Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్ 16 కరెంట్ అఫైర్స్
Sansad TV: లోక్‌సభ, రాజ్యసభ టీవీలను విలీనం చేసి కొత్తగా ఏర్పాటు చేసిన టీవీ?
లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీలను విలీనం చేసి కొత్తగా ఏర్పాటు చేసిన సంసద్ టీవీని సెప్టెంబర్ 15న రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. సంసద్ టీవీ అనే ఈ కొత్త మీడియా దేశ పార్లమెంటరీ వ్యవస్థలో కొత్త అధ్యాయం అని అన్నారు. పార్లమెంటులోని కంటెంట్‌ని (విధానపరమైన నిర్ణయాలను) ప్రజలకు చేరవేసే కనెక్ట్ (మీడియా) ఈ ఛానెల్ అని అభివర్ణించారు. మన దేశంలో ప్రజాస్వామ్యమంటే రాజ్యాంగం, ఆర్టికల్స్ కాదని, అదొక జీవన ప్రవాహమని వ్యాఖ్యానించారు.
సీఈవోగా రవి కపూర్...
సంసద్ టీవీ సీఈవోగా రిటైర్డు ఐఏఎస్ అధికారి రవి కపూర్‌ను 2021, మార్చి 1వ తేదీ నుంచి ఏడాది కాలానికి నియమిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. రెండు చానెళ్లు విలీనం అయినప్పటికీ లోక్‌సభ, రాజ్యసభ కార్యక్రమాలను ఇప్పటివరకు మాదిరిగానే ప్రసారం చేస్తాయని, సంయుక్త సమావేశంలో ఒకే వేదికపై పనిచేస్తాయని రెండు సభల సెక్రటేరియట్ అధికారులు వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీలను విలీనం చేసి కొత్తగా ఏర్పాటు చేసిన సంసద్ టీవీ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను ప్రత్యక్షప్రసారం చేసేందుకు వీలుగా కొత్తగా...
Most Influential People: టైమ్ ప్రభావశీల వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులు?
ప్రఖ్యాత ‘టైమ్’ మ్యాగజైన్ 2021వ సంవత్సరానికి గాను సెప్టెంబర్ 15న విడుదల చేసిన ‘ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల’ జాబితాలో భారత్ నుంచి ముగ్గురికి స్థానం లభించింది. ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రిన్స్ హ్యారీ–మెఘన్ మెర్కెల్ దంపతులు, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, తాలిబన్ ముఠా సహ వ్యవస్థాపకుడు, అఫ్గానిస్తాన్ ఉప ప్రధాని ముల్లా అబ్దుల్ బరాదర్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
మూడవ కీలకమైన నాయకుడు...
74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత మూడవ కీలకమైన నాయకుడు నరేంద్ర మోదీ అని టైమ్ పత్రిక ప్రొఫైల్‌లో పేర్కొంది. ఈ ప్రొఫైల్‌ను సీఎన్‌ఎన్ జర్నలిస్టు ఫరీద్ జకారియా రాశారు. భారతదేశాన్ని నరేంద్ర మోదీ లౌకికవాదం నుంచి హిందూ జాతీయవాదం వైపు నెడుతున్నారని విమర్శలు గుప్పించారు.
నవోమీ ఒసాకా కూడా...
టైమ్ అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో టెన్నిస్ ప్లేయర్ నవోమీ ఒసాకా, రష్యా ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ, గాయకురాలు బ్రిట్నీ స్పియర్స్, ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్, హాలీవుడ్ నటీమణి కేట్ విన్‌స్లెట్, ఆసియన్ పసిఫిక్ పాలసీ అండ్ ప్లానింగ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంజూష పి.కులకర్ణి తదితరులు చోటు దక్కించుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్ అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితా–2021లో చోటు దక్కించుకున్న భారతీయులు?
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా
ఎందుకు : ఆయా రంగాల్లో మార్గదర్శకులుగా నిలిచినందుకు..
Ballistic Missile: సముద్రగర్భంలో క్షిపణి ప్రయోగాలు నిర్వహించిన ఆసియా దేశం?
ఉభయ కొరియా దేశాలు సెప్టెంబర్ 15న కొద్ది గంటల తేడాలో పోటా పోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహించాయి. ఉత్తర కొరియా రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు రెండు చేయడంతో.. దక్షిణ కొరియా దానికి పోటీగా ఏకంగా సముద్రగర్భంలో క్షిపణి ప్రయోగాలు చేసింది. దీంతో జలాంతర్గామి నుంచి క్షిపణి పరీక్షలు నిర్వహించగలిగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న ఏడో దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. కొత్తగా నిర్మించిన సబ్‌మెరైన్ ‘‘అహ్ చంగ్ హో’’ ద్వారా సముద్రగర్భంలో ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 3 వేల టన్నుల బరువున్న సబ్‌మెరైన్ నుంచి నిర్దేశిత లక్ష్యాలను ఈ క్షిపణి కచ్చితంగా ఛేదించింది. కాగా, ఇదిలాగే కొనసాగితే ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతం కలగడం ఖాయమని ఉత్తరకొరియా అధినేత కిమ్ సోదరి యో జాంగ్ హెచ్చరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సబ్‌మెరైన్ ‘‘అహ్ చంగ్ హో’’ ద్వారా సముద్రగర్భంలో క్షిపణి ప్రయోగాలు నిర్వహించిన ఆసియా దేశం?
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : దక్షిణ కొరియా
ఎందుకు : ఉత్తర కొరియా నిర్వహించిన రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలకు పోటీగా...
Lt Gen (Retd) Gurmeet Singh: ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ప్రమాణం చేసిన సైన్యాధికారి?
ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న డెహ్రాడూన్‌లోని రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిక పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్న బేబి రాణి మౌర్య ఇటీవల రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. గుర్మీత్ సింగ్ గతంలో భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్‌గా పని చేశారు.
ఢిల్లీలో బాణాసంచా నిషేధం...
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం బాణాసంచాను నిషేధించాలని నిర్ణయించింది. ఢిల్లీలో గత మూడు సంవత్సరాల మాదిరిగానే, 2021 ఏడాది సైతం దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకం, నిల్వ చేయడం, కాల్చడంపై నిషేధం కొనసాగనుంది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్
ఎక్కడ : డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
ఎందుకు : ఉత్తరాఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్న బేబి రాణి మౌర్య ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో...
Covid Misinformation: కరోనా అసత్య సమాచార వ్యాప్తిలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం?
కరోనాపై ఇంటర్నెట్ ద్వారా అత్యధిక అసత్య సమాచారం వ్యాపించిన దేశాల జాబితాలో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయం సేజెస్ ఇంటర్నేషన్ ఫెడరేషన్ ఆఫ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. మొత్తం 138 దేశాల్లో పరిశోధన నిర్వహించగా, అందులో భారత్ తొలి స్థానంలో నిలిచిందని జర్నల్ పేర్కొంది. భారత్‌లో ఇంటర్నెట్ విరివిగా అందుబాటులో ఉండటం, అదే సమయంలో ఇంటర్నెట్ అక్షరాస్యత తక్కువగా ఉండటమే దీనికి కారణమని అధ్యయనం అభిప్రాయపడింది.
ఇతర దేశాల్లో..
కరోనా అసత్య సమాచారన్ని ప్రచారం చేసిన దేశాల్లో భారత్ (18.07శాతం), అమెరికా (9.74 శాతం), బ్రెజిల్ (8.57 శాతం), స్పెయిన్ (8.03) టాప్–4లో ఉన్నాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఇందులో సోషల్ మీడియాలో (84.94 శాతం), ఇంటర్నెట్‌లో (90.5 శాతం) అసత్య సమాచారాలు పోస్ట్ అయ్యాయని పేర్కొంది. అన్నింటికి మించి ఒక్క ఫేస్‌బుక్‌లోనే (66.87) శాతం అసత్య సమాచారం ప్రచురితమైందని పరిశోధన తేల్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనాపై ఇంటర్నెట్ ద్వారా అత్యధిక అసత్య సమాచారం వ్యాపించిన దేశాల జాబితాలో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : సేజెస్ ఇంటర్నేషన్ ఫెడరేషన్ ఆఫ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ జర్నల్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 138 దేశాల్లో...
ఎందుకు : భారత్‌లో ఇంటర్నెట్ విరివిగా అందుబాటులో ఉండటం, అదే సమయంలో ఇంటర్నెట్ అక్షరాస్యత తక్కువగా ఉండట వల్ల...
Shanghai Cooperation Organization: 21వ ఎస్‌సీవో సదస్సు ఎవరి అధ్యక్షతన జరగనుంది?
తజకిస్తాన్ రాజధాని నగరం దుషాంబేలో 2021, సెప్టెంబర్ 17న షాంఘై సహకార సంఘం(ఎస్‌సీవో) సదస్సు ప్రారంభం కానుంది. తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలి రహ్మాన్ అధ్యక్షత ప్రారంభమయ్యే 21వ ఎస్‌సీవో సదస్సులో సభ్య దేశాల అగ్రనేతలు నేరుగా, వర్చువల్ పద్ధతిలో ప్రసంగించనున్నారు. వర్చువల్ పద్ధతిలో సదస్సు జరగడం ఇదే తొలిసారి. భారత ప్రతినిధి బృందం తరఫున ప్రధాని మోదీ సదస్సు ప్లీనరీ సెషన్‌లో ప్రసంగించనున్నారని భారత విదేశాంగ శాఖ సెప్టెంబర్ 15న వెల్లడించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ నేరుగా దుషాంబేకు వెళ్లి సదస్సులో పాల్గొంటారని తెలిపింది. ఎస్‌సీవోలో పూర్తి స్థాయి సభ్య దేశం హోదా సంపాదించాక భారత్ ఈ సదస్సులో పాల్గొనడం ఇది నాలుగోసారి.
ఎనిమిది దేశాల కూటమిగా...
నాటో తరహాలో ఎనిమిది దేశాల కూటమిగా ఎస్‌సీవో ఆవిర్భవించింది. 2017 నుంచి భారత్, పాక్‌లు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులు సంయుక్తంగా 2001లో షాంఘైలో ఎస్‌సీవోను స్థాపించారు. భద్రతాపరమైన అంతర్జాతీయ సహకారం కోసం ఎస్‌సీవోతో, రక్షణ అంశాల్లో ఉమ్మడి పోరు కోసం యాంటీ–టెర్రరిజం స్ట్రక్చర్(ర్యాట్స్)లతో భారత్ కలిసి పనిచేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలి రహ్మాన్ అధ్యక్షతన 2021, సెప్టెంబర్ 17న 21వ షాంఘై సహకార సంఘం(ఎస్‌సీవో) సదస్సు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎక్కడ : దుషాంబే, తజకిస్తాన్
ఎందుకు : అఫ్గాన్ సంక్షోభం కారణంగా తలెత్తే పరిణామాలు, సమకాలీన అంశాలపై చర్చలు జరిపేందుకు...
Telecom Sector: టెలికం రంగంలో ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంది?
టెలికం రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తూ టెల్కోలకు ఉపశమన ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 15న ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది. వ్యవస్థాగతంగా తొమ్మిది సంస్కరణలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. టెల్కోల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడేందుకు ఈ ప్యాకేజీ తోడ్పడగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ప్యాకేజీలో ఉన్న అంశాలు..:
- ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సిన బకాయిలపై నాలుగేళ్ల దాకా మారటోరియం(వార్షిక చెల్లింపులను వాయిదా వేసుకునే వీలు) విధింపు. ఈ వ్యవధిలో స్వల్పంగా వడ్డీ కట్టాల్సి ఉంటుంది.
- సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) నిర్వచన పరిధి నుంచి టెలికంయేతర ఆదాయాలకు మినహాయింపు.
- టెలికం రంగంలో ఆటోమేటిక్ విధానం ద్వారా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి. ఇప్పటిదాకా ఇది 49 శాతంగానే ఉంది.
- ఇతర సుంకాలను, లైసెన్సు ఫీజుకు సంబంధించి చూపాల్సిన బ్యాంక్ గ్యారంటీల తగ్గింపు.
- స్పెక్ట్రం కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పొడిగింపు. 10 సంవత్సరాల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయవచ్చు.
- స్పెక్ట్రం యూజర్ చార్జీలను (ఎస్‌యూసీ) క్రమబద్ధీకరణ, సెల్ఫ్ అప్రూవల్ ప్రాతిపదికన టవర్ల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేయడం. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలు కేంద్రానికి రూ. 92,000 కోట్లు లైసెన్సు ఫీజు, రూ. 41,000 కోట్లు స్పెక్ట్రం యూసేజీ చార్జీలు బాకీ పడ్డాయి.
ప్రక్రియపరమైన సంస్కరణలు
టెలికం రంగంలో ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియపరమైన సంస్కరణలు చూస్తే.. స్పెక్ట్రం వేలం నిర్వహణకు నిర్దిష్ట క్యాలెండర్ రూపకల్పన, వైర్‌లెస్ పరికరాల కోసం క్లిష్టతరమైన లైసెన్సు ప్రక్రియ తొలగింపు, యాప్ ఆధారిత సెల్ఫ్–కేవైసీ, పేపర్ రూపంలో ఉండే కస్టమర్ అక్విజిషన్ ఫారమ్‌ల (సీఏఎఫ్) స్థానంలో డేటాను డిజిటల్‌గా భద్రపర్చడం వంటివి ఉన్నాయి. అలాగే ఈ–కేవైసీ రేటును రూ.1కి సవరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టెల్కోలకు ఉపశమన ప్యాకేజీ ప్రకటన
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : టెల్కోల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడేందుకు
Automobile Industry: మొత్తం ఎన్ని రంగాలకు పీఎల్‌ఐ స్కీమ్ వర్తింపజేయనున్నారు?
ఆటోమొబైల్ పరిశ్రమ, డ్రోన్ పరిశ్రమలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్‌ఐఎస్) వర్తింపజేసే ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్ 15న సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా రానున్న ఐదేళ్లలో రూ. 26,058 కోట్ల మేర నిధులను కేటాయించనున్నారు. అధిక విలువతో కూడిన అడ్వాన్స్‌డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ వాహనాలు, ఉత్పత్తులకు ఈ పీఎల్‌ఐ స్కీమ్ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తారు.
మొత్తం 13 రంగాలకు...
2021–22 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు మొత్తం 13 రంగాలకు పీఎల్‌ఐ స్కీమ్ వర్తింపజేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా కేంద్రం ఆటోమోటివ్, డ్రోన్ రంగాలకు ఈ స్కీమ్‌ను వర్తింపజేసింది. అత్యాధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ ఉత్పత్తుల తయారీలో ఎదురవుతున్న పెట్టుబడి సమస్యలను ఈ పథకం పరిష్కరిస్తుంది. ఐదేళ్ల కాలంలో ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్స్ పరిశ్రమలో సుమారు రూ. 42,500 కోట్ల పెట్టుబడులకు ఈ చర్య దోహదపడుతుందని కేంద్రం అంచనా.
డ్రోన్ పరిశ్రమలకు...
పీఎల్‌ఐ పథకంలో భాగంగా డ్రోన్స్, డ్రోన్స్‌కు అవసరమయ్యే విడిభాగాల పరిశ్రమకు దన్నునిచ్చేందుకు సైతం ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు మూడేళ్ల కాలానికిగాను రూ. 120 కోట్లు కేటాయించినట్లు పౌర విమానయాన శాఖ పేర్కొంది. డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాల తయారీలో వేల్యూ ఎడిషన్‌కు గరిష్టంగా 20 శాతంవరకూ ప్రోత్సాహకాలు లభించగలవని తెలియజేసింది. మూడేళ్ల కాలంలో డ్రోన్ల పరిశ్రమలో రూ. 5,000 కోట్ల పెట్టుబడులకు దారి ఏర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆటోమొబైల్ పరిశ్రమ, డ్రోన్ పరిశ్రమలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్‌ఐఎస్) వర్తింపజేయాలని నిర్ణయం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఆటోమొబైల్, డ్రోన్ పరిశ్రమల్లో ఉత్పత్తుల తయారీలో ఎదురవుతున్న పెట్టుబడి సమస్యలను పరిష్కరించేందుకు...
DRDL Scientist: సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు-2020కు ఎంపికైన శాస్త్రవేత్త?
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ(DRDL) డైరెక్టర్ డాక్టర్ జయతీర్థ రాఘవేంద్ర జోషీకి ప్రతిష్టాత్మక సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు దక్కింది. 2020 సంవత్సరానికిగాను ఈ అవార్డును జోషీకి అందిస్తున్నట్లు ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ప్రకటించింది. ఇంజనీర్స్ డే(సెప్టెంబర్ 15) సందర్భంగా 2021, సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డును డాక్టర్ జోషీకి అందించారు.
30 ఏళ్లుగా రక్షణరంగ శాస్త్రవేత్తగా...
వరంగల్‌లోని ఎన్‌ఐటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన డాక్టర్ జోషీ దాదాపు 30 ఏళ్లుగా రక్షణరంగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. దేశ రక్షణలో కీలకమైన పృథ్వీ, అగ్ని క్షిపణి వ్యవస్థలతోపాటు ఎల్‌ఆర్‌సామ్ అభివృద్ధిలో, ఇతర వైమానిక వ్యవస్థల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్న జోషీ నేషనల్ టెక్నాలజీ అవార్డుతోపాటు పలు ఇతర అవార్డులు పొందారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డాక్టర్ జయతీర్థ రాఘవేంద్ర జోషీకి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు–2020 ప్రదానం
ఎప్పుడు : సెప్టెంబర్ 15, 2021
ఎవరు : ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : శాస్త్ర, సాంకేతిక రంగంలో చేసిన సేవలకుగాను...
NCRB Report: భారత్‌లో నేరాలు–2020 నివేదికను విడుదల చేసిన సంస్థ?
2020 సంవత్సరంలో మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలు, ఘోరాలతో పాటు దేశవ్యాప్తంగా నమోదైన నేరాలకు సంబంధించిన గణాంకాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2021, సెప్టెంబర్ 15న వెల్లడించింది. భారత్‌లో నేరాలు–2020 పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. నివేదికలోని వివరాల ప్రకారం...
- 2020 ఏడాది మహిళలపై రోజుకి సగటున 77 అత్యాచారాలు జరిగాయి. దేశవ్యాప్తంగా 28,046 అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
- మహిళలపై జరిగిన వివిధ నేరాలకు సంబంధించి 3,71,503 కేసులు నమోదయ్యాయి.
- 2019తో పోలిస్తే 2020 ఏడాదిలో మహిళలపై నేరాలు 8.3 శాతం తగ్గాయి.
- రాజస్తాలో మహిళలపై అత్యాచారాలు అధికంగా జరగగా.. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నిలిచాయి.
- 2020లో కరోనా లాక్‌డౌన్ వల్ల దొంగతనాలు, దోపిడీలు, మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు వంటివి కాస్త తగ్గాయి.
28 శాతం పెరిగిన నేరాల సంఖ్య...
- మొత్తం నేరాల సంఖ్య 2019లో 51,56,158 ఉండగా, 2020లో 28 శాతం పెరిగి 66,01,285కి చేరింది.
- అత్యధికంగా తమిళనాడులో 2019లో 4,55,094 కేసులు నమోదుకాగా, 2020లో 13,77,681కి నేరాల సంఖ్య చేరుకున్నాయి.
- దేశం మొత్తమ్మీద 2020 ఏడాది 29,193 హత్యలు జరిగితే యూపీలో 3,779 హత్యలు జరిగాయి. 2019తో పోల్చి చూస్తే హత్యలు ఒక్క శాతం పెరిగాయి.
- హత్యల్లో యూపీ తర్వాత స్థానంలో బిహార్ (3,150), మహారాష్ట్ర (2,163), మధ్యప్రదేశ్ (2,101) ఉన్నాయి.
11.8 శాతం పెరిగిన సైబర్ నేరాలు
- ఆన్‌లైన్‌లో జరిగే నేరాలు, ఘోరాలు పెరిగాయి. 2019తో పోలిస్తే 11.8 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తంగా 50,035 కేసులు నమోదయ్యాయి.
- సైబర్ నేరాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 11,097 కేసులు నమోదు కాగా, కర్ణాటక (10,741), మహారాష్ట్ర (5,496), తెలంగాణ (5,024) తర్వాత స్థానాల్లో నిలిచాయి.
- కోవిడ్ నిబంధనలను యదేచ్ఛగా అతిక్రమించిన కేసులు గత ఏడాది అత్యధికంగా నమోదయ్యాయి.
మొత్తం నేరాలు | 66,01,285 |
ఐపీసీ కింద నమోదైన నేరాలు | 42,54,346 |
ఇతర చట్టాల కింద నేరాలు | 23,46,929 |
నేరాల రేటు | |
2019 | 7.2 |
2020 | 6.7 |
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్ 15 కరెంట్ అఫైర్స్