Skip to main content

Daily Current Affairs in Telugu: సెప్టెంబర్‌ 13 కరెంట్‌ అఫైర్స్‌

PM Modi

Sardardham Bhavan: విద్యార్థుల కోసం సర్దార్‌ధామ్‌ భవన్‌ను ఏ నగరంలో నిర్మించారు?

విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు వసతి కల్పించేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన సర్దార్‌ధామ్‌ భవన్‌ ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 11న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ భవన్‌ను ప్రారంభించారు. అనంతరం బాలికల హాస్టల్‌ అయిన సర్దార్‌ధామ్‌ ఫేజ్‌–2 కన్యా ఛత్రాలయ నిర్మాణానికి మోదీ భూమిపూజ చేశారు. సర్దార్‌ధామ్‌ భవన్‌ను రూ.200 కోట్లతో విశ్వ పాటిదార్‌ సమాజ్‌ నిర్మించింది.

బీహెచ్‌యూలో తమిళ పీఠం...
తమిళ భాష అధ్యయనానికి బనారస్‌ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)లోని ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక పీఠాన్ని నెలకొల్పుతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పీఠాన్ని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతికి ఆయన వర్ధంతి(సెప్టెంబర్‌ 12) సందర్భంగా అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఏక్‌ భారత్‌.. శ్రేష్ట భారత్‌ అనే భావనను సర్దార్‌ పటేల్‌ ముందుకు తెచ్చారని, మహాకవి సుబ్రహ్మణ్య భారతి సాగించిన తమిళ రచనల్లోనూ ఇదే భావన స్పష్టంగా ప్రతిఫలించిందని పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : విశ్వ పాటిదార్‌ సమాజ్‌ నిర్మించిన సర్దార్‌ధామ్‌ భవన్‌ ప్రారంభం 
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 11 
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : అహ్మదాబాద్, గుజరాత్‌
ఎందుకు  : విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు వసతి కల్పించేందుకు...


Pinnacle Blooms Network: ఢిల్లీలో బుద్ధిమాంద్యం థెరపీ కేంద్రాన్ని ప్రారంభించిన సంస్థ?

Dementia

 

బుద్ధిమాద్యంతో బాధపడుతున్న చిన్నారులు సమాజంలో ఇతరులతో సమానంగా జీవించగలిగేలా తీర్చిదిద్దేందుకు ఢిల్లీలోని సౌత్‌ ఎక్స్‌లో బుద్ధిమాంద్యం థెరపీ కేంద్రం ప్రారంభమైంది. పినాకిల్‌ బ్లూమ్స్‌ నెట్‌వర్క్‌ సంస్థ ఈ కేంద్రాన్ని ప్రారంభించింది. 230కి పైగా దేశాల్లో నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 80 కోట్లమంది పైగా చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలే లక్ష్యంగా తమ నెట్వర్క్‌ ఈ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని పినాకిల్‌ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌. కోటిరెడ్డి సరిపల్లి తెలిపారు. పినాకిల్‌ నెట్వర్క్‌ ఆటిజం బాధితుల కోసం దేశవ్యాప్తంగా నేషనల్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 9100181181ను అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి 60 మంది చిన్నారులు ఒకరు బుద్ధిమాంద్యం బాధితులని, ఈ రోగం 104 ఏళ్ల కిందటే వెలుగులోకి వచ్చిందన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : బుద్ధిమాంద్యం థెరపీ కేంద్రం ప్రారంభం 
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 11 
ఎవరు    : పినాకిల్‌ బ్లూమ్స్‌ నెట్‌వర్క్‌ సంస్థ 
ఎక్కడ    : సౌత్‌ ఎక్స్, ఢిల్లీ
ఎందుకు  : బుద్ధిమాద్యంతో బాధపడుతున్న చిన్నారులు సమాజంలో ఇతరులతో సమానంగా జీవించగలిగేలా తీర్చిదిద్దేందుకు...


2+2 Ministerial Dialogue: ఇండో– ఆసిస్‌ 2+2 చర్చలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?

2+2 Ministerial Dialogue

 

భారత్, ఆస్ట్రేలియా మధ్య 2+2 చర్చలు సెప్టెంబర్‌ 11న భారత రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. రెండు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య జరిగే చర్చలనే 2+2చర్చలు అంటారు. ఈ చర్చల్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణమంత్రి రాజ్‌నాధ్‌ సింగ్, ఆసిస్‌ విదేశాంగ మంత్రి మారైజ్‌పేనీ, రక్షణమంత్రి పీటర్‌ డట్టన్‌ పాల్గొన్నారు. అఫ్గాన్‌ నేలను ఉగ్రచర్యలుకు వాడకుండా చూడాలని, ఆదేశాన్ని ఉగ్రవాదులకు స్వర్గంగా మార్చవద్దని ఇరుదేశాల నేతలు అభిప్రాయపడ్డారు. ఐరాస తీర్మానం 2593ను (అఫ్గన్‌ గడ్డను ఉగ్ర అడ్డగా మార్చకూడదు) అమలు చేయాలని అంగీకరించారు. కరోనాపై ఉమ్మడి పోరును కొనసాగించాలని నిర్ణయించారు. 2+2 చర్చలు ఫలవంతగా సాగాయని మంత్రి జైశంకర్‌ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఉద్రిక్తతలు, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరగడం, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతిని కాపాడటం వంటి అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఇండో– ఆసిస్‌ 2+2 చర్చలు ప్రారంభం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 11 
ఎవరు    : భారత విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణమంత్రి రాజ్‌నాధ్‌ సింగ్, ఆసిస్‌ విదేశాంగ మంత్రి మారైజ్‌పేనీ, రక్షణమంత్రి పీటర్‌ డట్టన్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు  : అఫ్గాన్‌లోని తాజా పరిస్థితులు,  ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతిని కాపాడటం వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు...


BJP MLA Bhupendra Patel: గుజరాత్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేత?

Bhupendra Patel

గుజరాత్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్‌(59) ఎన్నికయ్యారు. సెప్టెంబర్‌ 12న గుజరాత్‌ రాజధాని నగరం గాంధీనగర్‌లో సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 112 మంది బీజేపీ సభ్యులున్నారు. తదుపరి సీఎంగా భూపేంద్ర పేరును సెప్టెంబర్‌ 11న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విజయ్‌ రూపానీ ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. భూపేంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా సెప్టెంబర్‌ 13న ప్రమాణం చేయనున్నారు.

భూపేంద్ర రజనీకాంత్‌ భాయి పటేల్‌...
1962, జూలై 15న జన్మించిన భూపేంద్ర పటేల్‌ పూర్తిపేరు భూపేంద్ర రజనీకాంత్‌ భాయి పటేల్‌. అహ్మదాబాద్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేసిన ఆయన 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్లోడియా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. భూపేంద్ర ఎమ్మెల్యేగా నెగ్గడం ఇదే మొదటిసారి. మంత్రిగా పని చేయకుండానే సీఎం పదవిని చేపట్టబోతున్నారు.

వార్డు కౌన్సిలర్‌గానూ...
1999 నుంచి 2000 దాకా మేమ్‌నగర్‌ నగర పాలిక అధ్యక్షుడిగా పనిచేసిన భూపేంద్ర... 2008 నుంచి 2010 దాకా అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్కూల్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. 2010 నుంచి 2015 వరకూ అహ్మదాబాద్‌లోని థాల్టెజ్‌ వార్డు కౌన్సిలర్‌గానూ పనిచేశారు. అహ్మద్‌బాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా, అహ్మదాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా సేవలందించారు. పాటిదార్‌ సంస్థలైన సర్దార్‌ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్‌ ట్రస్టీగా కూడా పనిచేస్తున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
గుజరాత్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేత?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 12
ఎవరు    : భూపేంద్ర రజనీకాంత్‌ భాయి పటేల్‌ 
ఎందుకు   : గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి విజయ్‌ రూపానీ రాజీనామా చేసిన నేపథ్యంలో...


National Company Law Tribunal: ఎన్‌సీఎల్‌టీ సభ్యుల పదవీకాలం ఎన్ని సంవత్సరాలు?

NCLT logo

ట్రిబ్యునళ్లలో నియామకాల ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), ఆదాయ పన్ను అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఐటీఏటీ), అర్మ్‌డ్‌ పోర్సెస్‌ ట్రిబ్యునల్‌ (ఏఎఫ్‌టీ)ల్లో ఖాళీలు భర్తీ చేస్తూ సెప్టెంబర్‌ 12న నోటిఫికేషన్లు జారీ చేసింది. 2021, ఆగస్టు 13వ తేదీలోగా  ట్రిబ్యునళ్లలో కొన్ని నియామకాలైన చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఖాళీల భర్తీని కేంద్రం చేపట్టింది. వివిధ ట్రిబ్యునళ్లలో దాదాపు 250 దాకా ఖాళీలు ఉన్నాయి.

ఎన్‌సీఎల్‌టీ: ఎనిమిది మంది జ్యుడీషియల్, 10 మంది సాంకేతిక సభ్యుల్ని కేంద్రం నియమించింది. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజని, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ప్రదీప్‌ నరహరి దేశ్‌ముఖ్, మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.రామతిలగం, పంజాబ్‌ హరియాణా హైకోర్టు విశ్రాంత రిజిస్ట్రార్‌ జనరల్‌ హర్నామ్‌ సింగ్‌ ఠాకూర్, పి.మోహన్‌రాజ్, రోహిత్‌ కపూర్, జస్టిస్‌ దీప్‌ చంద్ర జోషి ఎన్‌సీఎల్‌టీలో జ్యుడీషియల్‌ సభ్యులు. వీరంతా ఐదేళ్ల పదవీకాలం, 65 ఏళ్ల వయసు.. ఏది ముందు ముగిస్తే అప్పటి వరకూ కొనసాగుతారు.

ఐటీఏటీ: జ్యుడీషియల్‌ సభ్యులుగా అన్‌రిజర్వు కేటగిరీలో అడ్వొకేట్‌ సంజయ్‌ శర్మ, అడ్వొకేట్‌ ఎస్‌.సీతాలక్ష్మి , అదనపు జిల్లా, సెషన్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.గోయెల్, జస్టిస్‌ అనుభవ్‌ శర్మ. ఓబీసీ కేటగిరీలో అడ్వొకేట్‌ టీఆర్‌ సెంథిల్‌కుమార్, ఎస్సీ కేటగిరీలో ఎస్‌బీఐ లా ఆఫీసర్‌ మన్‌మోహన్‌ దాస్‌లను నియమించారు. వీరి పదవీకాలం నాలుగేళ్లు, లేదా 67 ఏళ్లు..  ఏది ముందుగా ముగిస్తే అప్పటి వరకూ ఉంటుంది.

ఏఎఫ్‌టీ: ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ట్రిబ్యునల్‌లో ఆరుగురు జ్యుడీషియల్‌ సభ్యుల్ని కేంద్రం నియమించింది. జస్టిస్‌ బాలకృష్ణ నారాయణ, జస్టిస్‌ శశికాంత్‌ గుప్తా, జస్టిస్‌ రాజీవ్‌ నారాయణ్‌ రైనా, జస్టిస్‌ కె.హరిలాల్, జస్టిస్‌ ధరమ్‌చంద్ర చౌదరి, జస్టిస్‌ అంజనా మిశ్రాలను నియమించింది. వీరి పదవీ కాలం నాలుగు సంవత్సరాలు, 67 ఏళ్లు ఏది ముందుగా ముగిస్తే అప్పటి వరకూ ఉంటుంది. ఢిల్లీ, చండీగఢ్, లక్నోల్లో ఏఎఫ్‌టీ నాలుగు బెంచ్‌లు ఉన్నాయి. ఆయా ట్రిబ్యునళ్లలో 19 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఎన్‌సీఎల్‌టీ, ఐటీఏటీ, ఏఎఫ్‌టీల్లో ఖాళీలు భర్తీ చేస్తూ నోటిఫికేషన్లు జారీ 
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 12
ఎవరు    : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు   : భారత సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో...


Aam Aadmi Party: ఆప్‌ జాతీయ కన్వీనర్‌గా ఎన్నికైన ముఖ్యమంత్రి?

Arvind Kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)జాతీయ కన్వీనర్‌గా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. సెప్టెంబర్‌ 12న వర్చువల్‌గా నిర్వహించిన పార్టీ జాతీయ కార్యనిర్వహక సమావేశంలో కేజ్రీవాల్‌ను జాతీయ కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. అలాగే ఆప్‌ జాతీయ కార్యదర్శిగా పంకజ్‌ గుప్తా, జాతీయ కోశాధికారిగా ఎన్‌.డి.గుప్తా ఎన్నికయ్యారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని 2012, నవంబర్‌ 26నలో అరవింద్‌ కేజ్రివాల్‌ స్థాపించారు. ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో కొనసాగుతోంది.

 

అల్‌ జవహిరి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు..
కొద్ది నెలల క్రితమే మరణించాడని భావిస్తున్న అల్‌ కాయిదా చీఫ్‌ అయమాన్‌ అల్‌ జవహిరి తిరిగి ప్రత్యక్షమయ్యాడు. అమెరికాపై అల్‌కాయిదా దాడులు జరిపి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా(11/09) సెప్టెంబర్‌ 11న అల్‌కాయిదా విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన కనిపించాడు. వీడియోలో అయమాన్‌ అల్‌ జవహిరి జెరూసలేం గురించి, జనవరిలో రష్యన్‌ బలగాలపై సిరియాలో జరిగిన దాడుల గురించి, అమెరికా బలగాలు అఫ్గాన్‌ నుంచి వెళ్లిపోవడం గురించి ప్రస్తావించాడు. 2011లో ఒసామాను అమెరికా హతం చేసిన అనంతరం ఈజిప్టుకు చెందిన నేత అయమాన్‌ అల్‌ జవహిరి ఆల్‌కాయిదా చీఫ్‌గా మారాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)జాతీయ కన్వీనర్‌గా ఎన్నికైన ముఖ్యమంత్రి?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 12
ఎవరు    : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ 
ఎందుకు   : పార్టీ కార్యకలాపాల నిర్వహణ కోసం...


Garden Reach Shipbuilders: యుద్ధ నౌకల తయారీకి నావల్‌ గ్రూప్‌తో చేసుకున్న సంస్థ?

GRSE-Naval group Mou

సర్ఫేస్‌ నౌకల తయారీకి అనువైన సాంకేతిక సహకారం కోసం మినీరత్న పీఎస్‌యూ.. గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్, ఇంజినీర్స్‌(జీఆర్‌ఎస్‌ఈ) తాజాగా నావల్‌ గ్రూప్‌ ఫ్రాన్స్‌తో చేతులు కలిపింది. ఈ మేరకు ఒక అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. దీంతో ఎగుమతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాంకేతికతో నౌకల తయారీని చేపట్టేందుకు ఇరుసంస్థలు పరస్పరం సహకరించుకోనున్నాయి. యూరోపియన్‌ నౌకాదళ పరిశ్రమలో లీడర్‌గా నిలుస్తున్న నావల్‌ గ్రూప్‌తో జట్టు కట్టడం ద్వారా గోవిండ్‌ డిజైన్‌ ఆధారిత యుద్ధ నౌకలను జీఆర్‌ఎస్‌ఈ రూపొందించనుంది. దేశ, విదేశీ నౌకాదళాలకు అవసరమయ్యే అత్యున్నత యుద్ధనౌకల తయారీని చేపట్టనుంది. వెరసి దేశ, విదేశీ నావికా దళాల కోసం జీఆర్‌ఎస్‌ఈ 100 యుద్ధ నౌకలను నిర్మించనుంది. 1884లో స్థాపితమైన జీఆర్‌ఎస్‌ఈ ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : నావల్‌ గ్రూప్‌ ఫ్రాన్స్‌తో ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్న సంస్థ?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 12
ఎవరు    : గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్, ఇంజినీర్స్‌(జీఆర్‌ఎస్‌ఈ)
ఎందుకు : సర్ఫేస్‌ నౌకల తయారీకి అనువైన సాంకేతిక సహకారం కోసం...


Emma Raducanu: క్వాలిఫయర్‌ హోదాలో గ్రాండ్‌స్లామ్‌ విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌?

Emma Raducanu

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌–2021లో బ్రిటన్‌ టీనేజర్‌ ఎమ్మా రాడుకాను విజేతగా అవతరించింది. న్యూయార్క్‌లోని ఆర్థర్‌ యాష్‌ స్టేడియంలో సెప్టెంబర్‌ 12న... ఇద్దరు అన్‌సీడెడ్‌ క్రీడాకారిణులు 18 ఏళ్ల ఎమ్మా రాడుకాను, 19 ఏళ్ల లేలా ఫెర్నాండెజ్‌ టైటిల్‌ కోసం తలపడ్డారు. ఫైనల్లో ప్రపంచ 150వ ర్యాంకర్‌ ఎమ్మా రాడుకాను (బ్రిటన్‌) 6–4, 6–3తో ప్రపంచ 73వ ర్యాంకర్‌ లేలా ఫెర్నాండెజ్‌ (కెనడా)పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో టెన్నిస్‌ చరిత్రలో క్వాలిఫయర్‌ హోదాలో గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా అవతరించిన తొలి ప్లేయర్‌గా రాడుకాను చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా 44 ఏళ్ల తర్వాత బ్రిటన్‌ తరఫున గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

చాంపియన్‌గా నిలిచిన రాడుకానుకు 25 లక్షల డాలర్లు (రూ. 18 కోట్ల 37 లక్షలు)... రన్నరప్‌ లేలా ఫెర్నాండెజ్‌కు 12 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

ఎమ్మా రాడుకాను రికార్డులు...

  • ఓపెన్‌ శకంలో (1969 తర్వాత) ఆడిన రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలోనే విజేతగా నిలిచిన తొలి క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను.
  • షరపోవా (2004లో వింబుల్డన్‌; 17 ఏళ్లు) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన పిన్న వయస్కురాలిగా ఎమ్మా రాడుకాను (18 ఏళ్లు) గుర్తింపు పొందింది. 
  • ఓపెన్‌ శకంలో ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచిన 11వ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను. 
  • అన్‌సీడెడ్‌ హోదాలో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన 13వ ప్లేయర్‌ ఎమ్మా రాడుకాను.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌–2021 టైటిల్‌ విజేత
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 12
ఎవరు    : ఎమ్మా రాడుకాను(బ్రిటన్‌)
ఎక్కడ    : ఆర్థర్‌ యాష్‌ స్టేడియం, న్యూయార్క్, అమెరికా 
ఎందుకు   : ఫైనల్లో ఎమ్మా రాడుకాను (బ్రిటన్‌) 6–4, 6–3తో లేలా ఫెర్నాండెజ్‌ (కెనడా)పై విజయం సాధించినందున...


Daniel Ricciardo: ఇటలీ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెక్‌లారెన్‌ డ్రైవర్‌?

Daniel Ricciardo

ఫార్ములావన్‌ (ఎఫ్‌1) రేసు ఇటలీ గ్రాండ్‌ప్రిలో మెక్‌లారెన్‌ డ్రైవర్‌ డానియెల్‌ రికియార్డో చాంపియన్‌గా నిలిచాడు. ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్‌ 12న జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో 53 ల్యాప్‌ల దూరాన్ని రికియార్డో అందరికంటే ముందుగా గంటా 21 నిమిషాల 54.367 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకొని విజేతగా అవతరించాడు. 1.747 సెకన్ల తేడాతో రేసును ముగించిన నోరిస్‌ (మెక్‌లారెన్‌) రెండో స్థానంలో నిలువగా... మూడో స్థానంలో బొటాస్‌ (మెర్సిడెస్‌) నిలిచాడు. 2018 మొనాకో తర్వాత మళ్లీ రికియార్డో ఒక ఎఫ్‌1 రేసులో గెలుపొందడం ఇదే తొలిసారి. అలాగే 2012 బ్రెజిల్‌ గ్రాండ్‌ప్రి తర్వాత మళ్లీ మెక్‌లారెన్‌ జట్టు ఒక ఎఫ్‌1 రేసులో గెలవడం ఇదే మొదటిసారి.

రామ్‌–బాలాజీ జంటకు టైటిల్‌
ఏటీపీ కసీస్‌ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో రామ్‌కుమార్‌ రామనాథన్‌–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) జంట టైటిల్‌ గెలిచింది. ఫ్రాన్స్‌లోని కసీస్‌లో సెప్టెంబర్‌ 11న జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో రామ్‌కుమార్‌–శ్రీరామ్‌ బాలాజీ ద్వయం 6–4, 3–6, 10–6తో హన్స్‌ హచ్‌ వెర్డుగో–మిగుయెల్‌ వరేలా (మెక్సికో) జంటపై విజయం సాధించింది.

శ్రీలంక జట్టు కెప్టెన్‌గా షనక
2021 అక్టోబర్‌లో ఒమన్, యూఏఈలో జరిగే టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే శ్రీలంక క్రికెట్‌ జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన ఈ జట్టుకు దసున్‌ షనక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఇటలీ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెక్‌లారెన్‌ డ్రైవర్‌?
ఎప్పుడు : సెప్టెంబర్‌ 12
ఎవరు    : మెక్‌లారెన్‌ డ్రైవర్‌ డానియెల్‌ రికియార్డో
ఎక్కడ   : మోంజా, ఇటలీ
ఎందుకు : ఇటలీ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో 53 ల్యాప్‌ల దూరాన్ని రికియార్డో అందరికంటే ముందుగా గంటా 21 నిమిషాల 54.367 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచినందున...

 

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: సెప్టెంబర్‌ 11 కరెంట్‌ అఫైర్స్‌

 

Published date : 16 Sep 2021 11:36AM

Photo Stories