Daily Current Affairs in Telugu: సెప్టెంబర్ 14 కరెంట్ అఫైర్స్
North Korea: ఇటీవల క్రూయిజ్ క్షిపణి పరీక్షలు నిర్వహించిన ఆసియా దేశం?
సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే క్రూయిజ్ క్షిపణి పరీక్షలు ఉత్తర కొరియా విజయవంతంగా నిర్వహించింది. సెప్టెంబర్ 11, 12వ తేదీల్లో వరుసగా రెండు రోజులు నిర్వహించిన ఈ క్షిపణి పరీక్షలు విజయవంతమైనట్టుగా ఆ దేశ అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సెప్టెంబర్ 13న వెల్లడించింది. అమెరికాతో అణు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ ఉత్తర కొరియా తమ ఆయుధ సత్తాను ప్రపంచ దేశాలకు చాటాలన్న ఉద్దేశంతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ కొత్త క్షిపణి 1,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదు. ఉ.కొరియాపై శత్రువులు ఎవరైనా దాడి చేస్తే దానిని గుర్తించి సమర్థంగా తిప్పికొట్టి రక్షణని కల్పించే సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాల తయారీపై అంతర్జాతీయంగా ఉత్తరకొరియాపై ఆంక్షలున్నాయి. కానీ క్రూయిజ్ క్షిపణులపై ఎలాంటి ఆంక్షలు లేవు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే క్రూయిజ్ క్షిపణి పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన దేశం?
ఎప్పుడు : సెప్టెంబర్ 11, 12
ఎవరు : ఉత్తర కొరియా
ఎక్కడ : ఉత్తర కొరియా
ఎందుకు : రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు...
Oscar Fernandes: మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ ఫెర్నాండెజ్ అస్తమయం
కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ కేంద్ర మంత్రి, రాజ్య సభ ఎంపీ ఆస్కార్ ఫెర్నాండెజ్(80) కన్నుమూశారు. 2021, జూలై నెలలో ఆయన నివాసంలో వ్యాయామం చేస్తుండగా కింద పడటంతో తలకు గాయమై మెదడులో రక్తం గడ్డకట్టింది. దీనికి సంబంధించి చికిత్స పొందుతూ సెప్టెంబర్ 13న మంగళూరులోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 50 ఏళ్ల రాజకీయ జీవితం గడిపిన ఫెర్నాండెజ్ కర్ణాటకలోని ఉడుపి నియోజకవర్గం నుంచి తొలిసారిగా 1980లో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాతా వరసగా నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నియ్యారు. రాజ్యసభకు తొలిసారిగా 1998లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత మూడు సార్లు ఎన్నికయ్యారు. 2006 నుంచి 2009 వరకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ఆస్కార్ ఫెర్నాండెజ్(80)
ఎక్కడ : మంగళూరు, కర్ణాటక
ఎందుకు : వ్యాయామం చేస్తుండగా కింద పడటంతో తలకు తగిలిన గాయం కారణంగా...
United Nations: ప్రస్తుతం ఐరాస ప్రధాన కార్యదర్శి పదవిలో ఎవరు ఉన్నారు?
తాలిబన్ల వశమైన అఫ్గానిస్తాన్‌ను ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించాల్సిందిగా సెప్టెంబర్ 13న ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితి(ఐరాస) కోరింది. 2021, డిసెంబర్ వరకు అఫ్గాన్ ప్రజల కష్టాలు తీర్చేందుకు 60.6 కోట్ల డాలర్లు (దాదాపు రూ.4,463 కోట్లు) సాయం చేసి ప్రపంచ దేశాలు తమ మానవతా దృక్పథాన్ని మరోసారి చాటాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ హితవు పలికారు. సెప్టెంబర్ 13న స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవాలో జరిగిన విరాళాల సేకరణ సదస్సులో ఆయన మాట్లాడారు. అఫ్గాన్ పేదలకు సాయపడాలన్నారు. ఐక్యరాజ్య సమితి అత్యవసర విభాగం తరఫున 2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు సదస్సులో గుటెర్రస్ ప్రకటించారు. ఐరాసకి చెందిన యూఎన్ హై కమీషనర్ ఫర్ రెప్యూజీస్ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తాలిబన్ల వశమైన అఫ్గానిస్తాన్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం అందించాలి
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్
ఎక్కడ : విరాళాల సేకరణ సదస్సు, జెనీవా, స్విట్జర్‌ల్యాండ్
ఎందుకు : అఫ్గాన్ ప్రజల కష్టాలు తీర్చేందుకు...
Pakistan Cricket Board: పీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన మాజీ కెప్టెన్?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్‌గా పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రమీజ్ రాజా సెప్టెంబర్ 13న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు ఆయన పదవీకాలంలో ఉంటారు. ఎహ్‌సాన్ మని గత నెలలో పీసీబీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త చైర్మన్‌ను ఎన్నుకున్నారు. 1992 వన్డే వరల్డ్‌కప్ విజేత పాక్ జట్టు సభ్యుడైన రమీజ్ 2003–2004 వరకు పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు.
కోచ్‌లుగా హేడెన్, ఫిలాండర్...
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్‌లుగా ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ మ్యాథ్యూ హేడెన్, దక్షిణాఫ్రికా మాజీ పేసర్ ఫిలాండర్‌లను నియమిస్తున్నట్లు పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా సెప్టెంబర్ 13న ప్రకటించారు. వచ్చే నెలలో టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో వీరిద్దరినీ తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాక్ జట్టు కోచ్‌లుగా వీరు ఎప్పటి వరకు కొనసాగుతారనే విషయంపై రమీజ్ స్పష్టతనివ్వలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్‌గా ఎన్నికైన మాజీ కెప్టెన్?
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : రమీజ్ రాజా
ఎక్కడ : పాకిస్తాన్
ఎందుకు : ఎహ్‌సాన్ మని గత నెలలో పీసీబీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో...
Daniil Medvedev: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ చాంపియన్?
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్ని–2021 పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) చాంపియన్‌గా అవతరించాడు. అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 13న జరిగిన ఫైనల్లో మెద్వెదెవ్ 6–4, 6–4, 6–4తో వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్(సెర్బియా)పై విజయం సాధించి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో రష్యా తరఫున గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన మూడో ఆటగాడిగా మెద్వెదెవ్ నిలిచాడు. చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్‌కు 25 లక్షల డాలర్లు (రూ. 18 కోట్ల 37 లక్షలు)... రన్నరప్ జొకోవిచ్‌కు 12 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
2021లో మూడు గ్రాండ్‌స్లామ్‌లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌ను జొకోవిచ్ కైవసం చేసుకున్న విషయం విదితమే. తాజా ఫలితంతో ఒకే ఏడాది తొలి మూడు గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్) టైటిల్స్ గెలిచి చివరిదైన యూఎస్ ఓపెన్‌లో ఓడిపోయిన మూడో ప్లేయర్‌గా జొకోవిచ్ తన పేరు నమోదు చేసుకున్నాడు. గతంలో జాక్ క్రాఫోర్డ్ (1933లో), లె హోడ్ (1956లో)లకు ఇలాంటి ఫలితం ఎదురైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ చాంపియన్?
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : డానిల్ మెద్వెదెవ్ (రష్యా)
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఎందుకు : ఫైనల్లో మెద్వెదెవ్ 6–4, 6–4, 6–4తో వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌పై విజయం సాధించినందున...
Anti NEET Bill 2021: నీట్ పరీక్ష నుంచి మినహాయించాలని ప్రత్యేక బిల్లును ఆమోదించిన రాష్ట్రం?
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం రాసే నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) పరీక్ష నుంచి తమిళనాడుని మినహాయిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ యాంటీ నీట్ బిల్లు –2021ని ఆమోదించింది. సామాజిక న్యాయం జరగాలంటే ఈ బిల్లుకి మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సభ్యుల్ని అభ్యర్థించారు. కేంద్ర చట్టాలకు విరుద్ధంగా ఉన్నందువల్ల రాష్ట్రపతి ఆమోదముద్ర పడితేనే ఈ బిల్లు అమలులోకి వస్తుంది. ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో అడ్మిషన్లు విద్యార్థుల పన్నెండో తరగతి మార్కుల ఆధారంగా ఉంటాయని బిల్లు స్పష్టం చేసింది. నీట్ పరీక్ష రాస్తే ఫలితాలు ఎలా వస్తాయో అన్న భయంతో ఇటీవల తమిళనాడులో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
గుజరాత్ నూనత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మేల్యే?
గుజరాత్ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్(59) బాధ్యతలు చేపట్టారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో సెప్టెంబర్ 13న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ భూపేంద్రతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యాంటీ నీట్ బిల్లు –2021కి ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ
ఎందుకు : నీట్ పరీక్షతో దేశవ్యాప్తంగా విద్యార్థులకి సమన్యాయం జరగడం లేదని...
UNICEF: రాష్ట్ర సచివాలయ వ్యవస్థతో కలిసి పనిచేస్తోన్న ఐరాస అనుబంధ సంస్థ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో కలిసి పనిచేసేందుకు ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి (యునిసెఫ్) ముందుకొచ్చింది. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒక్కొక్క ప్రతినిధిని యునిసెఫ్ నియమించింది. వీరు ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ (డెవలప్‌మెంట్) కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మరో ముగ్గురు యునిసెఫ్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక సెల్ పనిచేస్తుంది. 2021, జూన్ నుంచి ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ఆసరాగా చేసుకుని రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో సైతం మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు యునిసెఫ్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. యునిసెఫ్ జిల్లా స్థాయిలో తమ ప్రతినిధుల నియమించటం ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి.
పిల్లలకు పౌష్టికాహారం, విద్య, వైద్యం వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేవలు కల్పించడం లక్ష్యంగా యునిసెఫ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. యునిసెఫ్(United Nations Children’s Fund-UNICEF) ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ వ్యవస్థతో కలిసి పనిచేస్తోన్న ఐరాస అనుబంధ సంస్థ?
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి (యునిసెఫ్)
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా...
ఎందుకు : రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో సైతం మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు...
Indian Coast Guard Ship: అధునాతన నౌక ఐసీజీఎస్ విగ్రహను తయారు చేసిన సంస్థ?
భారతతీర గస్తీ దళం అమ్ముల పొదిలో చేరిన అధునాతన నౌక ‘‘ఐసీజీఎస్ విగ్రహ’’ విశాఖ కేంద్రంగా సేవలందించేందుకు సిద్ధమైంది. అడ్వాన్స్‌డ్ ఫైర్ పవర్‌తో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విగ్రహ నౌకని 2021, ఆగస్టు 28న చెన్నైలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేశారు. అనంతరం కోస్ట్‌గార్డు ఈస్ట్రన్ సీబోర్డు ప్రధాన స్థావరమైన విశాఖ నుంచి కార్యకలాపాలు నిర్వర్తించేందుకు సెప్టెంబర్ 10న విశాఖకు చేరుకుంది.
ఐసీజీఎస్ విగ్రహ విశేషాలు...
- ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్ సిరీస్‌లో ఏడో నౌక అయిన దీనిని చెన్నైలోని ఎల్ అండ్ టీ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ సంస్థ తయారుచేసింది.
- 98 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల డ్రాట్, 2,200 టన్నుల బరువుతో తయారైంది.
- 9,100 కిలోవాట్స్ డీజిల్ సామర్థ్యం ఉన్న రెండు ఇంజిన్లతో 26 నాటికల్ మైళ్ల వేగంతో 5 వేల కి.మీ ప్రయాణించగల సామర్థ్యం విగ్రహ సొంతం.
- అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ రాడార్లు, నేవిగేషన్, కమ్యూనికేషన్ పరికరాలు, సెన్సార్లు, సముద్ర స్థితిగతులకు అనుగుణంగా దిశ మార్చుకునే యంత్ర సామర్థ్యంతో దీనిని రూపొందించారు.
- రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడేలా ఒక ట్విన్ ఇంజిన్ హెలికాఫ్టర్, నాలుగు హైస్పీడ్ బోట్లను తీసుకెళ్లగలదు.
- షిప్‌లో 12 మంది అధికారులు, 90 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. తొలి కమాండెంట్‌గా పీఎన్ అనూప్‌కు బాధ్యతలు అప్పగించారు.
- ఐసీజీఎస్ విగ్రహ చేరికతో కోస్ట్‌గార్డ్ జాబితాలో 157 నౌకలు, 66 విమానాలున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విశాఖ తీరానికి చేరుకున్న అధునాతన నౌక?
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : ఐసీజీఎస్ విగ్రహ
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : విశాఖ నుంచి కార్యకలాపాలు నిర్వర్తించేందుకు...
Medicine from the Sky: దేశంలో తొలిసారిగా ఆకాశమార్గం ద్వారా వ్యాక్సిన్‌ను ఎక్కడ సరఫరా చేశారు?
వికారాబాద్ ఎస్పీ కార్యాలయం పరెడ్ గ్రౌండ్‌లో సెప్టెంబర్ 11న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిలతో కలసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’కార్యక్రమాన్ని ప్రారంభించారు. మారుత్, టెక్ ఈగల్, బ్లూ డార్ట్ కంపెనీ కంపెనీలకు చెందిన మూడు డ్రోన్ల ద్వారా ఆకాశమార్గాన వ్యాక్సిన్ సరఫరా కార్యక్రమాన్ని దేశంలోనే మొదటిసారి వికారాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. వైద్యులకు సహకారం అందించటంలో భవిష్యత్తులో డ్రోన్ల వ్యవస్థ ఎంతో ఉపయుక్తం కానుందని మంత్రి సింధియా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మొదటి డ్రోన్...
బ్లూ డార్ట్ కంపెనీ రూపొందించిన స్కై ఎయిర్ డ్రోన్. ఇది కిలో బరువునే మోసుకెళ్లగలదు. ఇది 40 కిలో మీటర్ల దూరం వరకు ఆకాశమార్గాన ప్రయాణించగలదు. ఇది వికారాబాద్ పట్టణంలోని సీహెచ్‌సీ ఆస్పత్రికి చేరుకోగా, ఇందులో ఉన్న ఒక వ్యాక్సిన్‌ను సిబ్బంది రిసీవ్ చేసుకున్నారు.
రెండో డ్రోన్...
టెక్ ఈగల్స్ కంపెనీ రూపొందించిన క్యూరీస్ ఫ్లై. దీని సామర్థ్యం కూడా ఒక కిలో కాగా ఇది కూడా 40 కిలో మీటర్ల దూరం వరకు ఎగరగలదు. ఈ డ్రోన్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ పీహెచ్‌సీకి చేరుకుంది. దీన్ని కేవలం ట్రయల్ చేసి చూశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో తొలిసారిగా ఆకాశమార్గం ద్వారా వ్యాక్సిన్ సరఫరా ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
ఎక్కడ : వికారాబాద్, వికారాబాద్ జిల్లా, తెలంగాణ
ఎందుకు : వైద్యరంగంలో సేవలు అందించేందుకు...
Andhra Pradesh Chief Secretary: ఏపీ తదుపరి సీఎస్‌గా నియమితులు కానున్న అధికారి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా డా.సమీర్ శర్మ నియమితులు కానున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ సెప్టెంబర్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ 2021, సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తదుపరి సీఎస్‌గా డా.సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఈయన రాష్ట్ర ప్రణాళిక, రిసోర్స్ మొబిలైజేషన్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
2020–21లో దేశీయ ఎగుమతుల్లో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం?
2019–20లో దేశీయ ఎగుమతుల్లో ఏడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఎగుమతులను ప్రోత్సహించడంతో 2020–21లో నాలుగో స్థానానికి చేరుకుంది. మొత్తం దేశ ఎగుమతుల్లో 21 శాతం వాటాతో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, 20 శాతంతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 9 శాతంతో తమిళనాడు, 6 శాతంతో ఆంధ్రప్రదేశ్.. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ఏపీ తదుపరి సీఎస్‌గా నియమితులు కానున్న అధికారి?
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : డా.సమీర్ శర్మ
ఎందుకు : ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ 2021, సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనుండటంతో...
చదవండి: Daily Current Affairs in Telugu: సెప్టెంబర్ 13 కరెంట్ అఫైర్స్