Daily Current Affairs in Telugu: 2022, జులై 6th కరెంట్ అఫైర్స్
Women Cricketers' Pay: పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు
ప్రపంచ క్రికెట్లో సమ, నవ శకానికి న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జెడ్‌సీ) నాంది పలికింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆధిపత్యం చలాయిస్తున్న పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టులు ఇవ్వనున్నట్లు ఎన్‌జెడ్‌సీ ప్రకటించింది. దీనికి సంబంధించిన విధాన నిర్ణయాన్ని వెలువరించింది. వచ్చే ఐదేళ్ల కాంట్రాక్టులో నూతన సమాన వేతనాలను ఒక్క అంతర్జాతీయ క్రికెట్‌కే పరిమితం చేయకుండా ఎన్‌జెడ్‌సీ బోర్డు దేశవాళీ క్రికెట్లోనూ ప్రవేశపెట్టి.. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయంతో... కివీస్ స్టార్లు విలియమ్సన్ సహచరులకు ఎంత మొత్తం లభిస్తుందో... సోఫీ డివైన్ బృందం కూడా అంతే మొత్తం మ్యాచ్ ఫీజులు, వేతన భత్యాలు పొందుతుంది.
Also read: Quiz : ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని నగరం ఏది?
ఎన్‌జెడ్‌సీ ఫీజులను పరిశీలిస్తే ఒక్కో టెస్టుకు 10,500 న్యూజిలాండ్ డాలర్లు (రూ. 5 లక్షల 11 వేలు), ఒక్కో వన్డేకు 4,000 డాలర్లు (రూ. లక్షా 94 వేలు), ఒక్కో టి20 మ్యాచ్‌కు 2,500 డాలర్లు (రూ. లక్షా 21 వేలు) చెల్లిస్తారు. అయితే న్యూజిలాండ్ అమ్మాయిల జట్టు 2004 నుంచి ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు.
Conocarpus plants దడ పుట్టిస్తున్న మడజాతి కోనోకార్పస్ మొక్కలు
కోనోకార్పస్.. ఈ మొక్క పేరు వింటేనే పర్యావరణ ప్రేమికులు, వృక్షశాస్త్రవేత్తలు హడలిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో సుందరీకరణ కోసం దీన్ని విరివిగా పెంచుతున్నారు. అయితే.. వీటితో పర్యావరణానికి పలువిధాలుగా విఘాతం కలుగుతోందని, ముఖ్యంగా పట్టణప్రాంత ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని, మున్సిపాలిటీలకు రూ.లక్షల్లో నష్టం కలుగుజేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని దాదాపు అన్ని పట్టణాల్లో రోడ్ల మధ్య సుందరీకరణ కోసం ఈ మొక్కను పెంచుతున్నారు. నిటారుగా, ఏపుగా పెరిగి నిత్యం పచ్చదనంతో కళకళలాడే ఈ మొక్క తన దుష్ప్రభావాలతో ఇప్పుడు భయపెడుతోంది.
Also read: GK International Quiz: ప్రపంచంలోనే అతిపెద్ద గ్లాస్ బాటమ్ బ్రిడ్జిని ఏ దేశంలో ప్రారంభించారు?
ఇదీ మొక్క కథ
కోనోకార్పస్ మొక్కలో అనేక ఉపజాతులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లోని మడ (సముద్రం–నదులు కలిసే ముఖద్వారాల వద్ద ఉండే) అడవుల్లో ఇవి పెరుగుతాయి. వీటిని మాంగ్రూవ్ మొక్కలనీ పిలుస్తారు. తీర ప్రాంతాల్లో పెరగడం వల్ల నిత్యం ప్రవాహాలను తట్టుకునేందుకు వీలుగా వీటి వేర్లు బురదనేలల్లోకి అనేక మీటర్ల లోతుకు వెళ్లి నాటుకుని, మొక్కకు స్థిరత్వమిస్తాయి. ఫలితంగా తీర ప్రాంతాల్లోని నీటి ప్రవాహాల వేగాన్ని ఇవి అడ్డుకుంటాయి. తక్కువ కాలంలో ఏపుగా పెరగడం, వేర్లు లోతుకు పాతుకుపోవడంతో ఇది ప్రతీ రుతువులోనూ పచ్చదనంతో కళకళలాడుతుంది. ఈ గుణమే.. దీన్ని అనేక దేశాలకు విస్తరించేలా చేసింది. ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ మొక్కను సుందరీకరణకు వినియోగిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా, మధ్యలో నాటడం వల్ల పరిసరాలు పచ్చదనంతో నిండిపోతున్నాయి. వారాల వ్యవధిలో మొక్కలు ఏపుగా పెరుగుతుండటంతో తెలంగాణలోను అనేక మున్సిపాలిటీలు ఈ మొక్కలను నాటాయి. హరితహారంలోనూ దీన్ని నాటుతున్నారు. దీని దుష్పరిణామాలను గుర్తించిన ప్రభుత్వం.. వీటిని హరితహారంలో నాటొద్దని, నర్సరీల్లో పెంచొద్దని అన్ని జిల్లాల డీఆర్‌డీవో విభాగాలను ఆదేశించింది.
Also read: GK Sports Quiz: 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?
పర్యావరణ వ్యవస్థలో ఎలాంటి ఉపయోగం లేని మొక్క
కోనోకార్పస్ మొక్క పుష్పాల నుంచి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ, ఆస్తమా సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. వీటి వేర్లు లోతుకంటూ పాతుకుపోతూ.. మధ్యలో అడ్డు వచ్చే కమ్యూనికేషన్ కేబుళ్లు, డ్రైనేజీ లైన్లు, మంచినీటి వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని గుర్తించారు. దీనిపై పరిశోధనలు జరిపిన పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాలు ఈ మొక్కను నిషేధించాలని నిర్ణయించాయి. ఈ మొక్కతో కీటకాలకు, పక్షులకు ఎలాంటి ఉపయోగం లేదు. వీటిపై పక్షులు గూళ్లు కట్టవు. పుప్పొడిపై సీతాకోకచిలుకలూ వాలవు. ఏ జంతువూ దీని ఆకులను తినవు. పర్యావరణ వ్యవస్థలో ఈ మొక్కతో ఎలాంటి ఉపయోగం లేకపోగా, అనేక దుష్ప్రభావాలు మాత్రం కలుగజేస్తుంది.
Also read: GK Economy Quiz: US డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి ఆల్ టైమ్ కనిష్ట రికార్డు ఎంత?
National Food Security Act: ఆహారభద్రతలో 3వ స్థానంలో ఏపీ, 12వ స్థానంలో తెలంగాణ
ఆహార భద్రత అమలులో జనరల్ కేటగిరీ రాష్ట్రాల్లో 0.794తో ఏపీ మూడోస్థానం, 0.743 స్కోరుతో తెలంగాణ 12వ స్థానంలో నిలిచాయి. 0.836 స్కోరుతో తొలి స్థానంలో ఒడిశా, 0.797 స్కోరుతో యూపీ రెండో స్థానంలో నిలిచాయి. జాతీయ ఆహార భద్రత చట్టం రాష్ట్రాల ర్యాంకింగ్ ఇండెక్స్‌ను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రి పీయూష్ గోయల్ జూలై 5న విడుదల చేశారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. రేషన్‌కార్డు దారుడు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రేషన్ తీసుకొనే స్వేచ్ఛను కల్పించడంతో 45వేల కోట్ల లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఈ పథకం వలసదారులకు ఎంతో ఉపకరిస్తోందన్నారు.
Also read: Conocarpus plants దడ పుట్టిస్తున్న మడజాతి కోనోకార్పస్ మొక్కలు
AP Government: టెలీమెడిసిన్ సేవల్లో ఏపీ రికార్డు
టెలీమెడిసిన్ సేవల్లో ఏపీ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. దేశంలోనే ఒక్కరోజులో లక్ష కన్సల్టేషన్ల మైలురాయిని దాటిన తొలి రాష్ట్రంగా ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా జూలై 4న 2,04,858 కన్సల్టేషన్లు నమోదవగా ఇందులో 48.89 శాతం అంటే 1,00,159 కన్సల్టేషన్లు ఏపీలోనే నమోదయ్యాయి. తమిళనాడు నుంచి 34వేలు, కర్ణాటకలో 15వేలు, తెలంగాణాలో 5,574, కేరళలో 543 చొప్పున నమోదయ్యాయి. వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈసంజీవని టెలీమెడిసిన్ సేవలను 2019 నవంబర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి.