Skip to main content

భారత్, చైనా మధ్య 12వ దఫా సైనిక చర్చలు

బలగాల ఉపసంహరణపై భారత్, చైనా మధ్య 12వ దఫా సైనిక చర్చలు జూలై 31న తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) సమీపంలో చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌ వద్ద జరిగాయి.
ఇరు దేశాల సైనికాధికారుల మధ్య దాదాపు 9 గంటలపాటు చర్చలు జరిపారు. తూర్పు లద్దాఖ్‌లోని డెస్పాంగ్, హాట్‌స్ప్రింగ్స్, గోగ్రాతోపాటు ఇతర కీలక ప్రాంతాల నుంచి చైనా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని ఈ సందర్భంగా భారత్‌ పునరుద్ఘాటించింది. ఈ భేటీలో చివరకు ఏం తేల్చారన్న దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

భారత్, చైనా నడుమ 11వ దఫా చర్చలు 2021, ఏప్రిల్‌ 9వ తేదీన 13 గంటలపాటు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన 12వ దఫా చర్చల్లో భారత్‌ తరపున లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మీనన్‌ పాల్గొన్నారు.

జైషే టాప్‌ కమాండర్‌ హతం
జమ్మూ, కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జూలై 31న జరిగిన ఎదురుకాల్పుల్లో పాక్‌కు చెందిన జైషే మొహమ్మద్‌ కశ్మీర్‌ కమాండర్, ఆ సంస్థ చీఫ్‌ మసూద్‌ అజార్‌ మేనల్లుడు, 2019 పుల్వామా దాడి సూత్రధారిగా భావిస్తున్న మొహమ్మద్‌ ఇస్మాయిల్‌ అల్వి సహా మరొకరు హతమయ్యారు. మొహమ్మద్‌ మొహమ్మద్‌ ఇస్మాయిల్‌ అల్వి అలియాస్‌ లంబూకు అబూ సైఫుల్లా అనీ ఫౌజీ భాయి అని కూడా పేర్లున్నాయి. పాకిస్తాన్‌లోని బహావల్పూర్‌లోని కోసర్‌ కాలనీకి చెందిన ఇతను 2017లో కశ్మీర్‌లోకి అక్రమంగా చొరబడ్డాడు. ఇతడిపై 14 కేసులు నమోదయ్యాయి.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : భారత్, చైనా మధ్య 12వ దఫా సైనిక చర్చలు
ఎప్పుడు : జూలై 31
ఎవరు : భారత్, చైనా సైన్యాధికారులు
ఎక్కడ : తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ సమీపంలో చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌ వద్ద
ఎందుకు : తూర్పు లద్దాఖ్‌లో పలు ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాల ఉపసంహరణపై చర్చలు జరిపేందుకు...
Published date : 02 Aug 2021 06:00PM

Photo Stories