ ప్రపంచంలో అత్యుత్తమ వ్యాఖ్యాతల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వెస్టిండీస్‌ పేస్‌ దిగ్గజం మైకేల్‌ హోల్డింగ్‌... కామెంటరీనుంచి తప్పుకుంటున్నట్లు సెప్టెంబర్‌ 15న ప్రకటించారు. గత 20 ఏళ్లుగా స్కై స్పోర్ట్స్‌కు హోల్డింగ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. నిష్పక్షపాతంగా తన అభిప్రాయాలు వెల్లడించడం, ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా నిజాయితీగా, లోతుగా తన విశ్లేషణను అందించడంలో హోల్డింగ్‌ అగ్రభాగాన నిలిచాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఇన్‌లైన్‌ హాకీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌–2021లో పాల్గొంటున్న భారత సీనియర్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన క్రీడాకారుడు?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 15
ఎవరు    : తెలంగాణకు చెందిన ఆర్యన్‌ కర్రా
ఎక్కడ    : రొకారాసో పట్టణం, ఇటలీ


BlueSport‌: హ్యాండ్‌బాల్‌ అభివృద్ధికి రూ. 240 కోట్లు అందజేయనున్న సంస్థ? 

Bluesport

భారతదేశంలో హ్యాండ్‌బాల్‌ క్రీడకు మరింత గుర్తింపు తెచ్చేందుకు కార్పొరేట్‌ సంస్థ బ్లూ స్పోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ముందుకు వచ్చింది. వచ్చే ఐదేళ్లలో హ్యాండ్‌బాల్‌ అభివృద్ధికి రూ. 240 కోట్లు అందజేస్తామని సెప్టెంబర్‌ 15న బ్లూ స్పోర్ట్స్‌ ప్రకటించింది. పురుషుల, మహిళల టీమ్‌ల కోసం రూ. 120 కోట్ల చొప్పున, మరో రూ. 35 కోట్లు ప్రాధమిక స్థాయిలో ఆట కోసం ఇస్తామని వెల్లడించింది. హ్యాండ్‌బాల్‌ సమాఖ్య ఆధ్వర్యంలో జరగనున్న ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ నిర్వహణా హక్కులు ఈ సంస్థ వద్దే ఉన్నాయి.

త్వరలో ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌...
వాలీబాల్‌ క్రీడను మరింత ఆకర్షణీయంగా మార్చే క్రమంలో కొత్తగా మరో లీగ్‌ తెరపైకి వచ్చింది. ‘ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌’ పేరుతో దీనిని నిర్వహించనున్నారు. ఇందులో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్పెన్డోస్, కాలికట్‌ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్, అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ పేర్లతో ఆరు నగరాలకు చెందిన జట్లు ఉంటాయి. ఈ టోర్నీ వివరాలను సెప్టెంబర్‌ 15న నిర్వాహకులు వెల్లడించారు.

స్వల్ప మార్పులు చేసి...
2019లో జరిగిన ప్రొ వాలీబాల్‌ లీగ్‌లో స్వల్ప మార్పులు చేసి కొత్తగా ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ని ముందుకు తెచ్చారు. ఫ్రాంచైజీల చేతుల్లోనే టోర్నీ మొత్తం యాజమాన్య హక్కులు ఉండే పద్ధతిలో తొలిసారి ఇలాంటి టోర్నమెంట్‌ జరగనుందని ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ లీగ్‌ సీఈఓ జాయ్‌ భట్టాచార్య వెల్లడించారు. ఆన్‌లైన్‌ కంపెనీ ఏ23, ప్లేయర్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ బేస్‌లైన్‌ వెంచర్స్‌ లీగ్‌లో ప్రధాన భాగస్వాములు కాగా... సోనీ నెట్‌వర్క్‌ ఈ లీగ్‌ మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వచ్చే ఐదేళ్లలో రూ. 240 కోట్లు అందజేస్తాం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 15
ఎవరు    : బ్లూ స్పోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
ఎక్కడ    : భారతదేశంలో హ్యాండ్‌బాల్‌ క్రీడకు మరింత గుర్తింపు తెచ్చేందుకు... 


Hanmakonda: రాష్ట్రంలోని ఏ పట్టణంలో జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ జరుగుతోంది? 

National Open Athletics Championship

60వ‌ జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2021 సెప్టెంబర్‌ 15న మొదలైంది. తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా వరంగల్‌ సమీపంలోని హన్మకొండ పట్టణంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నూతన సింథటిక్‌ ట్రాక్‌పై 5 రోజులు ఈ పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో 573 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ లాంఛనంగా పోటీలను ప్రారంభించారు.

100 మీటర్ల చాంప్‌ నరేశ్‌...
చాంపియన్‌షిప్‌లో భాగంగా సెప్టెంబర్‌ 16న నిర్వహించిన పురుషుల 100 మీటర్ల పరుగు పోటీలో ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాకు చెందిన అథ్లెట్‌ కె. నరేశ్‌ కుమార్‌ విజేతగా అవతరించాడు. నరేశ్‌ 100 మీటర్లను 10.30 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో 2001లో 10.37 సెకన్లతో అనిల్‌ కుమార్‌ నెలకొల్పిన మీట్‌ రికార్డును సవరించాడు.

19 ఏళ్ల రికార్డు బద్దలు...
మహిళల 1500 మీటర్ల లో పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల హర్మిలన్‌ కౌర్‌ బైన్స్‌ 19 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. హర్మిలన్‌ 4ని:05.39 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2002 ఆసియా క్రీడల్లో 4ని:06.03 సెకన్లతో సునీతా రాణి నెలకొల్పిన రికార్డును హర్మిలన్‌ తిరగరాసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2021 ప్రారంభం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 15
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌
ఎక్కడ    : హన్మకొండ పట్టణం, వరంగల్‌ సమీపం, హనుమకొండ జిల్లా


Virat Kohli: క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లో.. జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకోనున్నాడు? 

Virat Kohli

భారత క్రికెట్‌ జట్టుకు మూడు ఫార్మాట్‌లలోనూ జట్టుకు నాయకత్వం వహిస్తున్న విరాట్‌ కోహ్లి టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ప్రపంచకప్‌(2021 ప్రపంచకప్‌) తర్వాత తాను సారథ్యాన్ని వదిలేస్తానని సెప్టెంబర్‌ 16న అతను స్వయంగా ప్రకటించాడు. పని భారం తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. 2017న తొలిసారి టి20 మ్యాచ్‌లో భారత్‌కు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించగా... ఇప్పటి వరకు తన 90 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సగం మ్యాచ్‌లు (45) అతను సారథిగా మైదానంలోకి దిగాడు. కోహ్లి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు భారత్‌ 67 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టి20 ప్రపంచకప్‌–2021 తర్వాత టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు సిద్ధం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 16
ఎవరు    : భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి
ఎందుకు : పని భారం తగ్గించుకునేందుకు... 


MS Dhoni: ఎన్‌సీసీ కమిటీలో సభ్యుడిగా నియమితులైన క్రికెట్‌ దిగ్గజం? 

Dhoni

భారత క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ)ని సరికొత్తగా తీర్చిదిద్దే కమిటీలో సభ్యుడిగా నియమించారు. రక్షణ మంత్రిత్వ శాఖ నియమించిన 15 మంది సభ్యుల ఈ కమిటీలో ధోని సహా పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర, ఇతర రంగాల నిపుణులున్నారు. భారత ఆర్మీలో ధోని గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అతని పేరును కమిటీలో చేర్చింది. క్రమశిక్షణ, కార్యదీక్షతకు మారుపేరైన ఎన్‌సీసీని మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్‌సీసీ కమిటీ చర్చిస్తుంది.

పంకజ్‌ అద్వానీకి ఆసియా స్నూకర్‌ టైటిల్‌... 
భారత మేటి ప్లేయర్‌ పంకజ్‌ అద్వానీ ఆసియా స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఖతార్‌ రాజధాని దోహాలో సెప్టెంబర్‌ 16న జరిగిన ఫైనల్లో పంకజ్‌ 6–3 ఫ్రేమ్‌ల తేడాతో అమీర్‌ సర్ఖోష్‌ (ఇరాన్‌)పై గెలిచాడు. స్నూకర్, బిలియర్డ్స్‌ క్రీడాంశాల్లో కలిపి పంకజ్‌ ఖాతాలో ఇప్పటివరకు 11 ఆసియా టైటిల్స్‌ చేరడం విశేషం. 2019లో పంకజ్‌ విజేతగా నిలువగా... కరోనా కారణంగా 2020 ఆసియా చాంపియన్‌షిప్‌ను నిర్వహించలేదు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ) కమిటీలో సభ్యుడిగా నియామకం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 15
ఎవరు    : భారత క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని
ఎందుకు : ఎన్‌సీసీని మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు...

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 16 కరెంట్‌ అఫైర్స్‌

 

Published date : 17 Sep 2021 07:58PM

Photo Stories