బొగ్గు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రికి జైలు శిక్ష
Sakshi Education
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో 1999లో బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే(68)కు ఢిల్లీ కోర్టు అక్టోబర్ 26వ తేదీన మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
సాధారణ నేరాల కంటే ఇలాంటి వైట్‌కాలర్ నేరాలు అత్యంత ప్రమాదకరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ కేసులో దిలీప్ రేతోపాటు అప్పటి బొగ్గు శాఖ అధికారులు అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతమ్‌కు సైతం ఢిల్లీ హైకోర్టు ప్రత్యేక జడ్జి భరత్ పరాశర్ మూడేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాకుండా క్యాస్ట్రన్ టెక్నాలజీస్ లిమిటెడ్(సీటీఎల్) డెరైక్టర్ మహేంద్రకుమార్ అగర్వాల్‌కు కూడా మూడేళ్ల జైలు శిక్ష విధించారు. దిలీప్ రే 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. బొగ్గు కుంభకోణంలో న్యాయస్థానం ఆయనకు రూ.10 లక్షల జరిమానా విధించింది. బెనర్జీ, గౌతమ్‌కు రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించింది. రూ.60 లక్షల జరిమానా చెల్లించాలని మహేంద్రకుమార్ అగర్వాల్‌ను ఆదేశించింది. తీర్పును సవాలు చేస్తూ దోషులు ఉన్నత న్యాయస్థానానికి వెళ్లొచ్చని సూచించింది. ఈ మేరకు వారికి బెయిల్ మంజూరు చేసింది.
Published date : 27 Oct 2020 05:48PM