Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 10th కరెంట్ అఫైర్స్
CJI DY Chandrachud: అయోధ్య భూ వివాదం, వ్యక్తిగత గోప్యత హక్కు, శబరిమల చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుల సేవే తన తొలి ప్రాథమ్యమని భారత నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ (62) పేర్కొన్నారు. ‘‘టెక్నాలజీ కావచ్చు, న్యాయ సంస్కరణలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ప్రతి అంశంలోనూ సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణకే అగ్రతాంబూలమిస్తా’’ అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నవంబర్ 9న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. నవంబర్ 8న సీజేఐగా రిటైరైన జస్టిస్ యు.యు.లలిత్ నుంచి జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు. దైవసాక్షిగా ఆంగ్లంలో ప్రమాణం చేశారు.
Also read: Quiz of The Day (November 09, 2022) : ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా స్పీకర్?
జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబరు 10 దాకా రెండేళ్లపాటు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 16వ సీజేఐగా చేసిన ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ 1978 నుంచి 1985 దాకా ఏకంగా ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉండటం విశేషం. అత్యధిక కాలం సీజేఐగా ఉన్న రికార్డు ఆయనదే. తర్వాత 44 ఏళ్లకు ఆయన కుమారుడు చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి కుమారులిద్దరూ సీజేఐ కావడం దేశంలో ఇదే తొలిసారి. జస్టిస్ చంద్రచూడ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. ఆయన పదవీకాలం ఫలవంతంగా సాగాలంటూ వారిద్దరూ ట్వీట్ చేశారు.
జస్టిస్ చంద్రచూడ్ 1959 నవంబర్ 11న జన్మించారు. బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్) అనంతరం ఢిల్లీ వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేశారు. అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్‌ఎల్‌ఎం, డాక్టరేట్ ఇన్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎస్‌జేడీ) చేశారు. ఆయన ప్రస్థానం 1998లో బాంబే హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా మొదలైంది. బాంబే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు. అదే ఏడాది అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2013 నుంచి మూడేళ్లపాటు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2016 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
Also read: Chief Justice: వాగ్దానాలు కొంతవరకు నెరవేర్చా వీడ్కోలు సభలో సీజేఐ యు.యు.లలిత్
చరిత్రాత్మక తీర్పులు
అయోధ్య భూ వివాదం, వ్యక్తిగత గోప్యత హక్కు, శబరిమలకు రుతుక్రమ మహిళల ప్రవేశం, అవివాహితలకూ 24 వారాల దాకా అబార్షన్ హక్కు తదితర కేసుల్లో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఆర్మీలో మహిళా ఆఫీసర్లకు పరి్మనెంట్ కమిషన్, కమాండ్‌పోస్టింగులు ఇవ్వాల్సిందేనని ఆయన సారథ్యంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇటీవల జస్టిస్ యు.యు.లలిత్ హయాంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో కొలీజియం సభ్యుల అభిప్రాయాల సేకరణకు సర్క్యులేషన్లు జారీ చేసే పద్ధతిని వ్యతిరేకించిన ఇద్దరు న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు.
Also read: EWS కోటా చెల్లుతుంది... చరిత్రాత్మక తీర్పు వెలువరించిన Supreme Court..
అసమ్మతిని స్వాగతిస్తారు
అసమ్మతిని ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా జస్టిస్ చంద్రచూడ్ అభివర్ణిస్తుంటారు. ఆధార్ చెల్లుబాటును ఆయన చాలా గట్టిగా వ్యతిరేకించిన తీరు చాలాకాలం పాటు వార్తల్లో నిలిచింది. ఆధార్ చెల్లుతుందంటూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో మిగతా నలుగురు వెలువరించిన తీర్పుతో తీవ్రంగా విభేదించారు. యునిక్ బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. న్యాయప్రక్రియను డిజిటైజ్ చేయడంలోనూ ఆయనది కీలకపాత్ర. ప్రగతిశీల భావాలున్న న్యాయమూర్తి అని, ఏ అంశం మీదైనా స్పష్టమైన భావాలు కలిగి ఉంటారని, వాటిని అంతే సూటిగా వ్యక్తీకరిస్తారని పేరు.
CJ of Tripura: త్రిపుర తాత్కాలిక సీజేగా జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్
సాక్షి, న్యూఢిల్లీ: త్రిపుర హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా జస్టిస్ తొడుపునూరి అమర్‌నాథ్ గౌడ్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. నవంబరు 11 నుంచి ఆయన తాత్కాలిక సీజేగా కొనసాగుతారంటూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
జస్టిస్ అమర్‌నాథ్ 1965లో హైదరాబాద్‌లో జన్మించారు. 2017 సెప్టెంబర్ 21న ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2021 అక్టోబర్ 28న త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు.
British Minister: UK మంత్రి గావిన్ విలియమ్సన్ తన పదవికి రాజీనామా
లండన్: బ్రిటన్లో ప్రధాని రిషి సునాక్ కేబినెట్ నుంచి గవిన్ విలియమ్సన్ రాజీనామా చేశారు. తోటి ఎంపీలపై నోరుపారేసుకుంటారని, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తారని ఆయనపై గతంలోనే విమర్శలు ఉన్నాయి. తాజా మాజీ కన్జర్వేటివ్ పార్టీ మహిళా చీఫ్ విప్ విండీ మోర్టాన్‌ను ఆయన బెదిరించారని ఆరోపణలున్నాయి. మాజీ మహిళా ప్రధాని లిజ్ ట్రస్‌కు సాయపడలేదని, బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు తనను ఆహ్వానించలేదని తిడుతూ విండీకి విలియమ్‌సన్ చేసిన మెసేజ్‌లు ఇటీవల మీడియాలో బహిర్గతమవడం తెల్సిందే. మూడేళ్లక్రితం రక్షణమంత్రిగా ఉన్న కాలంలో ఉద్యోగులను నాలుక చీలుస్తానని, కోపంతో కిటికీ నుంచి బయటకు విసిరేస్తానని అరిచేవారని వార్తలొచ్చాయి. ఈ ఆరోపణలు, రాజీనామాపై సునాక్ విచారం వ్యక్తంచేశారు. విలియమ్సన్‌ను గతంలోనూ రెండుసార్లు పదవి నుంచి తప్పించారు.
Maryland Lieutenant Governor: తొలి భారతీయ అమెరికన్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్(Aruna Miller)
వాషింగ్టన్: తెలుగు మహిళ కాట్రగడ్డ అరుణ మిల్లర్ (58) Aruna Miller అమెరికాలో చరిత్ర సృష్టించారు. దేశంలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో మేరీలాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డుకెక్కారు. డెమొక్రాటిక్ పార్టీ తరఫున అరుణ రికార్డు మెజార్టీతో గెలిచారు. రిపబ్లికన్ పార్టీ అనుకూల వర్గాలూ ఆమెకే మద్దతివ్వడంతో గెలుపు సులభమైంది. అమెరికాలో రాష్ట్రస్థాయిలో గవర్నర్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ పదవి అత్యంత కీలకం.
Also read: Rishi Sunak: బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్
రవాణా ఇంజనీర్‌గా సేవలు
కాట్రగడ్డ అరుణ మిల్లర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం. ఆమె 1964 నవంబర్ 6న జన్మించారు. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో కలిసి 1972లో అమెరికా చేరుకున్నారు. తండ్రి కాట్రగడ్డ వెంకటరామారావు ఐబీఎం సంస్థలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లో ప్రాథమిక విద్య అనంతరం అరుణ ‘మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’లో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశారు.
Also read: ఇటలీ ప్రధానిగా Giorgia Meloni ప్రమాణం
1990లో మేరీల్యాండ్‌లోని మాంట్‌గొమెరీ కౌంటీకి మారారు. అక్కడే తన కళాశాల మిత్రుడు డేవిడ్ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు మీనా, క్లోయి, సాషా ఉన్నారు. అరుణ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2000లో అమెరికా పౌరసత్వం లభించింది. 2010 నుంచి 2018 దాకా మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో డిస్ట్రిక్ట్ 15కి ప్రాతినిధ్యం వహించారు. 2018లో అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు పోటీపడి ఓడారు. ‘‘మేరీల్యాండ్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి నావంతు కృషి చేస్తా. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ నన్ను గెలిపించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో చిన్న రాష్ట్రం కూడా అద్భుతం సృష్టిస్తుందని ఈ ఎన్నికతో ప్రజలు నిరూపించారు’’ అని అరుణ మిల్లర్ చెప్పారు.
Also read: Prime Minister Israel: ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహూ
రిపబ్లికన్ల ఆధిక్యం
- మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్లు స్వల్ప ఆధిక్యం కనబరుస్తున్నారు.
- మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో కడపలి వార్తలు అందే సమయానికి 202 స్థానాలు గెలుచుకున్నారు.
- అధికార డెమొక్రటిక్ పార్టీకి 184 స్థానాలు దక్కాయి.
- మ్యాజిక్ ఫిగర్ 218 సీట్లు. సె
- నేట్‌లో 35 స్థానాలకు ఎన్నికలు జరగ్గా రిపబ్లికన్లు 19 , డెమొక్రాట్లు 12 సీట్లు నెగ్గారు.
- కడపటి వార్తలందేసరికి ఈ రెండు పార్టీలకూ సెనేట్లో చెరో 48 సీట్లున్నాయి.
- 36 గవర్నర్ పదవుల్లో రిపబ్లికన్లకు 16, డెమొక్రాట్లకు 15 దక్కాయి.
ఐదుగురు భారత అమెరికన్ల విజయం
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభకు ఐదుగురు భారత–అమెరికన్లు ఎన్నికయ్యారు. వీరంతా అధికార డెమొక్రాటిక్ పార్టీ తరఫున నెగ్గడం విశేషం. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెషనల్ జిల్లాల నుంచి రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, అమీ బేరా, ప్రమీలా జయపాల్, థానేదార్ ప్రతినిధుల సభలో అడుగు పెట్టనున్నారు.
రూ.9,500 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన : PM Modi
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యటనలో భాగంగా రామగుండంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సాధించిన ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోదీ వివరించనున్నారు. నవంబర్ 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు.
2016, ఆగస్ట్ 7న ఈ ఎరువుల ఫ్యాక్టరీకి మోదీ శంకు స్థాపన చేసిన విషయం తెలిసిందే.
Also read: Telanganaలో 3 నేషనల్ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన
ఏయే ప్రాజెక్టులు ప్రారంభిస్తారు?
- ∙రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం
- ∙అక్కడ నిర్వహించే సభలోనే రూ.9,500 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ∙భద్రాచలం రోడ్డు, సత్తుపల్లి రైలు లైన్లు కూడా జాతికి అంకితం
Telangana Govt.: ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియకు లైన్ క్లియర్.. ఉత్తర్వులు జారీ చేసిన CS సోమేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో ఆరుశాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గిరిజనుల జనాభా ప్రకారం వారికి సమాన వాటా ఇవ్వాలన్న లక్ష్యంతో ఆరుశాతం రిజర్వేషన్లను పదిశాతానికి పెంచింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేయగా... పెంచిన 10 శాతం రిజర్వేషన్లను రోస్టర్ జాబితాలో సర్దుబాటు చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నవంబర్ 9న ఉత్తర్వులు జారీ చేశారు. విద్య, ఉద్యోగ, పదోన్నతుల్లో ప్రతి పది అవకాశాల్లో ఒకటి గిరిజనులకు దక్కేలా రోస్టర్‌లో ఎస్టీ రిజర్వేషన్లను పొందుపర్చింది.
Also read: Global Investor Summit 2023: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్–2023
కాస్త అటు ఇటుగా మారిన రోస్టర్
విద్య, ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల ప్రక్రియను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రోస్టర్ చార్ట్‌నే ప్రామాణికంగా తీసుకుంటుంది. దీని ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తుంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న రోస్టర్‌లో గిరిజనులకు పదిశాతం కోటాను సర్దుబాటు చేయడంతో కాస్త మార్పులు చోటుచేసుకున్నాయి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ... ఇప్పటికే గిరిజనులకు రిజర్వ్ చేసిన అంకెలను రిజర్వులో కాస్త అటు ఇటుగా మార్చి పెరిగిన 4 శాతం అంకెలను సర్దుబాటు చేశారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపుతో గిరిజనులకు 4 శాతం అదనంగా అవకాశాలు పెరిగాయి. ఈ క్రమంలో రోస్టర్‌లో కొత్తగా 15, 42, 67, 92 స్థానాల్లో గిరిజనులు అవకాశాలను దక్కించుకోనున్నారు. ఇప్పటివరకు ఈ నాలుగు పాయింట్లు జనరల్ కేటగిరీకే కేటాయించగా... తాజాగా గిరిజనులకు కేటాయిస్తూ రోస్టర్‌లో మార్పులు జరిగాయి.
Also read: EWS కోటా చెల్లుతుంది... చరిత్రాత్మక తీర్పు వెలువరించిన Supreme Court..
6% రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పాయింట్లు
ఎస్టీ(మహిళ): 8, 58
ఎస్టీ(జనరల్): 25, 33, 75, 83
–––––––––––––––––––––––––––––––––––––––
10శాతం రిజర్వేషన్ల పెంపుతో రోస్టర్ పాయింట్లు
ఎస్టీ(మహిళ): 8, 33, 75
ఎస్టీ(జనరల్): 15, 25, 42, 58, 67, 83, 92
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: గల్ఫ్ ఆయిల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు సంతకం చేశారు?
కొత్త నియామకాలకు మార్గం సుగమం
గిరిజన కోటా అంశం తేలడంతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు శాఖల్లో కొలువుల భర్తీకి అనుమతులు ఇవ్వగా... గిరిజన రిజర్వేషన్ల అంశంతో కాస్త జాప్యం నెలకొంది. ఇప్పుడు రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో కొత్తగా నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. ఇకపై గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు అమలయ్యేలా నియామకాలు చేపట్టాలి. ఈమేరకు నియామక ఏజెన్సీలు సైతం పక్కాగా చర్యలు తీసుకోవాలి. అతి త్వరలో ప్రభుత్వం అనుమతించిన పోస్టుల భర్తీలో వేగిరం పుంజుకోనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
5th India Agri Business Summit – 2022: దేశవ్యాప్తంగా ఆర్బీకేలు(వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు)
సాక్షి, అమరావతి: వ్యవసాయంలో రైతన్నలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించేందు కు, నాణ్యమైన ఇన్‌పుట్స్, సాగుకు సంబంధించి అన్ని రకాల ఇతర సేవలు అందించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన అద్భుత వ్యవస్థ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు). రాష్ట్ర వ్యవసాయ రంగంలో అత్యున్నత ఫలితాలు ఇస్తున్న ఈ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ఈ వ్యవస్థ ఏర్పాటుకు ఇప్పటికే ఇథియోపియా దేశం రాష్ట్ర అధికారుల సహకారం తీసుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థ ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆ రాష్ట్రాల అధికార బృందాలు రాష్ట్రానికి వచ్చి ఆర్బీకేలు, డిజిటల్ కియోస్క్‌లపై అధ్యయనం చేశా యి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తరహా వ్యవస్థను దేశవ్యాప్తంగా నెలకొల్పడానికి చర్యలు చేపట్టింది.
Also read: Global Investor Summit 2023: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్–2023
నవంబర్ 9న న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ– పూస)లో ప్రారంభమైన మూడు రోజుల 5వ ఇండియా అగ్రి బిజినెస్ సమ్మిట్–2022 సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ విషయం చెప్పారు. సదస్సులో భాగంగా నిర్వహించిన జాతీయ అగ్రి ఎక్స్‌పోలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ఆర్బీకేల నమూనా, డిజిటల్ కియోస్క్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆర్బీకే ద్వారా అందిస్తున్న సేవలు, డిజిటల్ కియోస్క్‌ల పనితీరును కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్‌తో పాటు ఫిలిప్పైన్స్ వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి విలియం దార్, రోమన్ ఫోరమ్ ప్రెసిడెంట్ మహారాజ్ ముతూ, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్, సలహాదారు ఎన్‌కే దడ్లాని, నేషనల్ రెయిన్ ఫెడ్ ఏరియా అథారిటీ (ఎన్‌ఆర్‌ఏఏ) సీఈవో అశోక్ దాల్వాయి తదితరులు అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేల ద్వారా ఏపీ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఆర్బీకే సేవలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, ఇదే తరహా సేవలను దేశవ్యాప్తంగా గ్రామస్థాయిలో ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చెప్పారు.
ఆర్బీకేలు, వాటిలోని కియోస్క్‌లు వ్యవసాయ రంగంలో విప్లవం తీసుకొచ్చే వినూత్న మైన పరిజ్ఞానమని ఆయన కొనియాడారు. ‘ఏపీ ఆర్బీకేల గురించి చాలా వింటున్నాం. వాటి ద్వారా అందిస్తున్న సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్బీకేల్లో డిజిటల్ కియోస్క్‌ల ద్వారా ఇన్‌పుట్స్ బుకింగ్ విధానం అద్భుతం. వాటిని జాతీయ స్థాయిలో రైతులకు అందుబాటులోకి తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో వీటిని గ్రామ స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తా’ అని చెప్పారు. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని, డిసెంబరుకల్లా డిజిటల్ కియో స్క్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సదస్సుకు వచ్చిన మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ ఉన్నతాధి కారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Also read: Arogyasri 2.0 : రెట్టింపు భరోసా - ఇక 3,255 చికిత్సలకు వర్తింపు
Global Agri Award: రైతు ముంగిటకే విత్తన సరఫరా భేష్
సాక్షి, అమరావతి: నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను గ్రామ స్థాయిలో రైతుల ముంగిటకే అందించడం వినూత్న ఆలోచన అని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖల సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్, నీతి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) రమేష్ చంద్ ప్రశంసించారు. విత్తన పంపిణీలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని చెప్పారు. మూడేళ్లలో 50.95 లక్షల మందికి 34.97 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అత్యంత పారదర్శకంగా పంపిణీ చేయడం నిజంగా గొప్ప విషయమన్నారు. వ్యవసాయ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన సంస్థలకు ఇండియన్ చాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్‌ఏ) ఏటా అందించే ఇండియా అగ్రి బిజినెస్ అవార్డుల్లో విత్తన పంపిణీ కేటగిరీలో ఏపీ సీడ్స్‌కు గ్లోబల్ అగ్రి అవార్డును అందించింది.
Also read: YSR Awards 2022 : విజయవాడలో ఘనంగా పురస్కారాల ప్రదానోత్సవం
నవంబర్ 9న జరిగిన ఇండియా అగ్రి బిజినెస్ సమ్మిట్‌లో ఈ అవార్డును సంజీవ్‌కుమార్ బల్యాన్, రమేష్ చంద్ చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు అందుకున్నారు.
AP Infra Projects: 9 ప్రాజెక్టులు(రూ.15,233 కోట్లు)లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని మోదీ
దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 12న ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇదే వేదికపై నుంచి రూ.15,233 కోట్లు విలువైన 9 ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలుప్రారంభోత్సవాలు చేయనున్నారు.
శంకుస్థాపనల ప్రాజెక్టులు..
- రూ.7,614 కోట్లు విలువైన 5 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో..
- రూ.152 కోట్లతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ.
- రూ.3,778 కోట్లతో రాయ్‌పూర్– విశాఖపట్నం 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఎకనామిక్ కారిడార్.
- రూ.566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్‌కు ప్రత్యేకమైన రోడ్డు.
- రూ.460 కోట్లతో విశాఖపట్నం రైల్వేస్టేషన్ అభివృద్ధి.
- రూ.2,658 కోట్లతో 321 కిలో మీటర్ల శ్రీకాకుళం–అంగుల్‌కు గెయిల్ పైప్‌లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి.
Also read: E-Mobility week celebration: హైదరాబాద్ నగరంలో ఈ-మొబిలిటీ వారోత్సవాలు
జాతికి అంకితంచేసే ప్రాజెక్టులు
- రూ.7,619 కోట్లతో పూర్తి చేసిన నాలుగు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. వాటిలో
- రూ.211 కోట్ల వ్యయంతో పాతపట్నం– నరసన్నపేటను కలుపుతూ నిర్మించిన నూతన జాతీయ రహదారి.
- రూ.2,917 కోట్లతో తూర్పు తీరంలో అభివృద్ధి చేసిన ఓఎన్‌జీసీ యు–ఫీల్డ్.
- రూ.385 కోట్లతో గుంతకల్‌లో ఐవోసీఎల్ గ్రాస్ రూట్ పీవోఎల్ డిపో నిర్మాణం.
- రూ.4,106 కోట్లతో విజయవాడ– గుడివాడ–భీమవరం–నిడదవోలు, గుడివాడ–మచిలీపట్నం, భీమవరం– నరసాపురం (221 కి.మీ.) రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ ఉన్నాయి.
Also read: Electric Double Deckers: భాగ్యనగరానికి 10 విద్యుత్ డబుల్ డెక్కర్‌లు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP