Skip to main content

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన తెలుగు కవి?

2020 ఏడాదికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చే వార్షిక సాహిత్య అకాడమీ పురస్కారాల వివరాలను అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు మార్చి 12న ప్రకటించారు.

Current Affairs

మొత్తం 20 భాషల్లో కవిత్వానికి సంబంధించి 7 రచనలు, 4 నవలలు, ఐదు సంక్షిప్త కథల పుస్తకాలు, రెండు నాటికలు, స్మృతులు, ఇతిహాస కవిత్వానికి సంబంధించి ఒక్కో రచనకు సాహిత్య పురస్కారాలు దక్కాయి. ఈ పురస్కారం కింద రూ.లక్ష నగదు, తామ్ర పత్రం, శాలువాతో సత్కరిస్తారు.

తెలుగు భాషలో నిఖిలేశ్వర్‌కు...
తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత నిఖిలేశ్వర్‌కు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2015–17 మధ్య ఆయన రాసిన ‘‘అగ్నిశ్వాస’’ కవితా సంపుటికి గాను ఈ పురస్కారం లభించింది.

ఎండ్లూరి మానసకు యువ పురస్కార్‌...
2020 ఏడాదికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ మొత్తం 18 భాషల్లో రచనలకు యువ పురస్కాలను ప్రకటించింది. 10 కవిత్వ రచనలు, 3 సంక్షిప్త కథల పుస్తకాలు, రెండు వ్యాస సంకలనాలు, ఒక స్మృతి రచన, ఒక విమర్శనాత్మక రచన, ఒక ట్రావెలాగ్‌ రచన ఈ పురస్కారాలకు ఎంపికయ్యాయి. ‘మిళింద’ సంక్షిప్త కథల పుస్తక రచనకు గాను ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన ఎండ్లూరి మానసకు యువ పురస్కార్‌–2020 దక్కింది. ఈ పురస్కారం కింద రూ.50 వేల నగదు, తామ్ర పత్రం అందజేస్తారు.

కన్నెగంటి అనసూయకు బాలసాహిత్య పురస్కారం...
2020 ఏడాదికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ... వివిధ భాషల్లో 21 మంది రచయితలను బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. తెలుగులో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి కన్నెగంటి అనసూయకు బాల సాహిత్య పురస్కారం లభించింది. 2018లో ఆమె రచించిన ‘స్నేహితులు’ అనే 15 సంక్షిప్త కథల సంకలనానికి ఈ పురస్కారం దక్కింది. ఈ పురస్కారం కింద రూ.50 వేల నగదు, తామ్రపత్రం అందజేస్తారు.

కలం పేరు నిఖిలేశ్వర్‌..
అకాడమీ అవార్డుకు ఎంపికైన నిఖిలేశ్వర్‌ ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు. తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లోనూ పలు రచనలు, అనువాదాలు చేశారు. ఆయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి. నిఖిలేశ్వర్‌ అనేది ఆయన కలం పేరు. 1938 ఆగస్టు 11న నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలోని వీరవెల్లిలో ఆయన జన్మించారు. దిగంబర కవిత్వం మూడు కవితా సంపుటాలను వెలువరించిన నిఖిలేశ్వర్‌... మండుతున్న తరం, అగ్నిశ్వాస, ఈనాటికీ, ఎవరిదీ ప్రజాస్వామ్యం వంటి రచనలు చేశారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు–2020కు ఎంపికైన తెలుగు కవి?
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : నిఖిలేశ్వర్‌(కుంభం యాదవరెడ్డి)
ఎందుకు : అగ్నిశ్వాస కవితా సంపుటిని రచించినందుకుగాను
Published date : 20 Sep 2021 06:07PM

Photo Stories