Skip to main content

దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి పేరు?

ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జనవరి 16న ప్రారంభమైంది.
Edu news
తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్ సెంటర్లలో ‘‘కోవిషీల్డ్, కోవాగ్జిన్’’ టీకాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా ప్రారంభించారు. జనవరి 16న దేశవ్యాప్తంగా 3,352 సెషన్లలో 1.90 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారు.

మొట్టమొదటి వ్యక్తిగా మనీశ్...
దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా పారిశుధ్య కార్మికుడు మనీశ్ కుమార్(34) గుర్తింపు పొందాడు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో అతడికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పాల్గొన్నారు. మనీశ్‌కు భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ను ఇచ్చారు.

తొలిరోజు ఏ రాష్ట్రంలో ఎంతమందికి టీకా..
రాష్ట్రం టీకా తీసుకున్నవారు
ఉత్తరప్రదేశ్ 21,291
ఆంధ్రప్రదేశ్ 19,108
మహారాష్ట్ర 18,328
బిహార్ 18,169
ఒడిశా 13,746
కర్ణాటక 13,594
గుజరాత్ 10,787
పశ్చిమ బెంగాల్ 9,730
తెలంగాణ 3,962
తమిళనాడు 2,945

ఆంధ్రప్రదేశ్‌లో...
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 16న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో లాంఛనంగా ప్రారంభించారు. తొలి టీకాను ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారికి ఇచ్చారు.

తెలంగాణలో...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు జనవరి 16న టీకాల కార్యక్రమం విజయవంతమైంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మకు వైద్యులు తొలి టీకా వేశారు. అలాగే హైదరాబాద్‌లోని నిమ్స్‌లో తొలి టీకాను ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలు చంద్రకళ, తిలక్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)లో ఆయాగా పని చేస్తున్న రేణుక తొలి వ్యాక్సిన్ తీసుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : భారత్
ఎందుకు : కోవిడ్-19ను నిరోధించేందుకు
Published date : 18 Jan 2021 06:50PM

Photo Stories