Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్ 15 కరెంట్ అఫైర్స్
Raja Mahendra Pratap Singh: రాజా ప్రతాప్ సింగ్ యూనివర్సిటీకి ఎక్కడ శంకుస్థాపన చేశారు?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ నగరంలో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీకి ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 14న శంకుస్థాపన చేశారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన ప్రతాప్ సింగ్ స్మృత్యర్థం రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త అయిన రాజా ప్రతాప్ సింగ్ పేరుతో లోధా, జరౌలి గ్రామాల్లోని 92 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుబంధంగా 395 కాలేజీలు పని చేస్తాయి.
శంకుస్థాపన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ... ఇంటి భద్రత కోసం వేసే తాళాలకు అలీగఢ్ ఎలా ప్రఖ్యాతి వహించిందో, సరిహద్దుల్లో రక్షణ అంటే కూడా అలీగఢ్ పేరే ఇక వినిపిస్తుందని పేర్కొన్నారు. అలీగఢ్‌లో ఏర్పాటు కానున్న రక్షణ పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను ప్రధాని సందర్శించారు. ప్రధానితో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీకి శంకుస్థాపన
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : అలీగఢ్, ఉత్తరప్రదేశ్
ఎందుకు: స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త అయిన రాజా ప్రతాప్ సింగ్ స్మృత్యర్థం...
Quad summit 2021: క్వాడ్ సదస్సును ఏ నగరంలో నిర్వహించనున్నారు?
అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్‌లో సెప్టెంబర్ 24న క్వాడ్ (Quadrilateral Security Dialogue-Quad) సదస్సు-2021 జరగనుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లైన అఫ్గాన్ సంక్షోభం, కోవిడ్ మహమ్మారి, స్వేచ్ఛాయుత ఇండో ఫసిఫిక్ విధానంపై నాలుగు దేశాల కూటమైన (అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా) క్వాడ్ సదస్సులో చర్చించనున్నారు. సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిడె సుగ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు పాల్గొంటారు. 2021, మార్చిలో ప్రకటించిన క్వాడ్ వ్యాక్సిన్‌పై వీరు సమీక్షించనున్నారు.
ప్రధాని మోదీ వచ్చే వారం అమెరికా పర్యటనకు వెళుతున్నారు. క్వాడ్ సదస్సు, ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పాల్గొనడానికి మోదీ వెళుతున్నట్టుగా సెప్టెంబర్ 14న భారత విదేశాంగ శాఖ తెలిపింది.
సెప్టెంబర్ 25న యూఎన్ సర్వప్రతినిధి సదస్సు...
2021, సెప్టెంబర్ 25న న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమతి సర్వప్రతినిధి సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటుగా 100 దేశాలకు చెందిన అధినేతలు హాజరవుతున్నారు. కోవిడ్–19 సంక్షోభం నుంచి కోలుకుంటామన్న ఆశతో జాతి పునర్నిర్మాణం, సుస్థిరత కొనసాగడం, భూమి అవసరాలకనుగుణంగా మసలు కోవడం, ప్రజల హక్కుల్ని గౌరవించడం, ఐక్యరాజ్య సమితి పునరుజ్జీవనం తదితర అంశాలపై ఈ సదస్సు జరగనుంది. ఈసారి సదస్సులో అఫ్గానిస్తాన్ ప్రతినిధికి చివరి రోజు ప్రసంగించే అవకాశం కల్పించారు. గత ఏడాది(2020) కరోనా మహమ్మారి కారణంగా వర్చువల్‌గా ఈ సదస్సుని నిర్వహించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, సెప్టెంబర్ 24న క్వాడ్ (Quadrilateral Security Dialogue-Quad) సదస్సు నిర్వహణ
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : అఫ్గాన్ సంక్షోభం, కోవిడ్ మహమ్మారి, స్వేచ్ఛాయుత ఇండో ఫసిఫిక్ విధానంపై చర్చలు జరిపేందుకు...
RBI, MAS: ఏ రెండు దేశాల మధ్య నగదు బదిలీ వ్యవస్థను అనుసంధానం చేయనున్నారు?
తక్షణ నగదు బదిలీ సర్వీసులకు సంబంధించి తమ తమ దేశాల్లో అమలు చేస్తున్న వ్యవస్థలను అనుసంధానం చేయాలని భారత్, సింగపూర్ నిర్ణయించాయి. ఇందులో భాగంగా భారత్‌లో అమలవుతున్న ఏకీకృత పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), సింగపూర్‌లోని పేనౌ వ్యవస్థలను అనుసంధానం చేయనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఏఎస్) ఈ ప్రాజెక్టును ప్రకటించాయి. 2022 జులై నాటికి ఈ రెండింటి లింకేజీ అమల్లోకి రాగలదని ఆర్‌బీఐ సెప్టెంబర్ 15న తెలిపింది. భారత్, సింగపూర్ మధ్య సీమాంతర చెల్లింపులకు అవసరమైన మౌలికసదుపాయాల అభివృద్ధిలో యూపీఐ–పేనౌ లింకేజీ కీలక మైలురాయి కాగలదని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, సింగపూర్ దేశాల్లో అమలు చేస్తున్న వ్యవస్థలను అనుసంధానం చేయాలని నిర్ణయం
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఏఎస్)
ఎందుకు : భారత్, సింగపూర్ మధ్య సీమాంతర చెల్లింపులకు అవసరమైన మౌలికసదుపాయాల అభివృద్ధిలో భాగంగా...
Foreign direct investment: భారత్‌కు రూ. 588 లక్షల కోట్ల ఎఫ్‌డీఏలు అవసరం: డెలాయిట్
భారత్ ఆర్థిక వ్యవస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి 5 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.368 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి 8 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.588 లక్షల కోట్లు) తాజా గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడులు అవసరమని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– డెలాయిట్ విశ్లేషించింది. ఈ మేరకు సెప్టెంబర్ 14 ఒక నివేదికను విడుదల చేసింది. అమెరికా, బ్రిటన్, జపాన్, సింగపూర్‌లలోని బహుళజాతి కంపెనీలకు చెందిన 1,200 మంది వ్యాపార వేత్తల అభిప్రాయాల ప్రాతిపదికన ఈ సర్వే అధ్యయనం రూపొందింది.
గ్రీన్‌పీల్డ్ పెట్టుబడి అంటే..
గ్రీన్‌పీల్డ్ పెట్టుబడి అంటే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)లో ఒక విధానం. ఈ విధానంలో ఒక పేరెంట్ కంపెనీ వివిధ దేశాల్లో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందుకు అనుగుణంగా భారీగా పెట్టుబడులు పెడుతుంది.
నివేదికలోని ముఖ్యాంశాలు...
- కోవిడ్–19 సవాళ్లలోనూ భారత్‌కు భారీగా ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఆశావహ పరిస్థితిని, ఆర్థిక మూలాలకు పటిష్టతను అందించింది.
- 2020–21 ఏడాదిలో దేశంలోకి ఈక్విటీ, రీ–ఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, క్యాపిటల్‌సహా రికార్డు స్థాయిలో 81.72 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌కు 8 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.588 లక్షల కోట్లు) తాజా గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడులు అవసరం
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– డెలాయిట్
ఎందుకు : భారత్ ఆర్థిక వ్యవస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి 5 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.368 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి...
Lasith Malinga: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ బౌలర్?
శ్రీలంక స్టార్ బౌలర్, యార్కర్ కింగ్ లసిత్ మలింగ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికాడు. టెస్టులు, వన్డేల నుంచి గతంలోనే తప్పుకొని టి20ల్లో మాత్రమే కొనసాగుతూ రాగా, ఇప్పుడు పూర్తిగా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 14న మలింగ ప్రకటించాడు. తమ జాతీయ జట్టు తరఫున మలింగ 2020 మార్చిలో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 122 ఐపీఎల్‌లో మ్యాచ్‌లలోనూ ఆడాడు.
కెరీర్ విశేషాలు...
– 2004లో టెస్టు క్రికెట్‌తో అరంగేట్రం.
– అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా ఐదు హ్యాట్రిక్‌లు(వన్డేల్లో 3 హ్యాట్రిక్‌లు, టి20ల్లో 2 హ్యాట్రిక్‌లు) నమోదు.
– అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు (107) తీసిన బౌలర్.
– 2014 టి20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టుకు కెప్టెన్.
– 4 వరుస బంతుల్లో 4 వికెట్లు రెండు సార్లు తీసిన అరుదైన ఘనత.
మ్యాచ్‌లు | వికెట్లు | సగటు | |
టెస్టులు | 30 | 101 | 33.15 |
వన్డేలు | 226 | 338 | 28.87 |
టి20లు | 84 | 107 | 20.79 |
UN World Tourism Awards: భారత్ తరఫున బెస్ట్ విలేజ్ పోటీలో నిలిచిన గ్రామం?
ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) నిర్వహించే బెస్ట్ టూరిజం విలేజ్ పోటీల్లో భారత్ తరఫున తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం భూదాన్‌పోచంపల్లి గ్రామం పోటీపడుతోంది. భూదాన్‌పోచంపల్లితో పాటు మేఘాలయలోని ప్రఖ్యాతిగాంచిన కాంగ్‌థాన్, మధ్యప్రదేశ్‌లోని చారిత్రక గ్రామం లద్‌పురాఖాస్ కూడా పోటీలో నిలిచాయి. ఈ మేరకు భారత ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా గ్రామీణ పర్యాటకాన్ని, అక్కడి ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ప్రపంచ టూరిజం సంస్థ ‘బెస్ట్ టూరిజం విలేజ్’పోటీని నిర్వహిస్తో్తంది.
భూదానోద్యమానికి అంకురార్పణ...
కుటీర పరిశ్రమలు, వ్యవసాయానికి నిలయమైన భూదాన్‌పోచంపల్లికి ఘనమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1951లో మహాత్మాగాంధీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే పోచంపల్లికి రావడం, ఆయన పిలుపు మేరకు వెదిరె రాంచంద్రారెడ్డి హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేయడంతో భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది. దాంతో భూదాన ఖ్యాతితో భూదాన్‌పోచంపల్లిగా మారి ప్రపంచపుటల్లోకెక్కింది.
సిల్క్‌సిటీగా పేరు...
భూదాన్‌పోచంపల్లి చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యాలతో అగ్గిపెట్టెలో పట్టే్ట చీరలు నేసి ఔరా అన్పించారు. ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభతో సిల్క్‌సిటీగా పేరు తెచ్చుకుంది. నాటి నిజాం రాజులతో పాటు అరబ్‌దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న భూదాన్‌పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ తరఫున ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) నిర్వహించే బెస్ట్ టూరిజం విలేజ్ పోటీలో నిలిచిన గ్రామలు?
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : భూదాన్‌పోచంపల్లి(తెలంగాణ), కాంగ్‌థాన్(మేఘాలయ), లద్‌పురాఖాస్(మధ్యప్రదేశ్)
ఎందుకు : ఘనమైన చరిత్ర కలిగి ఉండటం, కుటీర పరిశ్రమలు, వ్యవసాయంతోపాటు మరిన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నందున...
Statue of Equality: భగవద్రామానుజుల విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
2021, ఫిబ్రవరిలో హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరగబోయే 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆహ్వానాన్ని అందజేశారు. సెప్టెంబర్ 14న రాష్ట్రపతిభవన్‌లో కోవింద్‌ను కలిసిన ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకావాలని కోరారు.
రూ.వెయ్యి కోట్ల అంచనాతో...
శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్దిని పురష్కరించుకుని సమతామూర్తి రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 1,100 టన్నుల బరువు ఉండే 216 అడుగుల పంచలోహ విగ్రహంతోపాటు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.వెయ్యి కోట్ల అంచనాతో స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. 2014లో ఈ పనులకు చినజీయర్ స్వామి భూమిపూజ చేశారు. నిత్యం పూజలు అందుకునేవిధంగా 120 కిలోల బంగారంతో మరో విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు 2022, ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు ఆహ్వాన పత్రికలు అందజేత...
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి
ఎక్కడ : ముచ్చింతల్, శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా
ఎందుకు : భగవద్రామానుజుల విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని...
Hindi Diwas 2021: హిందీని అధికార భాషగా ఎప్పుడు ప్రకటించారు?
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ భాషలకు హిందీ స్నేహపూర్వకమైన భాష అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. భారత్‌లోని అన్ని ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాల్సిన అవసరముందని చెప్పారు. సెప్టెంబర్ 14న ఢిల్లీలో నిర్వహించిన ‘హిందీ దివస్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 1949 సెప్టెంబర్ 14న భారత్ హిందీని అధికార భాషగా ప్రకటించింది. ప్రముఖ కవి బెయోహర్ రాజేంద్ర సింహా 50వ పుట్టినరోజున(1949 సెప్టెంబర్ 14) హిందీని అధికారిక భాషగా స్వీకరించడం జరిగింది.
చింతన్ శివిర్
కేంద్ర మంత్రులతో సెప్టెంబర్ 14న ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్‌లోని ఆడిటోరియంలో చింతన్ శివిర్ పేరిట జరిగిన ఈ సమావేశంలో నిరాడంబరత ప్రాధాన్యాన్ని మోదీ వివరించారు.
పోస్టల్ కవర్‌పై బొబ్బిలి వీణ
ప్రఖ్యాతి చెందిన బొబ్బిలి వీణ చిత్రంతో తపాలా శాఖ ప్రత్యేక కవరును ముద్రించింది. దీనిని విజయనగరం జిల్లా బొబ్బిలిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ పాముల పుష్పశ్రీవాణి ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హిందీ దివస్ కార్యక్రమంలో ప్రసంగం
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : హిందీ దివస్(హిందీ దినోత్సవం) సందర్భంగా...
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్ 14 కరెంట్ అఫైర్స్