Skip to main content

Daily Current Affairs in Telugu: సెప్టెంబర్‌ 11 కరెంట్‌ అఫైర్స్‌

Emergency Landing Strip

Emergency Landing Strip: ఎయిర్‌క్రాఫ్ట్‌ల ల్యాండింగ్‌ కోసం అభివృద్ధి చేసిన తొలి రహదారి?

భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన యుద్ధ విమానం జాతీయ రహదారిపై అత్యవసర ల్యాండింగ్‌ అయ్యింది. యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్‌ కోసం రాజస్తాన్‌లోని బర్మేర్‌ జిల్లాలో జాతీయ రహదారి–925ఏపై సిద్ధం చేసిన సట్టా–గాంధవ్‌ స్ట్రెచ్‌ను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ సెప్టెంబర్‌ 9న లాంఛనంగా ప్రారంభించారు. ఐఏఎఫ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం అభివృద్ధి చేసిన మొట్టమొదటి రహదారి ఇదే. సట్టా–గాంధవ్‌ స్ట్రెచ్‌ను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) 19 నెలల్లో అభివృద్ధి చేసింది.

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌ఎస్‌ బదౌరియాలతో కూడిన సి–130జే యుద్ధ విమానం సట్టా–గాంధవ్‌ స్ట్రెచ్‌పై విజయవంతంగా ల్యాండ్‌ అయ్యింది. భారత వాయుసేన ఈ డ్రిల్‌ను చేపట్టింది. అనంతరం సుఖోయ్‌–30ఎంకేఐ ఫైటర్‌ జెట్, ఏఎన్‌–32 మిలటరీ రవాణా విమానం, ఎంఐ–17వీ5 హెలికాఫ్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌ అయ్యాయి.

రూ.765.52 కోట్లతో...
అత్యవసర ల్యాండింగ్‌ కోసం సట్టా–గాంధవ్‌ మార్గంతోపాటు గగారియా–బఖాసర్‌ మార్గాన్ని రూ.765.52 కోట్లతో అభివృద్ధి చేశారు. అత్యవసర సమయాల్లోనే విమానాల ల్యాండింగ్‌ కోసం ఉపయోగిస్తారు. దీంతోపాటు కుందన్‌పురా, సింఘానియా, బఖాసర్‌లో మూడు హెలిప్యాడ్‌లను నిర్మించారు. తొలిసారిగా 2017 అక్టోబర్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్‌ జెట్లు, రవాణా విమానాలను ప్రయోగాత్మకంగా లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ మార్గంపై అత్యవసర ల్యాండింగ్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో రెండు మార్గాల్లో...
యుద్ధ విమానాలను అత్యవసర పరిస్థితుల్లో క్షేమంగా నేలపైకి దించడానికి వీలుగా కొన్ని జాతీయ రహదారుల్లో మార్పులు చేస్తున్నట్లు మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు–ఒంగోలు, ఒంగోలు–చిలకలూరిపేట మార్గాలను ఈ దిశగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. రోడ్లపై అత్యవసర ల్యాండింగ్‌ సౌకర్యం యుద్ధ సమయాల్లోనే కాకుండా విపత్తుల సమయంలోనూ ఉపకరిస్తుందని మంత్రి రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎయిర్‌క్రాఫ్ట్‌ల ల్యాండింగ్‌ కోసం అభివృద్ధి చేసిన తొలి రహదారి ప్రారంభం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 9
ఎవరు    : కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌ గడ్కరీ, గజేంద్రసింగ్‌ షెకావత్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌ఎస్‌ బదౌరియా
ఎక్కడ    : సట్టా–గాంధవ్‌ స్ట్రెచ్, జాతీయ రహదారి–925ఏ, బర్మేర్‌ జిల్లా, రాజస్తాన్‌
ఎందుకు    : యుద్ధ విమానాలను అత్యవసర పరిస్థితుల్లో క్షేమంగా నేలపైకి దించడానికి వీలుగా...


13th Brics Summit: 2021 ఏడాది జరిగిన బ్రిక్స్‌ దేశాల 13వ సదస్సు థీమ్‌ ఏమిటీ? 

Brics summit 2021

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బ్రిక్స్‌ దేశాల 13వ సదస్సు జరిగింది. సెప్టెంబర్‌ 9న ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, చైనా అధ్యక్షుడు జింన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్‌ రమఫోసా, బ్రెజిల్‌ అధినేత బోల్సనారో పాల్గొన్నారు. అఫ్గాన్‌లో పరిస్థితులతో పాటు ఇతర కీలక పరిణామాలపై బ్రిక్స్‌ దేశాధినేతలు విస్రృత చర్చలు జరిపారు. ఇతరదేశాలపై ఉగ్రదాడులు చేసేందుకు అఫ్గాన్‌ భూభాగం ఉపయోగపడకుండా నిరోధించాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

డిక్లరేషన్‌ విడుదల...
బ్రిక్స్‌ సదస్సు చివరలో అన్ని దేశాలు కలిసి ఉమ్మడి డిక్లరేషన్‌ విడుదల చేశాయి. అఫ్గాన్‌లో పరిస్థితులు శాంతియుతంగా ముగియాలని డిక్లరేషన్‌లో కోరాయి. ఐరాస నిబంధనల మేరకు రూపొందించి సీసీఐటీ అమలు చేయాలని కోరాయి. బ్రిక్స్‌ దేశాల భద్రతా సంస్థలు రూపొందించిన కౌంటర్‌ టెర్రరిజం యాక్షన్‌ ప్లాన్‌ను సభ్యదేశాలు ఆమోదించాయి.

జలవనరుల మంత్రుల తొలి సమావేశం...
బ్రిక్స్‌ దేశాలు రూపొందించుకున్న కౌంటర్‌ టెర్రరిజం యాక్షన్‌ ప్లాన్‌కు ఆమోదం లభించిందని ప్రధాని మోదీ చెప్పారు. ఐదు దేశాల కస్టమ్స్‌ శాఖల మధ్య సమన్వయం పెరగడంతో బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్యం సులభతరంమవుతోందన్నారు. తాజా సమావేశం బ్రిక్స్‌ చరిత్రలో తొలి డిజిటల్‌ సదస్సని గుర్తు చేశారు. 2021, నవంబర్‌లో బ్రిక్స్‌ దేశాల జలవనరుల మంత్రుల తొలి సమావేశం జరుగుతుందని చెప్పారు. బ్రిక్స్‌ చైర్మన్‌గా ప్రస్తుతం భారత్‌ వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.

బ్రిక్స్‌ విశేషాలు...

  • ఈ సంవత్సరం బ్రిక్స్‌ థీమ్‌  ‘‘ఇంట్రా బ్రిక్స్‌ కోఆపరేషన్‌ ఫర్‌ కంటిన్యుటీ, కన్సాలిడేషన్, కన్సెస్‌’’.
  • ప్రపంచ జనాభాలో 41 శాతం వాటా, ప్రపంచ జీడీపీలో 24 శాతం భాగస్వామ్యం, అంతర్జాతీయ వాణిజ్యంలో 16 శాతం వాటా బ్రిక్స్‌ దేశాలదే. 
  • 2006లో తొలిసారి బ్రిక్‌(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది. 
  • 2009లో తొలి బ్రిక్‌ సమావేశం రష్యాలో జరిగింది.  
  • బ్రిక్‌ అనే పదానికి రూపా పురుషోత్తమన్‌ రూపకల్పన చేశారు. కానీ క్రెడిట్‌ మాత్రం జిమ్‌ ఓ నీల్‌కు వచ్చింది.
  • బ్రిక్స్‌ ప్రధాన కార్యాలయం చైనాలోని షాంగైలో ఉంది.  
  • 14వ బ్రిక్స్‌ సదస్సుకు చైనా అధ్యక్షత వహించనుంది. 
  • ఏటా ఒక దేశం బ్రిక్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తుంది. 2016లో మోదీ బ్రిక్స్‌ సదస్సుకు అధ్యక్షత వహించారు. 


Uttarakhand Governor: ఉత్తరాఖండ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన ఆర్మీ అధికారి?

Gurmit Singh

దేశంలోని కొన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చడంతో పాటు ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొత్త గవర్నర్‌ను నియమించారు. ఇటీవలే ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా ఉన్న మౌర్య రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్మిత్‌ సింగ్‌ను నియమించారు. 2016 ఏడాదిలో గుర్మిత్‌ సింగ్‌ నుంచి రిటైరయ్యారు. చైనాతో మిలటరీ వ్యవహారాల్లో ఆయన అనుభవజ్ఞుడు.

తమిళనాడు గవర్నర్‌గా ఆర్‌ఎన్‌ రవి...
ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న బన్వరిలాల్‌ పురోహిత్‌ను పంజాబ్‌ గవర్నర్‌గా రాష్ట్రపతి కోవింద్‌ నియమించారు. ఇప్పటివరకు ఆయన పంజాబ్‌ గవర్నర్‌ బాధ్యతలు అదనంగా పర్యవేక్షిస్తున్నారు. నాగాలాండ్‌ గవర్నర్‌గా ఉన్న మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎన్‌ రవిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. అసోం గవర్నర్‌ జగదీశ్‌ ముఖికి నాగాలాండ్‌ బాధ్యతలు అదనంగా అప్పగించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఉత్తరాఖండ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన ఆర్మీ అధికారి?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 9
ఎవరు    : రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్మిత్‌ సింగ్‌ 
ఎందుకు    : ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా ఉన్న బేబీ రాణి మౌర్య రాజీనామా చేసిన నేపథ్యంలో....


NIRF Rankings: ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఐఐటీ?

IIT-Madras

2021 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థల పనితీరును మదింపు చేసి నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) రూపొందించిన ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ సెప్టెంబర్‌ 9న విడుదల చేశారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ఓవరాల్‌ ర్యాంకుల్లోనూ, ఇంజినీరింగ్‌లోనూ ఐఐటీ–మద్రాస్‌ వరుసగా మూడోసారి తొలి స్థానం సాధించింది. ఓవరాల్‌ కేటగిరీలో ఐఐటీ–మద్రాస్‌ తర్వాత ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌–బెంగళూరు రెండోస్థానంలో, ఐఐటీ–బాంబే మూడో స్థానంలో నిలిచాయి.

 

యూనివర్సిటీల్లో ఐఐఎస్‌సీ–బెంగళూరు...
యూనివర్సిటీ కేటగిరీల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌–బెంగళూరు(ఐఐఎస్‌సీ–బెంగళూరు) తొలిస్థానంలో నిలవగా, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో 9వ స్థానం దక్కించుకుంది. వైద్య విద్య విభాగంలో ఎయిమ్స్‌–ఢిల్లీ మొదటి స్థానం సాధించింది. ఇక న్యాయ విద్యా విభాగంలో నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా వర్సిటీ – బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా, నల్సార్‌ – హైదరాబాద్‌ మూడో స్థానం పొందింది. ఆర్కిటెక్చర్‌ విభాగంలో ఐఐటీ రూర్కీ మొదటి స్థానంలో, విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ 8వ ర్యాంకు సాధించాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2021 ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఐఐటీ?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 9
ఎవరు    : ఐఐటీ–మద్రాస్‌
ఎక్కడ    : దేశ వ్యాప్తంగా...


Global Teacher prize 2021: ప్రఖ్యాత గ్లోబల్‌ టీచర్‌ ప్రైజు పోటీలో నిలిచిన హైదరాబాదీ?

Meghana Musunuri

ప్రఖ్యాత గ్లోబల్‌ టీచర్‌ ప్రైజు పోటీలో ఇద్దరు భారతీయ ఉపాధ్యాయులు షార్ట్‌లిస్టయ్యారు. హైదరాబాద్‌కు చెందిన మేఘనా ముసునూరితో పాటు బిహార్‌కు చెందిన టీచర్‌ సత్యం మిశ్రా 2021 ఏడాది ప్రైజ్‌ రేసులో ఉన్నారు. ప్రైజు విలువ రూ.7.35 కోట్లు. యూనెస్కోతో కలిసి వార్కే ఫౌండేషన్‌ ఈ బహుమతిని అందిస్తుంది. ఫౌంటేన్‌హెడ్‌ గ్లోబల్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కాలేజీ ఛైర్‌ పర్సన్‌గా మేఘన వ్యవహరిస్తున్నారు.

ఈ–శ్రమ్‌ పోర్టల్‌ ప్రారంభం
అసంఘటిత రంగ కార్మికులకు పలు ప్రయోజనాలు అందేంచేందుకు ఉద్దేశించింన ‘ఈ–శ్రమ్‌ పోర్టల్‌’ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో సెప్టెంబర్‌ 9న జరిగిన కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. పోర్టల్‌లో అసంఘటిత రంగ కార్మికులు పేరు నమోదు చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని మంత్రి రామేశ్వర్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే 27 లక్షల మంది అసంఘటితరంగ కార్మికులు పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రఖ్యాత గ్లోబల్‌ టీచర్‌ ప్రైజు పోటీలో ఇద్దరు భారతీయ ఉపాధ్యాయులు
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 9
ఎవరు    : మేఘనా ముసునూ, సత్యం మిశ్రా 
ఎందుకు   : విద్యా రంగంలో విశేష కృషి చేసినందుకు...


Ford Motor Company: భారత్‌లోని తయారీ కేంద్రాలను మూసివేస్తోన్న వాహన తయారీ సంస్థ?  

Ford Motor

వాహన తయారీలో ఉన్న యూఎస్‌ కంపెనీ ఫోర్డ్‌ మోటార్‌ భారత్‌లోని తయారీ కేంద్రాలను మూసివేస్తోంది. పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌ సనంద్‌లోని అసెంబ్లింగ్‌ సెంటర్‌ను 2021 ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య, చెన్నైలోని వాహనాలు, ఇంజన్ల తయారీ కేంద్రాన్ని 2022 ఏప్రిల్‌–జూన్‌ కాలంలో మూసివేస్తామని సెప్టెంబర్‌ 9న కంపెనీ వెల్లడించింది. అమెరికా వాహన కంపెనీల్లో భారత్‌లో ప్లాంట్లను మూసివేసిన తొలి సంస్థ జనరల్‌ మోటార్స్‌ కాగా రెండోది ఫోర్డ్‌ కానుంది.

దేశంలో భారీ పెట్టుబడులు...
సనంద్, చెన్నైలోని రెండు ప్లాంట్లపై ఫోర్డ్‌ సంస్థ రూ.18,500 కోట్లు పెట్టుబడి చేసింది. ఏటా 6,10,000 ఇంజన్లు, 4,40,000 వాహనాల తయారీ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎకో స్పోర్ట్, ఫిగో, అస్పైర్‌ మోడళ్లు తయారవుతున్నాయి. 70 దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. సంస్థ తాజా నిర్ణయంతో వీటి తయారీతోపాటు విక్రయాలు సైతం భారత్‌లో నిలిచిపోనున్నాయి. గత 10 ఏళ్లలో కంపెనీ నిర్వహణ నష్టాలు రూ.14,800 కోట్లు పేరుకుపోయాయి. కంపెనీ నిర్ణయం 4,000 మంది ఉద్యోగులతోపాటు 300 ఔట్‌లెట్లను నిర్వహిస్తున్న 150 డీలర్‌షిప్స్‌ ప్రిన్సిపల్స్‌పైన పడనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌లోని తయారీ కేంద్రాలను మూసివేస్తోన్న వాహన తయారీ సంస్థ?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 9
ఎవరు    : యూఎస్‌ కంపెనీ ఫోర్డ్‌ మోటార్‌
ఎక్కడ    : సనంద్‌(గుజరాత్‌), చెన్నై(తమిళనాడు) 
ఎందుకు   : కంపెనీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా...


EV Charging Stations: ఈవీ చార్జింగ్‌ ఇన్‌ఫ్రా ఏర్పాటుకు ఏ సంస్థతో జియో జట్టు కట్టింది?

EV charging infra-blue smart

 

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు కోసం విద్యుత్‌ వాహన సేవల సంస్థ బ్లూస్మార్ట్‌తో జియో–బీపీ జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం బ్లూస్మార్ట్‌ కార్యకలాపాలు ఉన్న నగరాల్లో ఈవీ చార్జింగ్‌ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రణాళికలు, అభివృద్ధి, నిర్వహణ తదితర అంశాల్లో రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన బీపీ కలిసి సంయుక్తంగా జియో–బీపీని జాయింట్‌ వెంచర్‌గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా దేశ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సీఆర్‌) వీటిని ఏర్పాటు చేయనున్నట్లు జియో–బీపీ సెప్టెంబర్‌ 9న తెలిపింది.

ఓయోతో మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యం
ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఆతిథ్య రంగ సంస్థ ఓయో తాజాగా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ట్రావెల్, ఆతిథ్య రంగానికి అవసరమైన ఉత్పత్తులు, టెక్నాలజీలను కలిసి అభివృద్ధి చేసేందుకు ఇది తోడ్పడనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : విద్యుత్‌ వాహన సేవల సంస్థ బ్లూస్మార్ట్‌తో జట్టు కట్టిన సంస్థ?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 9
ఎవరు    : జియో–బీపీ 
ఎందుకు  : దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు కోసం...


Jaskaran Malhotra: ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడు?

Jaskaran Malhotra

అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన ఘనత నమోదైంది. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా జస్కరన్‌ మల్హోత్రా (అమెరికా) నిలిచాడు. ఒమన్‌లోని అల్‌ అమీరట్‌లో సెప్టెంబర్‌ 9న పపువా న్యూ గినియాతో జరిగిన రెండో వన్డేలో మీడియం పేసర్‌ గాడీ టోకా వేసిన 50వ ఓవర్లో జస్కరన్‌ వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా 134 పరుగుల తేడాతో గెలిచింది. చండీగఢ్‌లో పుట్టి వలస వెళ్లిన జస్కరన్‌ అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2007 వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో డాన్‌ వాన్‌ బంగ్‌ ఓవర్లో హెర్షల్‌ గిబ్స్‌ 6 సిక్సర్లు కొట్టగా... అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్‌ సింగ్, కీరన్‌ పొలార్డ్‌ ఈ అరుదైన ఫీట్‌ను ప్రదర్శించారు.

 

గంగూలీపై బయోపిక్‌...
భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ జీవితంపై సినిమా నిర్మితం కానుంది. ఈ విషయాన్ని స్వయంగా గంగూలీ నిర్ధారించాడు. లవ్‌ రంజన్, అంకుర్‌ గార్గ్‌ కలిసి ‘లవ్‌ ఫిల్మ్‌స్‌’ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తారు. గంగూలీ పాత్ర పోషించే నటుడు, దర్శకుడు తదితర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అంతర్జాతీయ వన్డేల్లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడు?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 9
ఎవరు    : జస్కరన్‌ మల్హోత్రా (అమెరికా జట్టు)
ఎక్కడ    : అల్‌ అమీరట్, ఒమన్‌
ఎందుకు  : పపువా న్యూ గినియాతో జరిగిన రెండో వన్డేలో మీడియం పేసర్‌ గాడీ టోకా వేసిన 50వ ఓవర్లో జస్కరన్‌ వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు
 

Published date : 13 Sep 2021 11:41AM

Photo Stories