Skip to main content

Avani Lekhara: టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన భారత షూటర్‌?

టోక్యో పారాలింపిక్స్‌–2020లో భారత టీనేజ్‌ షూటర్‌ అవనీ లేఖరా బంగారు పతకం సాధించింది.
టోక్యోలో 2021, ఆగస్టు 30న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌ ఎస్‌హెచ్‌–1 కేటగిరీలో 19 ఏళ్ల అవనీ విజేతగా నిలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తద్వారా విశ్వ క్రీడల్లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవని చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే స్వర్ణ పతకం నెగ్గి చిరస్మరణీయ ప్రదర్శన నమోదు చేసింది.

ప్రపంచ రికార్డు సమం...
ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అవని మొత్తం 249.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2018లో 249.6 పాయింట్లతో ఇరీనా షెట్‌నిక్‌ (ఉక్రెయిన్‌) నెలకొల్పిన ప్రపంచ రికార్డును అవని సమం చేసింది. 248.9 పాయింట్లతో క్యూపింగ్‌ జాంగ్‌ (చైనా) రజతం... 227.5 పాయింట్లతో ఇరీనా షెట్‌నిక్‌ (ఉక్రెయిన్‌) కాంస్యం గెలిచారు.

2017లో అరంగేట్రం...
రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌ అవనీ లేఖరా స్వస్థలం. 2012లో జరిగిన కారు ప్రమాదంలో ఆమె వెన్నుపూస విరిగిపోయింది. దాంతో వీల్‌చైర్‌లోనే ఆమె ఉండాల్సి వచ్చింది. తదనంతరం షూటింగ్‌పై ఆసక్తిని పెంచుకుంది. 2017లో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం జరగ్గా, జూనియర్‌ స్థాయిలో ప్రపంచ రికార్డుతో సత్తా చాటింది. అదే ఏడాది బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్యంతో తొలిసారి అవని వెలుగులోకి వచ్చింది. తర్వాతి ప్రపంచకప్‌ (క్రొయేషియా)లో అంతకంటే మెరుగైన ప్రదర్శనతో రజతం సాధించిన ఆమె... 2019లోనూ దానిని నిలబెట్టుకుంది. భారత మాజీ షూటర్‌ సుమా శిరూర్‌ ఈ ప్రస్థానంలో అవనికి కోచ్‌గా వ్యవహరించింది.

ప్రస్తుతం...
ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న అవని రాజస్తాన్‌ రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖలో అసిస్టెంట్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ హోదాలో విధులు నిర్వహిస్తోంది. మరోవైపు జైపూర్‌ యూనివర్సిటీ నుంచి ‘లా’ కూడా చదువుతోంది. తాజాగా స్వర్ణం గెలిచిన తమ రాష్ట్రానికి చెందిన షూటర్‌ అవనికి రూ. 3 కోట్లు అందజేస్తామని రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోట్‌ ప్రకటించారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : టోక్యో పారాలింపిక్స్‌–2020 మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌ ఎస్‌హెచ్‌–1 కేటగిరీలో స్వర్ణం సాధించిన భారతీయ క్రీడాకారిణి?
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : భారత టీనేజ్‌ షూటర్‌ అవనీ లేఖరా
ఎక్కడ : టోక్యో, జపాన్
Published date : 31 Aug 2021 06:11PM

Photo Stories