Skip to main content

చిరు వ్యాపారుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకం?

చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించేందుకు ఉద్దేశించిన ‘జగనన్న తోడు’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది.
Current Affairs ‘జగనన్న తోడు’ పథకం కింద రెండో విడతలో 3.70 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల ఖాతాలకు రూ.10 వేల చొప్పున రూ.370 కోట్ల వడ్డీ లేని రుణాలను జూన్ 8న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... రెండో విడతతో కలిపి (తొలి విడతలో 5.35 లక్షల మందికి రూ.535 కోట్లు) ఈ పథకం కింద 9.05 లక్షల మంది చిరు వ్యాపారులైన అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు వడ్డీ లేని రుణం కింద రూ.905 కోట్లు అందించామని తెలిపారు. తిరిగి రుణాలను వడ్డీతో సహా సకాలంలో బ్యాంకులకు చెల్లిస్తే, ఆ వడ్డీని లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వమే నేరుగా జమ చేస్తుందని వెల్లడించారు. దీనివల్ల రుణం తీసుకున్న వారిలో సకాలంలో తిరిగి చెల్లించాలనే క్రమశిక్షణ వస్తుందన్నారు. జగనన్న తోడు కార్యక్రమాన్ని తొలుత 2020, నవంబర్ 25న ప్రారంభించారు.

సీఎం ప్రసంగం-ముఖ్యాంశాలు
  • జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులతో పాటు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, బొబ్బిలి వీణ, ఇత్తడి పాత్రల తయారీదారులు, కలంకారీ పనులు చేసే వారికి కూడా రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తారు.
  • గ్రామాలు, పట్టణాల్లో సుమారు పది అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పు స్థలం, అంతకన్నా తక్కువ స్థలంలో శాశ్వత, తాత్కాలిక షాప్‌లు ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు.
  • రుణం మొత్తం తీర్చిన వారికి బ్యాంకులు మళ్లీ వడ్డీ లేని రుణాలు ఇస్తాయి. ఆ వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తుంది.
  • ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయో చూసి, వాటిని పరిశీలించి, ఆరు నెలలకు ఒకసారి వారికి రుణాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : జగనన్న తోడు’ పథకం కింద రెండో రూ.370 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : రాష్ట్ర వ్యాప్తంగా...
ఎందుకు : చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించేందుకు...
Published date : 09 Jun 2021 07:27PM

Photo Stories