Skip to main content

దేశవ్యాప్తంగా 75 కొత్త వైద్య కళాశాలలు

దేశవ్యాప్తంగా 75 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో ఆగస్టు 28న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ (సీసీఈఏ) వైద్య కళాశాలల పెంపుతో పాటు మరికొన్ని నిర్ణయాలను తీసుకుంది. 75 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో ప్రస్తుతమున్న ఎంబీబీఎస్ సీట్లకు మరో 15,700 సీట్లు పెరగ నున్నాయి.

కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు
  • 2021-22 విద్యా సంవత్సరం నాటికి కొత్త వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకురావాలి. ఈ కాలేజీలను జిల్లా ఆసుపత్రులతోపాటు 200/300 పడకలున్న ఆసుపత్రులకు అటాచ్ చేయాలి. ఇందుకోసం రూ.24,375కోట్లు ఖర్చవుతాయి.
  • వచ్చే మార్కెటింగ్ సంవత్సరం (2019, అక్టోబర్‌లో ప్రారంభం)లో 60లక్షల మిలియన్ల చక్కెరను ఎగుమతి చేసేందుకు సంబంధించిన రూ.6,286కోట్ల సబ్సిడీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా చక్కెర మిల్లుల్లో ఉన్న మిగులు ఉత్పత్తిని వదిలించుకోవడంతోపాటు.. రైతుల బకాయిలు చెల్లించేందుకు ఈ చర్య ఉపయోగపడనుంది.
  • ఢిల్లీలో ఇంటర్నేషనల్ కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ (సీడీఆర్‌ఐ) సచివాలయ కార్యాలయం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
  • 2019, సెప్టెంబర్ 23న న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో సీఆర్‌డీఐ ఏర్పాటును ప్రధాని మోదీ అధికారికంగా ప్రకటించనున్నారు. సీఆర్‌డీఐ కోసం రూ.480కోట్ల నిధిని ఏర్పాటుచేసేందుకు కూడా కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
  • ఔషధ మొక్కల పెంపకం, పరిశోధన తదితర అంశాల్లో సహకారానికి పెరూ దేశంతో, సంప్రదాయ వైద్యంపై గయానా, గాంబియా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అంగీకారం తెలిపింది.
  • బొగ్గు మైనింగ్, కాంట్రాక్టు తయారీ రంగాల్లోకి నూరు శాతం ఎఫ్‌డీఐలను కేబినెట్ ఆహ్వానించింది. అలాగే, డిజిటల్ మీడియాలో ఇప్పటి వరకు ఎఫ్‌డీఐలకు అవకాశం లేకపోగా, ఇకపై 26 శాతం వరకు ఎఫ్‌డీఐలను స్వీకరించేందుకు అనుమతించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
75 కొత్త వైద్య కళాశాలలు
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
Published date : 29 Aug 2019 05:40PM

Photo Stories