Skip to main content

బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 39వ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో అక్టోబర్ 23న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ అక్టోబర్ 23నే బాధ్యతలు స్వీకరించారు. దీంతో బీసీసీఐ అధ్యక్షుడిగా తొమ్మిది నెలల పాటు గంగూలీ కొనసాగనున్నాడు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ (ఆరేళ్లపాటు క్రికెట్ సంఘాల పదవిలో ఉన్నాక... తప్పనిసరిగా మూడేళ్ల విరామం) నిబంధన కారణంగా కొత్త కార్యవర్గంలో గంగూలీ, జై షా, జయేష్ జార్జ్ పూర్తిగా మూడేళ్లపాటు పదవిలో కొనసాగే అవకాశం లేదు.

బీసీసీఐ నూతన కార్యవర్గం
అధ్యక్షుడు:
సౌరవ్ గంగూలీ (బెంగాల్ క్రికెట్ సంఘం)
కార్యదర్శి: జై షా (కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడైన 31 ఏళ్ల జై షా బీసీసీఐలో అత్యంత పిన్న వయస్కుడైన ఆఫీస్ బేరర్. 2013 నుంచి గుజరాత్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నాడు.)
ఉపాధ్యక్షుడు: మహిమ్ వర్మ (పదేళ్ల పాటు ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించిన 45 ఏళ్ల మహిమ్.. సెప్టెంబరులో సంఘానికి బీసీసీఐ గుర్తింపు లభించాక కార్యదర్శి అయ్యాడు.)
కోశాధికారి: అరుణ్ సింగ్ ధుమాల్ (బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడైన 44 ఏళ్ల అరుణ్.. 2012-15 మధ్య హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పీసీఏ) ఉపాధ్యక్షుడిగా పని చేశాడు.)
సంయుక్త కార్యదర్శి: జయేష్ జార్జ్ (2005 నుంచి కేరళ క్రికెట్ సంఘంలో అనేక పదవుల్ని నిర్వర్తించిన 50 ఏళ్ల జయేశ్.. 2019 ఏడాదే అధ్యక్ష పీఠాన్నీ అందుకున్నాడు.)

తప్పుకున్న సీవోఏ..
బీసీసీఐ నూతన కార్యవర్గం పూర్తిస్థాయి పగ్గాలు చేపట్టడంతో.. 33 నెలల పాటు బీసీసీఐని నడిపించిన సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ(సీవోఏ) బాధ్యతల నుంచి తప్పుకొంది. సీఓఏ కమిటీ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీల పదవీ కాలానికి ఒక్కొక్కరికి రూ. 3.5 కోట్లు చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించింది.
Published date : 24 Oct 2019 05:47PM

Photo Stories